Kalki Bhagavan Passes Away: ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ కన్నుమూత.. నేడు తిరుపతి జిల్లాకు పార్థివదేహం తరలింపు

1 hour ago

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ (85) తీవ్ర అస్వస్థతతో చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారని ఏకం ట్రస్టు ప్రతినిధి తెలిపారు.

Kalki Bhagavan Is No More | చెన్నై: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విజయ్ కూమార్ నాయుడు అలియాస్ కల్కి భగవాన్ (85) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురై  గత పది రోజులుగా చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఏకం ట్రస్టు ప్రతినిధి వెల్లడించారు. ఆ సమయంలో ఆయన కుమారుడు కృష్ణాజీతో పాటు ఆశ్రమానికి చెందిన దాసాజీలు, ముఖ్య ప్రతినిధులు ఆసుపత్రికి ఉన్నారని తెలిపారు. 

నేడు తిరుపతి జిల్లాకు కల్కి భగవాన్ పార్థివదేహం తరలింపు

బుధవారం ఉదయం 11 గంటలకు కల్కి భగవాన్ పార్థివదేహాన్ని తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలంలోని బత్తులవల్లం పరిధిలో ఉన్న ఏకం ఆలయానికి (గోల్డెన్ సిటీ) తరలించనున్నారు. తెల్లటి పాలరాతితో అత్యంత వైభవంగా నిర్మించిన ఈ ఆలయంలో భక్తుల సందర్శనార్థం కల్కి భగవాన్ భౌతికకాయాన్ని ఉంచుతారు. శనివారం ఏకం ఆలయ ప్రాంగణంలోనే కల్కి భగవాన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తన సతీమణి అమ్మ భగవాన్‌తో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. లక్షలాది మంది భక్తులు ఆయనను విశ్వసించేవారు. కల్కి భగవాన్, అమ్మ భగవాన్‌ల కుమారుడు శ్రీకృష్ణాజీ సైతం స్పిరిచ్యువల్ ప్రోగ్రామ్స్ నిర్వహించేవారు.

ఎల్‌ఐసీ ఏజెంటుగా కెరీర్ మొదలు..

1949 మార్చి 7న తమిళనాడులోని గుడియత్తంలో జన్మించిన కల్కి భగవాన్, చెన్నై డీజీ వైష్ణవ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. తొలిరోజుల్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) లో ఏజెంట్‌గా పనిచేశారు. ఆపై టీచర్‌గా సేవలు అందించారు. అనంతరం 1992లో తాను విష్ణుమూర్తి అవతారమైన కల్కి అవతారంగా ప్రకటించుకొని ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెట్టారు. దాంతో విజయ్ కుమార్ నాయుడు కల్కి భగవన్‌గా మారిపోయారు. మొదట్లో కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసిన ఆయన, ఆ తర్వాత తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలో నేమంలో ఆధ్యాత్మిక బోధనలు చేశారు. ఆపై వరదయ్యపాళెం వద్ద కల్కి గ్రామీణాభివృద్ధి ట్రస్టును సైతం స్థాపించారు.

 

ముఖ్యంగా తిరుపతి జిల్లా వరదయ్యపాళెం కేంద్రంగా దేశ, విదేశాల్లో ఆయన ట్రస్టులు, ఆధ్యాత్మిక కేంద్రాలు నడిపించారు. ఆధ్యాత్మిక సేవలు, బోధనలతో ఎంతగా ప్రాచుర్యం పొందారో అనంతర కాలంలో ఐటీ దాడులతో అక్రమాస్తులు, వివాదాలతో కేంద్ర బిందువుగా నిలిచారు. ఆశ్రమాల్లో భక్తుల కోసం ధ్యానం, ముక్తి దీక్షలతో పాటు వివిధ రకాల ఆధ్యాత్మిక తరగతులు నిర్వహించారు. సమాజ సేవతో పాటు ఆధ్యాత్మిక వ్యాప్తి కోసం కల్కి గ్రామీణాభివృద్ధి ట్రస్ట్, లోకా ఫౌండేషన్, వన్నెస్ హ్యూమన్, ముక్తి వంటి అనేక ట్రస్టులను ఏర్పాటు చేసి కార్యకలాపాలు సాగించారు.

Click here to Read More
Previous Article
Puri Jagannadh: పూరి ఛార్మీని ఏకిపారేసిన లేడీ ప్రొడ్యూసర్... పరువు పోయేలా ఉంది - రియాక్ట్ అవుతారా?
Next Article
Onions Price: ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment