ACB Raids NIMS Doctor: ఏసీబీకి చిక్కిన నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్‌.. ఆయన ఆస్తుల చిట్టా ఇదే

1 hour ago

నిమ్స్ హాస్పిటల్ అడిషనల్ సూపరింటెండెంట్‌ డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్ ను ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో ఏసీబీ అరెస్ట్ చేసింది.

హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మక నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఆసుపత్రి అడిషనల్ సూపరింటెండెంట్‌గా చేస్తున్న డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్ (56) అవినీతి వ్యవహారం వెలుగుచూసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మంగళవారం ఉదయం నుంచి ఆయన ఇంట్లో సోదా చేసిన అధికారులు సాయంత్రం అరెస్ట్ చేశారు.

భారీగా అక్రమాస్తులు గుర్తించిన ఏసీబీ అధికారులు

లక్ష్మీభాస్కర్‌పై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ టీమ్ తెల్లవారుజామునే హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ కల్పతరు అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఆయన నివాసానికి చేరుకుని సోదాలు చేపట్టాయి. రోజంతా సాగిన ఈ సోదాలతో పాటు నిమ్స్ ఆసుపత్రి, ఆయన బంధువులు, సన్నిహితులు, బినామీలకు చెందిన మరో 7 ప్రాంతాల్లో ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు రూ. 8.76 కోట్ల విలువైన చర, స్థిరాస్తులను గుర్తించారు. వాటికి సంబంధించి సరైన ఆధారాలు చూపించడంలో లక్ష్మీభాస్కర్ విఫలమయ్యారని అధికారులు తెలిపారు.

 

గడిచిన 20 ఏళ్లుగా నిమ్స్‌లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న లక్ష్మీభాస్కర్ గతంలోనూ పలు తీవ్ర వివాదాల్లో చిక్కుకున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో ఇళ్లు, ఫ్లాట్లు, ఖరీదైన కార్లు, వివిధ పెట్టుబడుల రూపంలో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ తనిఖీల్లో గుర్తించారు. రిజిస్ట్రేషన్ విలువల ప్రకారం వీటి స్థిరాస్తుల విలువ రూ. 6 కోట్ల వరకు ఉన్నప్పటికీ, బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆసుపత్రిలో ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన ఓ ఉన్నతాధికారి అండదండలతోనే ఆయనపై గతంలో ఎన్ని ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోలేదని వినిపిస్తోంది. 

గతంలోనూ ఆయనపై ఫిర్యాదులు

ఆయనపై గతంలో పంజాగుట్ట, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వచ్చాయి. రాజమహేంద్రవరానికి చెందిన ఒక వైద్యుడికి ప్లాటు ఇప్పిస్తామని రూ. 2 కోట్లు తీసుకుని మోసం చేశారనే ఆరోపణలున్నాయి. మరో ఈఎన్టీ డాక్టర్ తో భూమికి సంబంధించి లావాదేవీల వివాదాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. కొవిడ్ తీవ్రంగా ఉన్న సమయంలో రోగికి బెడ్ కేటాయించేందుకు రూ. లక్ష వసూలు చేసిన వ్యవహారంలోనూ లక్ష్మీభాస్కర్ పేరు వినిపించింది. 

తనిఖీల్లో ఏసీబీ గుర్తించిన ఆస్తుల చిట్టా ఇదే..

-  కూకట్‌పల్లి ప్రాంతంలోని హైరైజ్డ్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో 4 BHK ఫ్లాట్‌. మరో హైరైజ్డ్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో 2 ట్రిపుల్‌ బెడ్‌రూం ఫ్లాట్లు.. కూకట్‌పల్లి, పేట్‌బషీరాబాద్, మణికొండల్లో 5 డబుల్‌ బెడ్‌రూం ఫ్లాట్లు.
-  యాదాద్రి, నందిగామ, శామీర్‌పేటల్లో 4 ఓపెన్‌ ప్లాట్లు.
-  విశాఖలో 800 చదరపు గజాల ఓపెన్‌ ప్లాట్‌.
-    517.8 గ్రాముల  (అర కేజీ) బంగారు ఆభరణాలు.
-     డెట్స్‌ రికవరీ ట్రైబ్యునల్‌(డీఆర్‌టీ)లో వివాదంలో ఉన్న ఒక ఫ్లాట్‌ కొనుగోలుకు రూ.1.3 కోట్ల పెట్టుబడి.
-   కొందరు వ్యక్తులకు రూ.1.33కోట్ల మేర చేబదుళ్లు.
-   పోస్టాఫీసులో రూ.12 లక్షల డిపాజిట్.  రూ. 41 లక్షల వరకు బ్యాంకు బ్యాలెన్స్‌
-    ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీల్లో రూ.35 లక్షల పెట్టుబడులు.
-    మ్యూచువల్‌ ఫండ్స్‌లో రూ.29 లక్షల పెట్టుబడులు.
-     జాగ్వార్, ఆడి, టాటా నెక్సన్‌ సహా పలు కార్లు. 4 టూ వీలర్స్

Click here to Read More
Previous Article
Janasena Politcis: కూటమి బలంగా నిలబడాలి.. జనసేన గౌరవానికి భంగం వాటిల్లకూడదు: పిఠాపురంలో పవన్ కళ్యాణ్
Next Article
Chiranjeevi: నా రెమ్యూనరేషన్ ముందు ఆ డబ్బెంత? నేను బ్లడ్ అమ్ముకుంటానా? విమర్శలపై మెగాస్టార్ స్పందన

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment