The Paradise Review - 'ది ప్యారడైజ్' రివ్యూ: నాని మాస్ మసాలా బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది? సినిమా హిట్టా? ఫట్టా?

1 hour ago

The Paradise Review Telugu: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన 'ది ప్యారడైజ్' థియేటర్లలో విడుదలైంది. 'దసరా' విజయం తర్వాత వీళ్ళిద్దరూ కలిసి చేసిన సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.

Nani Paradise Review In Telugu: నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన సినిమా 'ది ప్యారడైజ్'. 'దసరా'తో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ ఓదెల రెండో చిత్రమిది. అనిరుధ్ రవిచందర్ అందించిన పాటలు సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్ళాయి. నాని పోస్టర్లు వైరల్ అయ్యాయి. అంతే కాదు... మోహన్ బాబు, రాఘవ్ జూయల్ విలన్ రోల్స్ ఆసక్తి పెంచాయి. అందువల్ల, ట్రైలర్ లేకున్నా భారీ బజ్ ఏర్పడింది. మరి సినిమా ఎలా ఉంది? 'దసరా' తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల మరో విజయం అందుకుంటారా? లేదంటే డిజప్పాయింట్ చేశారా?

కథ (Nani Paradise Story): భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణ గడ్డపై సవారీ జాతికి దేశ పౌరసత్వం రాలేదు. షికంజా మాలిక్ (మోహన్ బాబు) కాలి కింద చెప్పులా జీవితాలు వెళ్లదీయాల్సిన పరిస్థితి. సారాయి బట్టీల్లో పని చేయడం, ఆ బట్టీల్లో కొట్టేసిన అర కొర బెల్లం ముక్కలతో పిల్లలను పోషించడం తప్ప మరో గత్యంతరం లేదు. సవారీ జాతిలోని సమ్మక్క (సోనాలి కులకర్ణి) తమకు గుర్తింపు ఇవ్వమని కలెక్టర్ కార్యాలయం ముందు పోరాటం చేస్తుంది. కానీ ప్రయోజనం ఉండదు.

సవారీ జాతి కోసం సమ్మక్క పోరాటం చేస్తుంటే... ఆమె కన్నకొడుకు జడల్ (నాని) మాత్రం తల్లిని అసహ్యించుకుంటాడు. ఎందుకు? అతడి చేతిపై టాటూ వెనుక కథేంటి? 14 ఏళ్ళు జైల్లో ఎందుకు ఉన్నాడు? సుబ్బు (కయాదు లోహర్)తో ప్రేమ ప్రయాణం ఏమిటి? షికంజా మాలిక్ తనయుడు విక్రమ్ మాలిక్ (రాఘవ్ జూయల్), జడల్ మధ్య ఏం జరిగింది? అది తెలిసి షికంజా మాలిక్ ఏం చేశాడు? అసలు సవారీ జాతికి పౌరసత్వం ఎందుకు రాలేదు? వాళ్ళ గుర్తింపు కోసం జడల్ ఏం చేశాడు? అనేది సినిమా.

విశ్లేషణ (Nani Paradise Analysis): విలన్ ఎంత పవర్‌ఫుల్ అయితే హీరోయిజం అంతకు అంత ఎలివేట్ అవుతుంది - దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి నుంచి ప్రశాంత్ నీల్ వరకు పలువురు దర్శకులు ఫాలో అయ్యే ఫార్ములా. పాన్ ఇండియా హిట్స్ సాధించిన యాక్షన్ ఫిలిమ్స్ చూస్తే... పవర్ ఫుల్ విలన్స్, తెరపై ఇప్పటి వరకు మనం చూడని కొత్త ప్రపంచాలు కనిపిస్తాయి. 'ది ప్యారడైజ్'లోనూ ఆ తరహా సెటప్ చక్కగా కుదిరింది. కానీ, అవుట్ పుట్ మాత్రం ఆశించినట్టు రాలేదు. నాని ఫ్యాన్స్ నుంచి ఆడియన్స్ వరకు అందరినీ కాస్త డిజప్పాయింట్ చేసేలా ఉంది. ఎందుకు? సమస్య ఎక్కడ వచ్చింది? అంటే...

'ది ప్యారడైజ్'లో హీరో కంటే ముందు విలన్ పరిచయం జరిగింది. నిండు చూలాలు అని కూడా చూడకుండా గర్భానికి కరెంట్ షాక్ ఇచ్చి పైశాచిక ఆనందం పొందే క్రూరుడిగా షికంజా మాలిక్ పాత్రలో మోహన్ బాబును చూపించారు. ఆ షాక్‌ను తట్టుకుని బతికిన తల్లిని, ఆమె గర్భంలో చావును జయించి భూమి మీదకు వచ్చిన వీరుడిగా హీరో జన్మను చూపించారు. అదొక 'హై' మూమెంట్. మంచి ఓపెనింగ్. అటువంటి ఓపెనింగ్, 'ది ప్యారడైజ్' ప్రపంచం పరిచయం చేసిన తీరు బావుంది. ఆ తర్వాత సినిమాలో... శ్రీకాంత్ ఓదెల రచన, దర్శకత్వంలో అంత 'హై' కనిపించలేదు.

శ్రీకాంత్ ఓదెల కథలో కొత్తదనం లేదు. కానీ, కొత్త ప్రపంచం ఉంది. ఇప్పటి వరకు తెలుగు పేక్షకులు చూడని కొత్త ప్రపంచాన్ని, సవారీ తెగను సృష్టించడంలో 100 శాతం సక్సెస్ అయ్యారు. అయితే... గుర్తింపు కోసం సవారీలు చేసే పోరాటంతో తెర ముందున్న ప్రేక్షకులు సవారీ చేసేలా చేయడంలో ఆయన సక్సెస్ కాలేదు. తెరపై కీలకమైన సన్నివేశాలు వస్తుంటే ఇంతకు ముందు వచ్చిన సినిమాల ఛాయలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా శ్రీకాంత్ ఓదెల కథపై 'కేజీఎఫ్' ప్రభావం మరీ అంటే మరీ ఎక్కువ కనిపించింది. బంగారు గనుల్లో తవ్వకాల కోసం కొంత మందిని బానిసలుగా చేసుకుని బయట ప్రపంచంతో వాళ్ళకు సంబంధాలు లేకుండా చేస్తాడు గరుడ. సవారీలను తన కాలికింద చెప్పుల్లా ఉంచుకుని బయట ప్రపంచం వాళ్ళకు సాయం చేయకుండా చేస్తాడు షికంజా మాలిక్. వాళ్ళకు హీరో ఎలా విముక్తి కల్పించాడు? అనేది రెండు కథల్లో కామన్ పాయింట్.

కామన్ కథలను కొత్తగా చూపిస్తే ప్రేక్షకులు ఆదరించిన సందర్భాలు ఉన్నాయి. 'ది ప్యారడైజ్'లో కథను పక్కన పెడితే... శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన తీరు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా లేదు. తల్లిని హీరో ఎందుకు అసహించుకుంటున్నాడు? అనేదానికి ఓ రీజన్ ఉంది. కానీ, ఆ ఎమోషన్ ఆడియన్ ఫీలయ్యేలా తీయలేదు. తల్లికి దూరంగా వెళ్ళిన కొడుకు, ఆమెను అసహించుకునే కొడుకు... మళ్ళీ ఇంటర్వెల్‌కు దగ్గర అవుతాడు. మధ్యలో ఏం చూపించినా చెల్లుతుందన్నట్టు తీశారు. హీరోయిన్ కావాలని కలలు కన్న ఓ అమ్మాయి, తండ్రి చేసిన అప్పులు తీర్చడం కోసం బీ గ్రేడ్ సినిమాలు చేయాలనుకోవడం షాకింగ్. దానికి ఇచ్చిన జస్టిఫికేషన్ అసలు బాలేదు. పైగా, హీరో చెప్పిన మాటలతో మోటివేట్ అయ్యి చేసినట్టు చూపించడం ఇంకా షాకింగ్. అయితే... టాటూకి ఇంటర్వెల్ ముందు సరైన రీజన్ ఇవ్వడం, తల్లిని హీరో అర్థం చేసుకోవడం బావున్నాయి. ఆ బ్యాంగ్ మళ్ళీ 'హై' ఇచ్చింది. అయితే... తల నరకుడు సీన్ 'కేజీఎఫ్'లో గరుడ తల నరికే సన్నివేశాన్ని, 'ఓజీ' ఇంటర్వెల్‌ను గుర్తు చేశాయి.

ఇంటర్వెల్ ముందు వరకు రచన, దర్శకత్వం పరంగా కొన్ని లోపాలు ఉన్నా సరే నాని నటన, యాక్షన్ సన్నివేశాలు కవర్ చేశాయి. పార్టులు పార్టులుగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. పాటలు, యాక్షన్ సీన్స్ మెప్పిస్తాయి. అయితే... ఇంటర్వెల్ తర్వాత ప్రేక్షకుల ఊహకు దూరంగా శ్రీకాంత్ ఓదెల వెళ్ళారు. పవర్ ఫుల్ విలన్, హీరో మధ్య ఫైట్, కథలో అసలైన ఘట్టం మొదలవుతుందని ఆశించిన ప్రేక్షకుల అంచనాలపై నీళ్ళు చల్లారు. మోహన్ బాబు ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ తర్వాత నాని - మోహన్ బాబు సీన్ చూశాక... నెక్స్ట్ లెవల్‌కు వెళుతుందని అనుకుంటే, హీరో వర్సెస్ విలన్ ఎపిసోడ్ కంప్లీట్ సైడ్ ట్రాక్ చేసేశారు. మధ్యలో కొత్త పాత్రలను ప్రవేశపెట్టి ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవ్వడంలో ఫెయిల్ అయ్యారు. ఒక్క మాటలో హీరో వర్సెస్ విలన్ ఎపిసోడ్ తేల్చేశారు. మోహన్ బాబుతో నాని ఫైట్ ఆశించిన ప్రేక్షకులకు క్లైమాక్స్ నచ్చడం కష్టమే. పతాక సన్నివేశాల్లో మదర్ సెంటిమెంట్ కూడా సరిగా పండలేదు. అన్నట్టు... 'పెద్ది'లో రామ్ చరణ్ కూడా గుర్తింపు కోసమే పోరాడారు. అయితే... కథ, కథనాలు వేరు. 

టెక్నికల్ విషయాలకు వస్తే... 'ది ప్యారడైజ్' నిర్మాత సుధాకర్ చెరుకూరి గురించి ముందు చెప్పాలి. ఖర్చుకు వెనుకాడలేదు. ప్యారడైజ్ ప్రపంచం సృష్టించడం కోసం వేసిన సెట్స్‌లో ఆయన చేసిన ఖర్చు తెరపై కనిపించింది. ప్రొడక్షన్ డిజైన్ భారీగా ఉంది. అనిరుధ్ రవిచందర్ సంగీతంలో పాటలు బావున్నాయి. నేపథ్య సంగీతంలో ఆయన మార్క్ కొన్ని చోట్ల కనిపించింది. అయితే ఆశించిన స్థాయిలో లేదు. కథను ఛాప్టర్లుగా చెప్పినప్పటికీ ఎడిటింగ్ పరంగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. అయితే వర్షం లేదంటే నైట్ ఎఫెక్ట్ సీన్స్... మెజారిటీ సినిమా అంతా అంతే. రా అండ్ రస్టిక్ మూడ్ తీసుకు రావడంలో సినిమాటోగ్రాఫర్ సీహెచ్ సాయి కొంత వరకు సక్సెస్ అయ్యారు.

జడల్ పాత్ర కోసం నాని మేకోవర్ అయ్యారు. జడలతో ఆయన లుక్ కొత్తగా ఉంది. ఫిట్‌గా కనిపించారు. యాక్షన్ సన్నివేశాల్లో బాగా కష్టపడ్డారు. డైలాగ్ డెలివరీలో కూడా. ఆయన వరకు న్యాయం చేశారు. మోహన్ బాబు మరోసారి విలనిజంలో తన మార్క్ చూపించారు. అయితే ఆయన్ను సరిగ్గా వాడుకోలేదు. కొన్ని సన్నివేశాలకు పరిమితం చేశారు. రాఘవ్ జూయల్ తెలుగు ప్రేక్షకులకు సర్‌ప్రైజ్. లుక్ నుంచి యాక్టింగ్ వరకు ఓకే. సమ్మక్క పాత్రలో సోనాలి కులకర్ణి ఓకే. అయితే తెలుగు ప్రేక్షకులకు తెలిసిన నటి అయితే ఆ పాత్ర తాలూకా ఎఎమోషన్‌తో మరింత కనెక్ట్ అయ్యేవారు. ఏషనాగుల పాటలో కీర్తీ సురేష్ సందడి చేశారు. సంపూర్ణేష్ బాబు, ఈశ్వరీ రావు, సత్యరాజ్, తనికెళ్ళ భరణి, రాజా రవీంద్ర తదితరులు తెరపై కనిపించారు. 'ప్యారడైజ్'లో కేసీఆర్‌ను పోలిన ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో ప్రియదర్శి రోల్ సర్‌ప్రైజ్ అని చెప్పాలి.

మాంచి మాస్ మసాలా బిర్యానీకి కావాల్సిన సరుకు 'ది ప్యారడైజ్'లో ఉంది. కానీ టేస్ట్ ఆశించినట్టు లేదు. కొత్త ప్రపంచం, పవర్ ఫుల్ విలన్, జాతి గుర్తింపు కోసం పోరాడే నాయకుడు, మదర్ సెంటిమెంట్, ఛార్ట్ బస్టర్ సాంగ్స్... అన్నీ ఉన్నా ఆడియన్స్ కనెక్ట్ అయ్యే రీతిలో కథనం సాగలేదు. పార్టులు పార్టులుగా యాక్షన్ బ్లాక్స్ ఓకే. నాని కూడా! అసలు ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే రక్తం ఏరులై పారే, తలలు తెగిపడే యాక్షన్ సినిమాలు ఎంజాయ్ చేసే ఆడియన్స్ 'ది ప్యారడైజ్'ను కాస్త ఓపిక చేసుకుని చూడవచ్చు. లేదంటే చాలా కష్టం. ఆ వయలెన్స్‌ను ఫ్యామిలీతో చూడలేం.

Click here to Read More
Previous Article
AP TG Heavy Rains: కళింగపట్నం వద్ద తీరందాటనున్న తీవ్రవాయుగుండం.. ఏపీలో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక, తెలంగాణలో అతి భారీ వర్షాలు
Next Article
Hyderabad Tank Bund hit and run case: ట్యాంక్‌బండ్‌పై ఘోరం - ఎస్‌ఐని ఢీకొట్టి పారిపోయిన వ్యక్తులు - మృతి - క్లియర్‌గా సీసీ కెమెరా దృశ్యాలు!

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment