Danam Nagender:ఉపఎన్నికల్లో పోటీ చేస్తా.. ఏ పార్టీనో తరవాత చెబుతా - క్లారిటీ మిస్సయిన దానం

2 hours ago

Khairatabad bypoll Danam Nagender: ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక ఏ పార్టీ తరపున పోటీ చేసేది ప్రకటిస్తానని దానం నాగేందర్ చెబుతున్నారు. కాంగ్రెస్ తరపున పోటీ చేస్తానని చెప్పకపోవడం ఆసక్తికరంగా మారింది.

Khairatabad assembly by-election :   తన శాసనసభ సభ్యత్వంపై సుప్రీంకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పును  పూర్తీగా స్వాగతిస్తున్నానని ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. న్యాయపోరాటంలో భాగంగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం తన రాజ్యాంగబద్ధమైన హక్కు అని, లీగల్ పోరాటం చేయడంలో ఎలాంటి తప్పు లేదని ఆయన వ్యాఖ్యానించారు. తీర్పు వెలువడిన వెంటనే మీడియాతో మాట్లాడిన దానం.. రాబోయే ఉపఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని ఘంటాపథంగా చెప్పారు.

ఖైరతాబాద్‌కి ఉపఎన్నిక అనివార్యమైనందున తన వ్యూహాలను దానం నాగేందర్ బయటపెట్టారు. ఉపఎన్నికల్లో తాను బరిలో దిగడం వంద శాతం ఖాయమని, అయితే ఏ పార్టీ గుర్తుపై పోటీ చేయాలనే అంశాన్ని ఇప్పుడు వెల్లడించనని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత, సమయానుకూలంగా తాను ఏ పార్టీ తరఫున బరిలోకి దిగేది స్వయంగా మీడియా ముఖంగా ప్రకటిస్తానని స్పష్టం చేశారు.

అలాగే, తన తీరుపై వస్తున్న రాజకీయ ప్రచారాలకు దానం నాగేందర్ చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. గతంలో తెలంగాణ హైకోర్టు తన అనర్హతపై నెగెటివ్ తీర్పు ఇచ్చినప్పుడు కూడా తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవలేదని, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా సీఎంను కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ న్యాయపోరాటాన్ని తన వ్యక్తిగత చట్టపరమైన విషయంగానే చూశానని, రాజకీయ ఒత్తిళ్లతో ముడిపెట్టవద్దని కోరారు.

ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలతో తనకు దశాబ్దాలుగా అనుబంధం ఉందని, నియోజకవర్గ అభివృద్ధికి తాను నిరంతరం శ్రమించానని దానం గుర్తుచేశారు. ప్రజలే తన బలం అని, ఎన్నికలు రేపే వచ్చినా ఎదుర్కొనేందుకు తాను, తన అనుచరగణం సిద్ధంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో అనేక రాజకీయ సవాళ్లను ఎదుర్కొన్నానని, ఈ ఉపఎన్నికను కూడా ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు.

సుప్రీంకోర్టు తీర్పుతో ఖైరతాబాద్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు రాబోయే ఉపఎన్నికల బరిలో కొత్త సమీకరణాలకు దారితీసేలా ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ స్థానిక నేతలు ఇప్పటికే ఖైరతాబాద్ ఉపఎన్నికపై దృష్టి సారించగా, దానం ఏ పార్టీ గుర్తుపై పోటీ చేస్తారనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది.

Click here to Read More
Previous Article
DA For Employees: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 2 డీఏలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment