TDP Janasena Seat Sharing: స్థానిక పోరులో పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - 7 కార్పొరేషన్లపై కన్ను.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?

1 hour ago

AP Local Body Elections 2026: ఏపీ స్థానిక ఎన్నికల పొత్తుపై చంద్రబాబు-పవన్ భేటీలో కీలక అంశాలపై చర్చించారు. 25 శాతం స్థానాలు, వైజాగ్ సహా 7 కార్పొరేషన్లు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది.

Janasena Municipal Seat Sharing:    ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న పంచాయతీ, మున్సిపల్ , జిల్లా పరిషత్  ఎన్నికల వేళ అధికార కూటమిలో సీట్ల సర్దుబాటు రాజకీయం అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య అమరావతిలో జరిగిన భేటీ స్థానిక సమరానికి ప్రధాన వేదికగా నిలిచింది. శాసనసభ ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్‌ సాధించిన పవన్ కళ్యాణ్, స్థానిక సంస్థల పోరులోనూ జనసేన బలాన్ని నిరూపించుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 25 శాతం స్థానాలతో పాటు కీలక కార్పొరేషన్లను కోరుతూ పవన్ ఒక ప్రత్యేక ప్రతిపాదనను చంద్రబాబు ముందు ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది.

25 శాతం పంచాయతీలు డిమాండ్ 

జనసేన తరఫున పవన్ కళ్యాణ్ ప్రధానంగా రాష్ట్రంలోని 25 శాతం పంచాయతీలు, మున్సిపాలిటీలతో పాటు 6 జిల్లా పరిషత్‌లు  , 7 నగర పాలక సంస్థల మేయర్ స్థానాలను ఆశిస్తున్నారు. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పార్టీ బలంగా ఉన్న విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, తిరుపతి కార్పొరేషన్లలో తమ అభ్యర్థులే మేయర్లుగా బరిలోకి దిగాలని జనసేన పట్టుబడుతోంది. మున్సిపాలిటీల విషయానికొస్తే పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంతో పాటు నరసాపురం, భీమవరం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, తెనాలి వంటి కీలక స్థానాలను మస్ట్  కేటగిరీలో జనసేన చేర్చినట్లు సమాచారం.

టీడీపీలో భిన్నాభిప్రాయాలు

అయితే జనసేన డిమాండ్లపై తెలుగుదేశం పార్టీ   అంతర్గత వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అత్యంత కీలకమైన విశాఖపట్నం కార్పొరేషన్ స్థానాన్ని జనసేనకు వదులుకోవడానికి టీడీపీ స్థానిక నాయకత్వం విముఖత చూపుతోంది. విశాఖపై పార్టీకి ఉన్న సాంప్రదాయ బలాన్ని దృష్ట్యా అక్కడ టీడీపీ అభ్యర్థి  ,  పొత్తులో భాగంగా ఇతర ప్రత్యామ్నాయాలు చూడాలని, కావాలంటే విజయనగరం కార్పొరేషన్‌ను తీసుకోవచ్చని టీడీపీ అధిష్ఠానం ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. రాజధాని ప్రాంతమైన విజయవాడ, గుంటూరులతో పాటు పారిశ్రామిక నగరమైన వైజాగ్ మూడింటినీ జనసేన అడగడంపై టీడీపీ క్షేత్రస్థాయి నేతల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు కూటమిలో మూడో భాగస్వామి అయిన భారతీయ జనతా పార్టీ  కూడా స్థానిక పోరులో తమ వాటాను గట్టిగానే ఆశిస్తోంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక,  పారిశ్రామిక కేంద్రాలైన తిరుపతి, విశాఖపట్నం కార్పొరేషన్లలో పోటీ చేసేందుకు బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు ఆసక్తి చూపుతున్నాయి. దీంతో వైజాగ్, తిరుపతి స్థానాలు ముగ్గురు భాగస్వాముల మధ్య  ప్రతిష్టంభనకు వేదికగా మారే అవకాశం కనిపిస్తోంది. మూడు పార్టీలకు ఆమోదయోగ్యమైన రీతిలో సీట్ల పంపిణీని ముగించడం చంద్రబాబు నాయుడికి ప్రధాన సవాలుగా మారింది.

సమన్వయం కోసం కీలక ప్రయత్నాలు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరిగిందనే కోపంతో ఉన్న కూటమి కేడర్, ఈసారి పూర్తిస్థాయిలో అధికారాన్ని పంచుకోవాలని భావిస్తోంది. పొత్తు ధర్మాన్ని నిలబెట్టుకుంటూనే, ద్వితీయ శ్రేణి నాయకుల్లో అసంతృప్తి రాకుండా చూడటం చంద్రబాబుకు అంత సులభం కాకపోవచ్చు. ఎమ్మెల్యే సీట్ల కేటాయింపు సమయానుకూలంగా జరిగినా, మున్సిపల్ డివిజన్లు, వార్డులు మరియు సర్పంచ్ స్థానాల విషయంలో స్థానిక నాయకుల ప్రయోజనాలు ముడిపడి ఉండటంతో సర్దుబాటు ప్రక్రియ అత్యంత క్లిష్టంగా మారింది. ఈ ప్రతిష్టంభనను అధిగమించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సమగ్ర వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీల వారీగా ఉన్న వాస్తవ బలాబలాలు, గత ఎన్నికల ఓటింగ్ సరళి, నేతల వ్యక్తిగత ప్రభావం ప్రాతిపదికగా మార్గదర్శకాలు రూపొందించాలని ప్రతిపాదించారు. కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులకే ప్రాధాన్యం ఇవ్వాలని, స్థానికంగా ఏ పార్టీ బలంగా ఉంటే ఆ పార్టీకే ఆ సీటు కేటాయించడం ద్వారా వైఎస్సార్‌సీపీకి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని సీనియర్ నేతలకు స్పష్టం చేశారు.

 

 స్థానిక ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోపు కూటమి భాగస్వాములైన టీడీపీ, జనసేన, బీజేపీలు సీట్ల సర్దుబాటుపై ఒక స్పష్టమైన అవగాహనకు రావడం అనివార్యం. వైఎస్సార్‌సీపీని స్థానిక స్థాయిలో కూడా కోలుకోకుండా దెబ్బతీయాలంటే కూటమిలో నూటికి నూరు శాతం సమన్వయం అవసరమని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో తిరుపతి, వైజాగ్ వంటి కీలక నగరాల విషయంలో నేతలు ఎలాంటి మధ్యేమార్గ నిర్ణయాన్ని తీసుకుంటారోనని ఏపీ రాజకీయం ఆసక్తిగా గమనిస్తోంది.

Click here to Read More
Previous Article
KCR Farmhouse 45 Acres Missing Land: కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
Next Article
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment