AP local body elections 2026: స్థానిక పోరులో వైఎస్‌ఆర్‌సీపీ భయం - పోటీ చేయకపోతే శత్రువులే! తాడేపల్లి ఒత్తిడిపై క్యాడర్ ఆందోళన!

1 hour ago

YSRCP candidates crisis: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వైఎస్‌ఆర్‌సీపీ ఒత్తిడికి గురవుతోంది. బరిలో నిలిచేందుకు నిరాకరిస్తున్న ద్వితీయ శ్రేణి నేతలను బెదిరిస్తున్నారు ఆ పార్టీ నేతలు.

YS Jagan warning to local leaders contest local body polls:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  వర్గాల్లో తీవ్ర అభద్రతాభావం, కంగారు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుండి స్థానిక నాయకులు, ఇన్‌ఛార్జ్‌లపై వస్తున్న ఆదేశాలు, హెచ్చరికలు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళానికి దారితీస్తున్నాయి.  ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే, వెనకడుగు వేస్తే పార్టీ శత్రువులుగానే భావిస్తాం  అంటూ అధిష్ఠానం స్పష్టమైన హెచ్చరికలు జారీ చేయడం వెనుక వైఎస్‌ఆర్‌సీపీ ఎదుర్కొంటున్న కఠినమైన రాజకీయ పరిస్థితికి సాక్ష్యంగా కనిపిస్తోంది. 

పోటీకి ద్వితీయ శ్రేణి నేతల అనాసక్తి

సమస్య  హైకమాండ్  ఆదేశాల్లో కాదు.. క్షేత్రస్థాయిలో అభ్యర్థులు సిద్ధంగా లేకపోవడంలోనే ఉందనేది స్పష్టమవుతోంది. గ్రామాలు, మండలాల్లో పోటీ చేయగల ఆర్థిక, అంగ బలం ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరూ కూడా ప్రస్తుతం  బరిలోకి దిగేందుకు మొగ్గు చూపడం లేదు. 2024 సాధారణ ఎన్నికల ఓటమి తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ గ్రాఫ్ గణనీయంగా పడిపోవడం, నియోజకవర్గ స్థాయి అగ్రనేతలు సైతం సైలెంట్ అయిపోవడం , కూటమి వైపు చూడటంతో దిగువ స్థాయి నాయకత్వం తీవ్ర దిక్కుతోచని స్థితిలో పడింది. పోటీకి కావాల్సిన భారీ వ్యయాన్ని భరించి, రాజకీయంగా రిస్క్ తీసుకోవడానికి చాలామంది స్థానిక నేతలు వెనకాడుతున్నారు.

శత్రువులుగా చూస్తామని క్యాడర్ ను బెదిరిస్తున్న నియోజకవర్గ ఇంచార్జులు   

పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, పాత ఎమ్మెల్యేలకు కూడా గ్రామాలు, వార్డుల వారీగా అభ్యర్థులను వెతికి పట్టుకోవడం గగనతలమవుతోంది. బలమైన ఆర్థిక స్థోమత ఉన్న నేతలు ఇప్పటికే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పార్టీల కండువాలు కప్పుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుండగా, మిగిలిన మధ్యస్థ నాయకులు పోటీకి దూరంగా ఉంటూ తటస్థంగా ఉండిపోవాలని భావిస్తున్నారు.  పోటీ నుంచి తప్పుకుంటే భవిష్యత్తులో పార్టీలో స్థానం ఉండదు, మిమ్మల్ని శత్రువులుగా చూస్తాం అనే రీతిలో బెదిరింపుల రూపంలో ఒత్తిడి తెస్తుండటంతో వైఎస్‌ఆర్‌సీపీ క్యాడర్ నలిగిపోతోంది.

గతంలో స్థానిక ఎన్నికల జరిగిన తీరుతో మరిన్ని చిక్కులు

ఈ భయానికి, ఆందోళనకు 2019-2024 మధ్య వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన స్థానిక ఎన్నికల తీరే ప్రధాన కారణమని స్థానిక నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో ఏకగ్రీవాల పేరిట, అధికార బలాన్ని ప్రయోగించి ప్రత్యర్థులను పోటీ చేయకుండా నిరోధించారనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మారడం, కూటమి అధికారంలోకి రావడంతో  తాము పోటీకి దిగితే పాత బకాయిలు, రాజకీయ కక్షసాధింపులు, కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో ద్వితీయ శ్రేణి నేతలు వెనకడుగు వేస్తున్నారు. మరొక ప్రధానమైన అంశం.. నామినేషన్ల ఖర్చులు, ఎన్నికల నిర్వహణ వ్యయాన్ని పార్టీ పరంగా భరిస్తారా లేదా అనే దానిపై అధిష్ఠానం స్పష్టత ఇవ్వకపోవడం. కేవలం టికెట్ ఇస్తాం, పోటీ చేయండి  అని ఒత్తిడి చేయడం తప్ప, ఓడిపోతే రక్షణగా ఉండే రాజకీయ అభయం గానీ, ఆర్థిక చేయూత గానీ దక్కదనే నమ్మకలేమి క్షేత్రస్థాయిలో బలంగా పాతుకుపోయింది. దీంతో ప్రతిష్టాత్మక స్థానిక ఎన్నికల్లో ఖాళీగా మిగిలిపోతే పార్టీ ఉనికికే ప్రమాదమని భావించిన అధిష్ఠానం, ఒత్తిడి తంత్రాలను ప్రయోగిస్తోంది.

 

 అధికారంలో ఉన్నప్పుడు చూపిన దూకుడు, ఓడిపోయాక క్యాడర్‌కు అందించాల్సిన భరోసాగా మారలేకపోవడమే వైఎస్‌ఆర్‌సీపీ ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణం. హెచ్చరికలు, ఒత్తిళ్లతో నామినేషన్లు వేయించగలరేమో గానీ, గ్రామాల్లో కార్యకర్తల్లో కసిని, ఆత్మవిశ్వాసాన్ని నింపలేరనేది స్పష్టమవుతోంది. ఈ ఫోర్స్డ్ పోటీ వ్యూహం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీకి ఎంతవరకు మేలు చేస్తుందో లేక క్యాడర్‌ను పార్టీకి మరింత దూరం చేస్తుందో వేచి చూడాలి.

Click here to Read More
Previous Article
EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
Next Article
Erravalli Farmhouse Probe: రేవంత్ రెడ్డి భూముల అస్త్రం - బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి - ఫామ్ హౌస్‌ లెక్కలన్నీ బయటకు వస్తాయా?

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment