AP liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు.. మనీ ట్రయల్ ముడి పడుతుందా? టార్గెట్ వైఎస్ జగనేనా?

2 hours ago

ED investigation: ఏపీ మద్యం కుంభకోణంలో ఈడీ దూకుడు చూపిస్తోంది. ప్రతీ చిన్న లావాదేవీని బయటకు లాగుతోంది. దీంతో టార్గెట్ జగనేనా అన్నచర్చ జరుగుతోంది?

AP liquor scam money trail ED probe:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దశాబ్దంలోనే అతిపెద్ద ఆర్థిక అక్రమంగా విచారణ ఎదుర్కొంటున్న రూ.3,200 కోట్ల లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  అడుగులు సంచలనం రేపుతున్నాయి. కేవలం పైస్థాయి ప్రకటనలకే పరిమితం కాకుండా.. అక్రమ రవాణా, కమీషన్ల వసూలు, షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు వంటి ప్రతి చిన్న లావాదేవీని బయటకు తీస్తూ ఈడీ అధికారులు అరెస్టుల పర్వాన్ని ముమ్మరం చేశారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ కుమార్‌లతో పాటు ఐటీ మాజీ సలహాదారు రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేయడం, వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు ఈడీ సమన్లు జారీ చేయడం ఈ కేసు తీవ్రతకు అద్దం పడుతోంది.

పెద్ద తలలు అరెస్టవుతాయన్న పీవీఎన్ మాధవ్

ఏపీ బీజేపీ అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్  లిక్కర్ స్కామ్‌లోని అసలు సూత్రధారిని, బిగ్ హెడ్‌ను అరెస్ట్ చేయాల్సిందే అని డిమాండ్ చేస్తూ ప్రత్యక్షంగా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేరును ప్రస్తావించడం రాజకీయంగా కలకలాన్ని రేపింది. సిట్ చార్జ్‌షీట్లతో పాటు ఈడీ నమోదు చేసిన విచారణల్లోనూ మద్యం అమ్మకాలను ప్రభుత్వ నియంత్రణలోని డిజిటల్ పేమెంట్లు లేకుండా నగదు రూపంలోనే సాగించడం, నిర్దిష్ట బ్రాండ్లకే అనుకూలంగా విధానాలు మార్చడం వెనుక నాటి ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు ఉన్నాయనేది విపక్షాల ప్రధాన ఆరోపణ.

అంతిమ లబ్దిదారు వద్దకే విచారణ

ఈడీ దర్యాప్తు సరళిని పరిశీలిస్తే.. ఏజెన్సీలు ఎప్పుడూ కిందిస్థాయి నుండి పైస్థాయికి  వ్యూహాన్ని అనుసరిస్తాయి. ముందుగా కేటాయింపులు పొందిన డిస్టిలరీలు, రవాణా కాంట్రాక్టర్లు, వసూలు ఏజెంట్ల వద్ద నుంచి సేకరించిన రికార్డులు, వాట్సాప్ చాట్లు, గూగుల్ టేక్-అవుట్ డేటాను విశ్లేషించి మనీ ట్రయల్ ను నిర్ధారిస్తాయి. ఇప్పటికే జగన్ ముఖ్య కార్యదర్శి ధనంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి , మిథున్ రెడ్డి వంటి అత్యంత ఆప్తుల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించి కీలక పత్రాలు దక్కించుకోవడం ద్వారా, ఈ కేసు దారంతా చివరికి వైఎస్ జగన్ చుట్టూనే తిరిగేలా పావులు కదుపుతున్నారు. లిక్కర్ పాలసీ మార్పుల ద్వారా వచ్చిన రూ.1,048 కోట్లకు పైగా కిక్‌బ్యాక్‌ల నిధులు హవాలా మార్గాల్లో, షెల్ కంపెనీల ద్వారా ఎక్కడికి మళ్లాయనే సాంకేతిక ఆధారాలను ఈడీ సేకరిస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కూడా సరిగ్గా ఇదే తరహాలోనే కిందిస్థాయి అధికారుల నుంచి మొదలై చివరికి నాటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాకా దర్యాప్తు ముడిపడి అరెస్టులకు దారితీసింది. ఇప్పుడు ఏపీలో కూడా ఈడీ అదే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద బలమైన ఆధారాలు పొందుపరిస్తే, జగన్‌కు నోటీసులు జారీ చేయడం లేదా విచారణకు పిలవడం అనివార్యంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆరోపణల ఆధారంగా అరెస్టు చేయరు!   

 

 మాజీ ముఖ్యమంత్రి స్థాయి నాయకుడిని నేరుగా అరెస్ట్ చేయడమనేది కేవలం ఆరోపణల ఆధారంగా సాధ్యపడదు. ఆయనకు నేరుగా లబ్ధి చేకూరినట్లు  డైరెక్ట్ మనీ ఫ్లో సాక్ష్యాధారాలు కోర్టు ముందు నిలబడేలా ఈడీ చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ కేవలం అధికారుల ప్రమేయం మాత్రమే తేలితే.. పొలిటికల్ మాస్టర్‌మైండ్‌గా ఆరోపణలు చేసినప్పటికీ, ప్రత్యక్ష చట్టపరమైన చర్యల నుంచి జగన్ తప్పించుకునే వెసులుబాటు కూడా ఉంటుందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈడీ రికార్డు స్థాయి కస్టడీ విచారణలు చూస్తుంటే.. రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఈ లిక్కర్ స్కామ్ భూకంపం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ మనీ ట్రయల్ ఆధారాలు జగన్‌కు నేరుగా ముడిపడితే.. అది వైఎస్‌ఆర్‌సీపీ భవిష్యత్తుకే కాకుండా, రాష్ట్ర రాజకీయ సమీకరణాలకే అతిపెద్ద టర్నింగ్ పాయింట్‌గా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

Click here to Read More
Previous Article
BRS defected 9 MLAs disqualification: దానంపై వేటు.. మరి మిగిలిన 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి? బిఆర్ఎస్‌కు పటాన్‌చెరు చిక్కుముడి!
Next Article
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముకేశ్ కారణంగా వెక్కి వెక్కి ఏడ్చేసిన దేబ్‌జానీ! ఆ లెటర్ ఇక లేనట్లే!

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment