Khairatabad Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ మహాగణపతి.. బైబై గణేశా అంటూ వీడ్కోలు పలికిన భక్తులు

58 minutes ago

Khairatabad Bada Ganesh Immersion | 69 అడుగుల ఖైరతాబాద్ పంచముఖ సంకటహర మహాగణపతి నిమజ్జనం హుస్సేన్‌సాగర్‌లోని క్రేన్ నంబర్ 4 వద్ద మధ్యాహ్నం భక్తుల జయజయధ్వనాల మధ్య విజయవంతంగా పూర్తయింది.

Khairatabad Bada Ganesh Nimajjanam | హైదరాబాద్: ఖైరతాబాద్‌ గణేశుడి నిమజ్జనం విజయవంతంగా పూర్తయింది. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో 'పంచముఖ సంకటహర మహాగణపతి'గా దర్శనమిచ్చిన స్వామి గంగమ్మ ఒడికి చేరాడు. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్ 4 వద్ద మధ్యాహ్నం 2.15 గంటలకు భారీ క్రేన్ల సాయంతో నిమజ్జన ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. హుస్సేన్‌సాగర్‌ వద్దకు చేరుకుని భక్తులు బైబై గణేశా అంటూ నినాదాలు చేస్తుంటే గంగమ్మ ఒడికి చేరాడు.

శుక్రవారం ఉదయం ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ఆలస్యంగా ప్రారంభమైనా నిమజ్జనం మాత్రం కాస్త వేగంగా జరిగిందని చెప్పవచ్చు. ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభ కావాల్సి ఉండగా, బాహుబలి క్రేన్ పైపులలో టెక్నికల్ ప్రాబ్లం కారణంగా దాదాపు మూడు గంటలు లేటయింది. ఉదయం  9.30 గంటలకు ఖైరతాబాద్ నుంచి బడా గణేశుడి శోభాయాత్ర కనులపండువగా ప్రారంభమైంది. సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్ నుంచి ఇక్బాల్ మినార్, తెలంగాణ తల్లి చౌరస్తా మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వరకు ఈ ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర సాగింది. ఈ ఏడాది కూడా బడా గణేషుడ్ని పర్యావరణ హితంగా మట్టితోనే రూపొందించారు.

దానం నాగేందర్ స్టెప్పులతో భక్తుల్లో హుషారు

అంతకుముందు శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే దానం నాగేందర్ బడా గణేష్ వాహనం ముందు డ్యాన్స్ చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎమ్మెల్యే పదవిపై సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలినా.. శోభాయాత్ర సమయంలో అక్కడికి చేరుకుని హుషారుగా డ్యాన్స్ చేస్తూ భక్తుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకున్న తర్వాత ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మహాగణపతికి చివరగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఖైరతాబాద్ శోభాయాత్రలో విషాదం..

ఖైరతాబాద్ బడా గణేశుడితో పాటు రకరకాల రూపాల్లో హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకుంటున్న నిమజ్జనాలను వీక్షించేందుకు భక్తులు వేలాదిగా భక్తులు ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్‌కు తరలివచ్చారు. అవాంఛిత ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. అయితే ఉదయం ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రకు ముందే అక్కడ విషాదం చోటుచేసుకుంది.  డ్యాన్స్ చేస్తున్న యువకులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో, భయాందోళనకు గురైన 20 ఏళ్ల యువకుడు తప్పించుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ ట్రక్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఖైరతాబాద్‌ వద్ద మెట్రో పిల్లర్ నంబర్ 1167 సమీపంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల అత్యుత్సాహం వల్లే ఈ ఘోరం జరిగిందని మృతుడి స్నేహితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ ఘటనతో ఆగ్రహించిన తోటి యువకులు, మృతుడి స్నేహితులు ఖైరతాబాద్ జంక్షన్ వద్ద రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. బాధ్యులైన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే నిరసనకారులను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి లాగిపడేసి ఆందోళనను విరమింపజేసేందుకు యత్నించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి మృతుడి వివరాలపై దర్యాప్తు చేపట్టారు.

Click here to Read More
Previous Article
Khairatabad Ganesh Immersion: ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర లైవ్ ఇక్కడ చూడండి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment