Revanth Reddy vs BJP Telangana: గాంధీ కుటుంబం కోసం ప్రాణమిస్తా - రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు వ్యూహం ఏంటి? బీజేపీ ఎందుకు టార్గెట్ చేస్తోంది?

2 hours ago

Congress High Command Revanth: గాంధీ కుటుంబం కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై కలకలం. హైకమాండ్ వద్ద పట్టు కోసమే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారా?

Revanth Reddy gandhi family loyalty:  తెలుగురాష్ట్రాల రాజకీయాల్లోనూ, జాతీయ రాజకీయ వర్గాల్లోనూ తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. కేరళ పర్యటనలో ఆయన  గాంధీ కుటుంబం కోసం అవసరమైతే ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధం  అని వ్యాఖ్యానించడం  కలకలం రేపింది.  ఈ ప్రకటనపై భారతీయ జనతా పార్టీ  తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. దేశం కోసం  ప్రాణాలు ఇస్తామని అనాల్సింది పోయి, ఒక నిర్దిష్ట కుటుంబం కోసం ప్రాణాలు ఇస్తామనడం కాంగ్రెస్ పార్టీలోని  బానిసత్వ సంస్కృతికి  నిదర్శనమని విమర్శిస్తోంది.  

 అవుట్‌సైడర్ ముద్రను చెరిపేసే ప్రయత్నం 

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో మూలాలు ఉన్న నాయకుడు కాదు. ఆయన విద్యార్థి రాజకీయాల నుంచి ఏబీవీపీ, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ  ద్వారా గుర్తింపు పొంది, పదేళ్ల క్రితం మాత్రమే కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే టీపీసీసీ అధ్యక్షుడు కావడం, ఆపై సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం వెనుక ఆయన సొంత ప్రతిభ ఎంత ఉందో, గాంధీ కుటుంబం ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ  ఇచ్చిన మద్దతు కూడా అంతే ఉంది. పార్టీలోని సీనియర్లు ఇప్పటికీ ఆయనను మాజీ టీడీపీ నేత గానే చూస్తుంటారు. ఈ  కారణంగా  గాంధీ కుటుంబం పట్ల తనకు ఉన్న నిరపేక్షమైన కట్టుబాటును, విశ్వాసాన్ని చాటుకోవడానికే రేవంత్ ఈ స్థాయి భావోద్వేగ ప్రకటన చేశారు.

 ఢిల్లీ పీఠంపై పట్టు - హైకమాండ్ రక్షణ కవచం 

తెలంగాణ కాంగ్రెస్‌లో పాత తరం సీనియర్ నాయకుల నుంచి రేవంత్ రెడ్డికి లోపాయికారీగా సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. ఇటీవల సొంత పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోని ప్రత్యర్థులను, సొంత పార్టీలోని అసమ్మతివాదులను చెక్ చేయాలంటే అధిష్ఠానం ఆశీస్సులు రేవంత్‌కు అత్యంత కీలకం. గాంధీ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా, నమ్మకస్తుడిగా తన ఇమేజ్‌ను ప్రొజెక్ట్ చేసుకోవడం ద్వారా, తెలంగాణలో తన పదవికి లేదా నాయకత్వానికి ఎలాంటి ముప్పు లేకుండా హైకమాండ్ రక్షణ కవచాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరియు రాహుల్ గాంధీ టార్గెట్‌గా బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇటువంటి సమయంలో, దక్షిణాదిలో బలమైన సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి బహిరంగంగా రాహుల్ గాంధీ వెనుకే నిలబడటం వల్ల పార్టీ కేడర్‌కు ఒక స్పష్టమైన సందేశం వెళ్తుంది. గాంధీ కుటుంబమే కాంగ్రెస్ ఐక్యతకు మూలస్తంభమని నమ్మే కాంగ్రెస్ సంప్రదాయ శ్రేణులను తన వైపు తిప్పుకోవడానికి ఇది ఒక వ్యూహాత్మక అడుగు.

 బీజేపీ పొలిటికల్ కౌంటర్ దేశమా? కుటుంబమా?   

రేవంత్ వ్యాఖ్యలను బీజేపీ తమకు రాజకీయ ఆయుధంగా మలచుకుంది. ప్రతిపక్షాలపై దాడి చేసేందుకు ఇది నూతన అవకాశాన్ని ఇచ్చింది. జన నాయకులు ప్రజలకు, దేశానికి విధేయులుగా ఉండాలి తప్ప ఒక కుటుంబానికి కాదు  అని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ఇంకా  రాజకుటుంబం  చుట్టూనే తిరుగుతోందని, సమాఖ్య వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడటం పదవీ ప్రమాణ స్వీకార స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మంత్రివర్గ విస్తరణ లేదా కీలక నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ జరగనుంది. అధిష్టానంతో నేరుగా సంబంధాలు ఉండటం, తన వ్యాఖ్యలతో గాంధీ కుటుంబాన్ని మెప్పించడం ద్వారా, కేబినెట్ నిర్ణయాల్లో ,  పార్టీ నిర్ణయాల్లో తనదే తుది నిర్ణయంగా మార్చుకునే పట్టును రేవంత్ సాధించాలనుకుంటున్నారు. హైకమాండ్ వద్ద తన గ్రాఫ్ నిలకడగా ఉంటేనే రాష్ట్రంలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలరనేది ఆయన ఆలోచన. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల పరంగా ఆయనకు ప్లస్ పాయింట్ కావచ్చు. హైకమాండ్ దృష్టిలో ఆయన మార్కులు పెంచుకోవచ్చు. కానీ ప్రజాక్షేత్రంలో, జాతీయస్థాయి చర్చల్లో మాత్రం బీజేపీకి ఇది మంచి పొలిటికల్ కంటెంట్‌గా మారింది.  కార్యకర్తగా పార్టీకి విధేయుడిగా ఉండటం వేరు.. రాజ్యాంగబద్ధమైన సీఎం పదవిలో ఉండి ఒక కుటుంబంపై వ్యక్తిగత నిష్ఠను ప్రకటించడం వేరు  అనే చర్చ సామాన్య ప్రజల్లో సాగుతోంది.

 

Click here to Read More
Previous Article
Health Tests After 30 : బీపీ, షుగర్, కొలెస్ట్రాల్.. 30 తర్వాత ఈ హెల్త్ చెకప్స్ తప్పక చేయించుకోండి
Next Article
YSRCP Leaders Joining Janasena: జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment