Fridge Food Storage Guide : ఫ్రిడ్జ్‌లో పాలు, కూరగాయలు, మాంసం ఎక్కడ పెట్టాలి? ఏ అరలో ఏది పెట్టాలో తెలుసా?

2 hours ago

Store Food in the Fridge : ఫ్రిడ్జ్​లో ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేయకపోతే అది ఎక్కువకాలం తాజాగా ఉండదు. పైగా బ్యాక్టీరియా ఒక దాని నుంచి ఒకదానికి వ్యాపిస్తుంది. అందుకే ఫ్రిడ్జ్​లో ఫుడ్ ఇలా స్టోర్ చేయండి.

Food Storage Tips in Fridge : ఆహారం ఎక్కువకాలం తాజాగా, పాడవకుండా ఉండేందుకు చాలామంది ఫ్రిడ్జ్​ ఉపయోగిస్తారు. అయితే ఫ్రిడ్జ్​లో ఫుడ్ పెడితే సరిపోదని.. దానిని నిల్వ చేసే విధానం చాలా ముఖ్యమని చెప్తున్నారు ఫుడ్ సేఫ్టీ నిపుణులు. పాలు, కూరగాయలు, వండిన ఆహారం, పచ్చి మాంసం, ఇతర వస్తువులను రిఫ్రిజిరేటర్‌లో ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే.. అది ఫుడ్​పై నెగిటివ్ ప్రభావం ఉందని చెప్తున్నారు. అందుకే సరైన పద్ధతిలో ఫుడ్ స్టోర్ చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి అరలో ఉష్ణోగ్రత ఒకేలా ఉండదు. అందుకే ఫుడ్​ను సరైన పద్ధతిలో నిల్వ చేయాలంటున్నారు.

ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేస్తే.. అది ఎక్కువ కాలం తాజాగా ఉండటమే కాకుండా.. ఒక ఆహార పదార్థం నుంచి మరొకదానికి బ్యాక్టీరియా వ్యాపించే ప్రమాదం కూడా తగ్గుతుంది. అలాగే రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రతను 0 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచడం మంచిదిగా చెప్తారు. అయితే రిఫ్రిజిరేటర్‌లోని ఏ భాగంలో ఏ వస్తువులు నిల్వ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పై అరలో ఏమి పెట్టాలి?

మళ్లీ వండాల్సిన అవసరం లేని వస్తువులను రిఫ్రిజిరేటర్‌లోని పై అరలో ఉంచాలట. అంటే పెరుగు, జున్ను, ఇతర పాల ఉత్పత్తులు, అలాగే ముందుగా తయారుచేసిన ఫుడ్, మిగిలిపోయిన ఆహారం పెట్టేందుకు ఇది అనువైనది. ఇలా ఉంచితే.. కింద నిల్వ ఉంచిన పచ్చి ఆహారాల నుంచి నీరు లేదా రసాలు వాటిపై పడకుండా ఉంటాయి. అందుకే వండిన ఆహారాన్ని ఎప్పుడూ మూతపెట్టి లేదా గాలి చేరని డబ్బాలో ఉంచాలి.

మధ్య అరలో ఏమి పెట్టాలి?

రిఫ్రిజిరేటర్‌లోని మధ్య అరను బటర్, కూల్ డెజర్ట్‌లు, సాస్‌లు, డ్రెస్సింగ్‌లు పూర్తిగా వండిన ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించవచ్చు. ఇప్పటికే తయారు చేసి.. తర్వాత మళ్లీ వేడి చేసుకునే ఆహారాన్ని కూడా ఇక్కడ నిల్వ చేయవచ్చు. పాత ఫుడ్స్ ముందు భాగంలోనూ.. కొత్తవి వెనుక భాగంలోనూ పెట్టాలి. దీనివల్ల ముందుగా కొనుగోలు చేసిన వస్తువులు మొదటగా ఉపయోగించగలుగుతారు. దీంతో ఫుడ్ పాడవకుండా నివారించవచ్చు.

పచ్చి మాంసం, చేపలు..

పచ్చి మాంసం, చికెన్, చేపలను రిఫ్రిజిరేటర్‌లోని కింద అరలో నిల్వ చేయడం మంచిది. ఎందుకంటే ఏ ద్రవమైన ఒలికినా.. అది అడుగున ఉండిపోతుంది. అలాగే ఇతర ఆహార పదార్థాలపై పడదు. అలాగే పచ్చి మాంసం, చేపలను గాలి చొరబడని డబ్బాలలో లేదా సీల్ చేసిన సంచులలో నిల్వ చేయాలి. 

ఫ్రిజ్ డ్రాయర్‌లో ఏమి పెట్టాలంటే..

రిఫ్రిజిరేటర్ అడుగున ఉండే డ్రాయర్‌లను సాధారణంగా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, సలాడ్‌ల కోసం ఉపయోగిస్తారు. వీటిని అవసరాన్ని బట్టి ప్యాకెట్లలో లేదా డబ్బాలలో నిల్వ చేసుకోవచ్చు. పండ్లు, కూరగాయలను నిల్వ చేసే ముందు శుభ్రం చేయాలి. అలాగే రిఫ్రిజిరేటర్ డ్రాయర్‌లను క్రమం తప్పకుండా ఖాళీ చేసి శుభ్రం చేయాలి. లేదంటే అక్కడ మురికి, బ్యాక్టీరియా పెరిగిపోతాయి.

ఫ్రిజ్ డోర్‌లో పెట్టాల్సిన వస్తువులు..

రిఫ్రిజిరేటర్ తలుపు ఎక్కువగా తెరుస్తూ.. మూస్తూ ఉంటాం. కాబట్టి అక్కడ ఉష్ణోగ్రత నిరంతరం మారుతూ ఉంటుంది. అందుకే తక్కువ ఉష్ణోగ్రతలు అవసరం లేని వస్తువులను ఈ డోర్​లో నిల్వ చేయడం మంచిది. జ్యూస్‌లు, జామ్‌లు, సాస్‌లు, చట్నీలు, ఊరగాయలు, డ్రింక్స్, చల్లగా ఉంచాల్సిన కొన్ని ప్యాక్ చేసిన ఉత్పత్తులను ఇక్కడ నిల్వ చేయవచ్చు. ఇక్కడ పాలు వంటివి నిల్వ చేయకపోవడమే మంచిది. 

Click here to Read More
Previous Article
The Paradise Censor Review : ది ప్యారడైజ్ సెన్సార్ రివ్యూ - నేచరల్ స్టార్ మూవీకి A సర్టిఫికెట్... రన్ టైం ఎంతంటే?
Next Article
టాటా నుంచి మరో కొత్త సెడాన్‌.. Tigor ప్లేస్‌లోకి Aeris.. ఇవే హైలైట్స్‌!

Related లైఫ్‌స్టైల్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment