Piles Types and Grades : పైల్స్ ఎన్ని రకాలు ఉంటాయి? వాటిలో ఏది ప్రమాదకరం? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

1 hour ago

Types of Hemorrhoids : పైల్స్ సమస్యతో చాలామంది ఇబ్బంది పడతారు. అయితే దీనిలో రకాలు ఏంటో.. మొలలు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం.

Hemorrhoids Warning Signs : పైల్స్ లేదా మొలలు (హెమరాయిడ్స్-Hemorrhoids) అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సాధారణ సమస్య. మలబద్ధకం, మలవిసర్జన సమయంలో ఎక్కువగా ఇబ్బంది,  టాయిలెట్‌లో ఎక్కువసేపు కూర్చోవడం, ఆహారంలో ఫైబర్ తక్కువగా తీసుకోవడం వంటి కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే పైల్స్​లో కొన్నిరకాలు ఉంటాయి. పైగా వాటి లక్షణాలు కూడా ఒకేలా ఉండవని చెప్తున్నారు నిపుణులు. 

మొలలు కొన్ని సందర్భాల్లో నొప్పి, దురద వంటి లక్షణాలు మాత్రమే కలిగి ఉంటే.. మరికొన్ని సందర్భాల్లో మలంతో పాటు రక్తం కనిపించవచ్చు. అయితే మొలల్లో ఏ రకం ఎక్కువ ప్రమాదకరం? ఏ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం.

మొలలు రెండు రకాలు ఉంటాయి. వాటిలో ఒకటి హెమరాయిడ్స్‌. వీటిని సాధారణంగా అంతర్గత మొలలు (Internal Hemorrhoids) అంటారు. రెండు బాహ్య మొలలు (External Hemorrhoids).

అంతర్గత మొలలు 

మలద్వారం లోపల, పురీషనాళం దిగువ భాగంలో ఉన్న రక్తనాళాలు వాపునకు గురైనప్పుడు అంతర్గత మొలలు ఏర్పడతాయి. ఇవి ప్రారంభ దశలో తీవ్రమైన నొప్పిని కలిగించవు. కానీ మలవిసర్జన సమయంలో ఎర్రటి రక్తం కనిపించడం దీనిలో ప్రధాన లక్షణంగా ఉంటుంది. అయితే ఈ  అంతర్గత మొలలను అవి ఎంతవరకు బయటకు వస్తున్నాయనే దానిపై నాలుగు గ్రేడ్‌లుగా విభజిస్తారు.

  • గ్రేడ్ 1 : మొలలు లోపలే ఉంటాయి. బయటకు కనిపించవు.
  • గ్రేడ్ 2 : మలవిసర్జన సమయంలో బయటకు వచ్చినా.. తర్వాత వాటంతట అవే లోపలికి వెళ్లిపోతాయి.
  • గ్రేడ్ 3 : బయటకు వచ్చిన మొలలను చేతితో మళ్లీ లోపలికి నెట్టాల్సి ఉంటుంది.
  • గ్రేడ్ 4 : మొలలు బయటకు వచ్చి ఉంటాయి. వాటిని చేతితో కూడా లోపలికి నెట్టడం సాధ్యం కాకపోవచ్చు.

బాహ్య మొలలు 

మలద్వారం చుట్టూ.. చర్మం కింద ఉన్న రక్తనాళాలు వాపునకు గురైనప్పుడు బాహ్య మొలలు ఏర్పడతాయి. వీటిలో నొప్పి, వాపు, దురద, మంట వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొన్నిసార్లు బాహ్య మొలలోని రక్తనాళంలో రక్తం గడ్డకట్టవచ్చు. దీనిని థ్రాంబోస్డ్ హెమరాయిడ్ అంటారు. ఇలా జరిగినప్పుడు మలద్వారం దగ్గర గడ్డలా అనిపించడంతో పాటు అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి రావచ్చు.
అయితే థ్రాంబోస్డ్ హెమరాయిడ్ సాధారణంగా ప్రాణాంతక పరిస్థితి కాదు. కానీ తీవ్రమైన నొప్పి, వాపు లేదా గడ్డ అకస్మాత్తుగా ఏర్పడితే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

ఏ రకం మొలలు ప్రాణాంతకం?

సాధారణంగా వచ్చే అంతర్గత లేదా బాహ్య మొలలను ప్రాణాంతకమైనవిగా చెప్పలేం. కాబట్టి ఫస్ట్ గ్రేడ్ కంటే ఫోర్త్ గ్రేడ్ ప్రాణాంతకం అని చెప్పడం సరైనది కాదు. గ్రేడ్ పెరిగే కొద్దీ సమస్య తీవ్రత పెరగవచ్చు. చికిత్స అవసరం కావచ్చు. కానీ అవి స్వయంగా క్యాన్సర్‌గా మారడం లేదా ప్రాణాంతకంగా మారడం జరగదు.

ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త.. 

కొన్ని లక్షణాలు ఉన్నప్పుడు కచ్చితంగా వైద్య సహాయం తీసుకోవాలని అంటున్నారు నిపుణులు. ఆగకుండా లేదా ఎక్కువగా మలద్వారం నుంచి రక్తస్రావం కావడం, తల తిరగడం, నీరసం లేదా బలహీనంగా అనిపించడం జరగవచ్చు. స్పృహ కోల్పోయేలా అనిపించడం, తీవ్రమైన లేదా అకస్మాత్తుగా నొప్పి పెరగడం, మలం నల్లగా లేదా తారులా కనిపిస్తే అలెర్ట్ అవ్వాలి. 

మలంలో రక్తం కనిపించడం, మలవిసర్జన అలవాట్లలో మార్పులు, మలబద్ధకం, నొప్పి లేదా దురద రోజులు గడిచినా తగ్గకపోతే కచ్చితంగా వైద్య సహాయం తీసుకోవాలి. తీవ్రమైన లేదా నిరంతర రక్తస్రావం కొనసాగితే రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల రక్తస్రావాన్ని తేలికగా తీసుకోవద్దు. 

మొలలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మొలలను నివారించాలంటే మలబద్ధకాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. కాబట్టి రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు వంటి పీచు అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి. తగినంత నీరు తాగాలి. మలవిసర్జన వచ్చినప్పుడు ఎక్కువసేపు ఆపుకోకూడదు. టాయిలెట్‌లో అవసరానికి మించి ఎక్కువసేపు కూర్చోకూడదు. మలవిసర్జన సమయంలో గట్టిగా ముక్కకూడదు. శారీరకంగా చురుకుగా ఉండటం వల్ల కూడా మలబద్ధకం నివారణకు సహాయపడుతుంది.

 

 

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

Click here to Read More
Previous Article
NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
Next Article
Gold Price September 2026: సెప్టెంబర్‌లో బంగారం ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా? కీలక అంచనా!

Related లైఫ్‌స్టైల్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment