Keesara Police Station ACB Trap: కీసర చెరువు వద్ద ఏసీబీ హైవోల్టేజ్ ఆపరేషన్ - రూ. 5 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన ఎస్ఐ, సీఐ! అసలు పట్టించింది బిర్యానీనే!

1 hour ago

Keesara lake ACB trap: కీసర పీఎస్ ఎస్ఐ , సీఐ రూ. 5 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. లంచం మాత్రమే కాకుండా బిర్యానీ కోసం కూడా వేధించడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.

Keesara SI Gnanender Reddy caught taking 5 lakh bribe:  పోలీసు యూనిఫాంను కలెక్షన్లకు ఆయుధంగా మార్చుకున్న పోలీసులు ఏసీబీకి దొరికిపోయారు.  కస్టడీ భయం చూపిస్తూ, పీడీఎస్ బియ్యం వ్యాపారి నుండి రూ. 10 లక్షలు దండుకోవాలని ప్లాన్ చేసిన కీసర స్టేషన్ అధికారులు.. చివరికి రూ. 5 లక్షలకు బేరం కుదుర్చుకుని  ఏసీబీ వలలో చిక్కుకున్నారు. స్టేషన్ బెయిల్ కోసం బెదిరింపులు, ప్రతిరోజూ చికెన్ బిర్యానీలు, కూల్ డ్రింక్‌ల డిమాండ్లతో బాధితుడిని నరకం చూపించిన ఆ పోలీసు అధికారులు చివరికి దొరికిపోయారు. 

కీసర పీఎస్ పరిధిలో పీడీఎస్ బియ్యం కేసులో ఇరుక్కున్న ఒక వ్యక్తి వద్ద నుంచి కీసర సర్కిల్ ఇన్‌స్పెక్టర్   అర్కపల్లి అంజనేయులు, సబ్ ఇన్‌స్పెక్టర్  జ్ఞానేందర్ రెడ్డి ఏకంగా రూ. 10 లక్షల లంచం డిమాండ్ చేశారు. బాధితుడు అంత ఇచ్చుకోలేనని వేడుకోవడంతో రూ. 5 లక్షలకు డీల్ కుదిరింది. అయితే ఈ కాష్ కొట్టే వ్యవహారం ఇక్కడితో ఆగలేదు. కేవలం డబ్బులే కాకుండా.. గడిచిన కొద్ది రోజులుగా బాధితుడిని తమ కంట్రోల్‌లో ఉంచుకుంటూ రోజూ బిర్యానీలు, లీటర్ల కొద్దీ కూల్ డ్రింక్‌లు తెప్పించుకోవడం,  అసభ్య పదజాలంతో వేధించడం అలవాటుగా మార్చుకున్నారు.

వేధింపులు భరించలేని బాధితుడు సీక్రెట్‌గా అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ఆధారాలు సేకరించిన ఏసీబీ డిఎస్పీ మజీద్ అలీ ఖాన్ పర్యవేక్షణలోని బృందం, వేటగాళ్లలా లంచం తీసుకునే సమయం కోసం వేచి చూసింది. మరోవైపు, వినాయక నిమజ్జనం డ్యూటీలో ఉన్న ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి, సెప్టెంబర్ 16 రాత్రి సమయాన్ని వేదికగా చేసుకుని బాధితుడిని కీసర చెరువు వద్దకు పిలిపించారు. నిమజ్జనం అలికిడి నడుమ ఎలాంటి అనుమానం రాదని ఎస్ఐ భావించాడు.

కారులో కూర్చుని బాధితుడి నుంచి రూ. 5 లక్షల లంచం నగదు అందుకోగానే, చెట్ల పొదల వెనుక దాగి ఉన్న ఏసీబీ బృందం మెరుపు వేగంతో విరుచుకుపడింది. పక్కనే ఉన్న ఏసీబీ అధికారులను చూడగానే ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి కారు దిగి తప్పించుకునేందుకు పరుగులు తీసే ప్రయత్నం చేశాడు. కానీ, ఏసీబీ అధికారులు అతడిని కదలనివ్వకుండా చుట్టుముట్టి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సీఐ అంజనేయులు సూచనల మేరకే ఈ వసూళ్లకు దిగినట్లు విచారణలో తేలడంతో ఆయనపై కూడా కేసు నమోదు చేశారు.

లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారుల దాడి అక్కడితో ముగియలేదు. అర్థరాత్రి నుంచే కీసర పోలీస్ స్టేషన్‌లో పాటు ఇన్‌స్పెక్టర్ అంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డిల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు  నిర్వహించారు. స్టేషన్‌లోని రికార్డులు, బియ్యం కేసు ఫైళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన ఖాకీలు ఇలా దందాలు, బిర్యానీల బెదిరింపులకు పాల్పడి ఏసీబీ కి దొరికిపోవడం పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

ఈ విచారణ ప్రక్రియ ముగిసిన అనంతరం ఇద్దరు అధికారులను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. ప్రజలను రక్షించాల్సిన పోలీస్ అధికారులే పీడీఎస్ బియ్యం కేసుల ముసుగులో ఇలాంటి లంచాల రాకెట్ నడపడం గమనార్హం. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన పూర్తి విచారణ కొనసాగుతోంది. 

Click here to Read More
Previous Article
Hussain Sagar Ganesh immersion rules 2026: ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనాల్లేవ్ - నిషేధం బోర్డులు పెట్టిన అధికారులు - మరి ఖైరతాబాద్ గణేశుడి పరిస్థితేంటి?

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment