Flash Flood Alert: ఏపీ, తెలంగాణలో ఆకస్మిక వరదల ముప్పు.. ఈ జిల్లాలకు IMD రెడ్ అలర్ట్

2 hours ago

తీవ్రవాయుగుండం ప్రభావంతో బుధవారం ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు (Flash Floods) వచ్చే ముప్పు ఉందని వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

అమరావతి/ హైదరాబాద్: పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ప్రస్తుతం గోపాల్‌పూర్‌కు 150 కి.మీ, కళింగపట్నానికి 100 కి.మీ దూరంలో, ఒడిశాలోని పూరీకి 220 కి.మీ, అలాగే విశాఖపట్నానికి 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తీవ్రవాయుగుండం బుధవారం రాత్రికి విశాఖపట్నం - గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.

తీవ్ర వాయుగుండం ప్రభావంతో నేడు, రేపు కోస్తాంధ్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు చెట్లు, ప్రకటనల హోర్డింగ్స్ కింద నిలబడవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు ఎవ్వరూ వేటకు వెళ్లరాదని ఆదేశించారు. అలాగే, ఆకస్మిక వరదలు వచ్చే ముప్పు ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు  అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APDMA) ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.

ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఫ్లాష్ ఫుడ్స్

తీవ్రవాయుగుండం, భారీ వర్షాల ప్రభావంతో బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు (Flash Floods) వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నేటి సాయంత్రంలోగా పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా వరద నీరు ముంచెత్తే ముప్పు ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఏపీలో 9 జిల్లాలు, తెలంగాణలో 4 జిల్లాలకు ఫ్లాష్ ఫుడ్స్ ముప్పు

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 9 జిల్లాలకు అధికారులు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలకు ఆకస్మిక వరద ప్రమాదం పొంచి ఉంది. అలాగే గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలకు సైతం ఆకస్మిక వరద ముప్పు హెచ్చరికలు జారీ చేశారు.

తెలంగాణలోని 4 జిల్లాల్లో ఫ్లాష్‌ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజలను వాతావరణశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. పొరుగు రాష్ట్రాలైన ఒడిశాలోని 5 జిల్లాలు, ఛత్తీస్‌గఢ్‌లోని 3 జిల్లాలకు కూడా ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్ జారీ కావడం వల్ల లోతట్టు, నదీ పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థలు హెచ్చరించాయి. 

ఈ జిల్లాలలకు రెడ్ అలర్ట్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని.. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ముప్పు ఉండటంతో  వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అదే సమయంలో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా రాష్ట్రంలోని 7 జిల్లాలకు తీవ్రస్థాయి హెచ్చరికగా రెడ్ అలర్ట్ జారీ చేశారు. ములుగు, వరంగల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, హన్మకొండ, మహబూబాబాద్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు.

ఈ వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం ఉందని, వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. వర్షాల సమయంలో అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావద్దని ప్రజలకు సూచించారు.

Click here to Read More
Previous Article
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముకేశ్ కారణంగా వెక్కి వెక్కి ఏడ్చేసిన దేబ్‌జానీ! ఆ లెటర్ ఇక లేనట్లే!
Next Article
Aortic Dissection : అయోర్టిక్ డిసెక్షన్ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. ఇది గుండెపోటు కంటే ప్రమాదమా?

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment