Enquiry On Erravalli Farmhouse: కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై ఎంక్వైరీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.. 30 రోజులు డెడ్‌లైన్

1 hour ago

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిధిలోని వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణల ఆరోపణలపై సమగ్ర విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

KCRs Erravalli Farmhouse | హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిధిలోని భూములపై సమగ్ర విచారణకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు జారీ చేశారు. వందల ఎకరాల ప్రభుత్వ భూమి కేసీఆర్ ఫామ్‌హౌస్ ఆధీనంలో ఉందనే ఆరోపణలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సభలో స్పష్టం చేశారు. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ సరిహద్దులు, ఆక్రమణలపై 30 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని రెవెన్యూ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. నిబంధనల ప్రకారం మాజీ సీఎం కేసీఆర్‌కు తక్షణమే నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు. నిర్ణీత సమయంలోగా విచారణ పూర్తి చేయడంలో ఏమైనా నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులైన అధికారులు, సంబంధిత మంత్రులపై కూడా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ధరణి, ఉద్యమం పేరుతో ఆస్తుల కూడబెట్టుడుపై విమర్శలు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ భారీగా ఆస్తులను కూడబెట్టారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబానికి వివిధ ప్రాంతాల్లో సుమారు 440 ఎకరాల భూమి ఉందని, కేసీఆర్ దంపతులు, కేటీఆర్ కుటుంబసభ్యుల పేరు మీద ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాల స్థిరాస్తులు ఉన్నాయో సీఎం సర్వే నంబర్లతో సహా సభలో వెల్లడించారు. నిబంధనల ప్రకారం 27 ఎకరాలు మాత్రమే ఉండాల్సిన కేసీఆర్ దంపతులకు 67 ఎకరాల భూమి ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

ప్రభుత్వ భూమి అని తేలితే పేదలకు పంపిణీ

కేసీఆర్ ఫామ్‌హౌస్ ఆధీనంలో సుమారు 700 ఎకరాల వరకు విస్తరించి ఉందని, అందులో దాదాపు 340 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందనే ఆరోపణలు ఉన్నాయని వెల్లడించారు. ఈ ఫామ్‌హౌస్ భూమి వెనుక ఉన్న అసలు కథేంటో తేల్చాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అధికారుల దర్యాప్తులో కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిధిలో ఉన్న భూమి ప్రభుత్వ భూమిగా తేలితే, ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామన్నారు. ఆ భూమిని ఎర్రవెల్లి ఫాం హౌస్ వద్ద నిరసన తెలిపిన దళితులకు, పేదలకు పంచుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పేదల హక్కులను కాపాడటమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని సీఎం పేర్కొన్నారు. 

ప్రతిపక్ష నేతలపై భూక్రమణ ఆరోపణలు

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బిఆర్ఎస్ నాయకులు భూ అక్రమాలు చేశారని ఆరోపిస్తూ.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇనాం భూములను తన పేరు మీదకు మార్చుకున్నారని పేర్కొన్నారు.  రోహిన్ రెడ్డి అసైన్డ్ భూముల్లో ఫామ్‌హౌస్ నిర్మించుకున్నారని.. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం కేటాయించిన భూములతో పాటు ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ వంటి నేతలు ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కొల్లగొట్టారని ధ్వజమెత్తారు.

 

భూదాన్ భూములపై రాజకీయంపై రేవంత్ విమర్శలు
రాష్ట్రంలో 74 ఎకరాల భూదాన్ భూములపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలో తీవ్రంగా పోరాటం చేశారని, కానీ ప్రస్తుతం ఆ భూములు అన్యాక్రాంతమైపోయాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మాజీ మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలను ఉద్దేశించి తాను ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. సీఎల్పీ నాయకుడిగా ఉన్న ఒక దళితుడికి అన్యాయం చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవులు అనుభవించారని, దోరల వద్ద బానిసలుగా ఉండాలనుకుంటే ఉండవచ్చని ఘాటుగా వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి సొంత గ్రామంలోని ఆక్రమణకు గురైన భూములపై విచారణ జరిపించాలని ముందుగా సబితా ఇంద్రారెడ్డి కోరాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.  

Click here to Read More
Previous Article
Polavaram MLA Chirri Balaraju: సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
Next Article
Suriya Jyothika: సూర్య, జ్యోతికకు మళ్ళీ పెళ్ళి... పిల్లల సాక్షిగా మళ్ళీ ప్రమాణం... వెడ్డింగ్ వీడియో వైరల్

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment