Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Telangana Congress Incharge Controversy: మీనాక్షి నటరాజన్ ఇష్యూతో తెలంగాణ కాంగ్రెస్‌లో టైం బాంబ్ - సమగ్ర ప్రక్షాళనకు రాహుల్ రెడీ - ఎవరు బలి కాబోతున్నారు?

    6 hours ago

    Rahul Gandhi Telangana:ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షిరాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురికావడం వెనుక కోవర్టుల హస్తం ఉందని హైకమాండ్ గట్టిగా నమ్ముతోంది. అందుకే రాహుల్ సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నారు.

    Congress Covert MLA Hyderabad Court Case:  మధ్యప్రదేశ్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ అనూహ్యంగా తిరస్కరణకు  గురికావడం.. ఇప్పుడు జాతీయ రాజకీయాలతో పాటు తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్ కోర్టులో ఉన్న ఒక పాత కేసుకు సంబంధించిన సమాచారాన్ని నామినేషన్ అఫిడవిట్‌లో దాచారనే నెపంతో ఆమె ఫామ్‌ను తిరస్కరించడం, దీనిపై సుప్రీంకోర్టు కూడా జోక్యానికి నిరాకరించడం కాంగ్రెస్ అధిష్ఠానానికి పెద్ద షాక్. అయితే, మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ పొలిటికల్ డ్రామా వెనుక.. తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన కొందరు  కోవర్టుల హస్తం ఉందనే సమాచారం వెలుగులోకి రావడం ఇప్పుడు రాహుల్ గాంధీ ఆగ్రహానికి కారణమైంది.
     
     మధ్యప్రదేశ్‌లో నామినేషన్ రిజెక్షన్.. కదిలిన తెలంగాణ లింక్! 

    రాహుల్ గాంధీ కోటరీలో అత్యంత నమ్మకస్తురాలైన మీనాక్షి నటరాజన్‌ను మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. అయితే, ఆమె నామినేషన్‌పై బీజేపీ అభ్యర్థి మహేష్ కేవట్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తెలంగాణలోని హైదరాబాద్ కోర్టులో ఉన్న ఒక ప్రైవేట్ కంప్లైంట్  వివరాలను అఫిడవిట్‌లో దాచారని రిటర్నింగ్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో జూన్ 9న ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైంది. అయితే, అసలు మధ్యప్రదేశ్‌లో ఉన్న బీజేపీ నేతలకు.. తెలంగాణ కోర్టులో మీనాక్షి నటరాజన్‌పై  ఆమె ఏఐసీసీ ఇన్‌చార్జ్‌గా ఉన్న కాలానికి సంబంధించి  ఉన్న కేసు వివరాలు, నోటీసుల కాపీలు ఎలా దొరికాయనే దానిపై దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

    అంతర్గత కుట్ర.. లీక్ చేసింది సొంత పార్టీ నేతలేనా? 

    ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీజేపీ సీనియర్ మంత్రి కైలాష్ విజయవర్గీయ సైతం  కాంగ్రెస్‌లోని అంతర్గత విభేదాల వల్లే తెలంగాణ నుండి సమాచారం లీక్ అయింది అని వ్యాఖ్యానించడం కాంగ్రెస్ అనుమానాలకు బలమిచ్చింది. మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఇన్‌చార్జ్‌గా వచ్చిన తర్వాత పార్టీలోని కొందరు సీనియర్ల ఏకపక్ష నిర్ణయాలకు, గ్రూపు రాజకీయాలకు అడ్డుకట్ట వేశారు. ఈ క్రమంలో ఆమెపై కక్ష పెంచుకున్న తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన ఒక గ్రూపు.. ఆమెను రాజ్యసభకు వెళ్లకుండా దెబ్బతీయడానికి, హైదరాబాద్ కోర్టు డాక్యుమెంట్లను నేరుగా మధ్యప్రదేశ్ బీజేపీ నేతలకు చేరవేసి  కోవర్టు  రాజకీయం నడిపినట్లు ఏఐసీసీ వర్గాలు గుర్తించాయి.

     రంగంలోకి హైకమాండ్ విచారణ కమిటీ.. ఒక ఫస్ట్-టైమ్ ఎమ్మెల్యేదే తప్పు! 

    ఈ ద్రోహంపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఏఐసీసీ తక్షణమే ఒక అంతర్గత విచారణ కమిటీని నియమించింది. సోషల్ మీడియా,  అంతర్గత నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఈ కమిటీ ప్రాథమిక విచారణను పూర్తి చేసింది. తెలంగాణకు చెందిన ఒక కీలకమైన  ఫస్ట్-టైమ్ ఎమ్మెల్యే  ఈ డాక్యుమెంట్ల లీకేజీలో ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు కమిటీ నిర్ధారించినట్లు సమాచారం. పార్టీలో ఉంటూ ప్రత్యర్థి పార్టీకి సమాచారం అందించి, ఏకంగా ఏఐసీసీ ఇన్‌చార్జ్ నామినేషన్‌నే కొంపముంచిన సదరు ఎమ్మెల్యే వ్యవహారంపై హైకమాండ్ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.

     తెలంగాణ కాంగ్రెస్‌లో మార్పులు తప్పవా? 

    మీనాక్షి నటరాజన్ ఇష్యూలో సదరు ఫస్ట్-టైమ్ ఎమ్మెల్యేతో పాటు.. ఆయన వెనుక ఉండి నడిపించిన ఒక సీనియర్ నేతపై కూడా అధిష్ఠానం నజర్ పెట్టింది. ఈ కుట్ర వల్ల కాంగ్రెస్ ఒక విలువైన రాజ్యసభ స్థానాన్ని చేజేతులా కోల్పోవాల్సి వచ్చింది. దీనికి బాధ్యుడిగా తేలిన ఆ ఎమ్మెల్యేను పార్టీ నుండి సస్పెండ్ చేయడమా లేక షోకాజ్ నోటీసులు ఇచ్చి పక్కన పెట్టడమా అనే దానిపై కసరత్తు జరుగుతోంది. కేవలం ఆ ఒక్క ఎమ్మెల్యే మాత్రమే కాకుండా, తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో  విమర్శలు ఎదుర్కొంటున్న మరికొందరు నేతలను కూడా పదవుల నుండి తొలగించే అవకాశం ఉందని, త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ ప్రక్షాళన  ఖాయమని పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం సాగుతోంది.

     సమూల ప్రక్షాళనకు రాహుల్ గాంధీ నిర్ణయం.. చరమగీతం పాడాల్సిందే! 

    ఇలాంటి కోవర్టు, బ్లాక్‌మెయిల్  రాజకీయాలకు శాశ్వతంగా చరమగీతం పాడాలని రాహుల్ గాంధీ గట్టిగా భావిస్తున్నారు. పార్టీ లైన్ దాటిన వారు ఎంతటి వారైనా సరే.. సహించేది లేదనే బలమైన సంకేతాన్ని ఇవ్వడమే రాహుల్ గాంధీ ముఖ్య ఉద్దేశం. తెలంగాణలో పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, అంతర్గత కుమ్ములాటలు జాతీయ స్థాయిలో పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని ఆయన అసంతృప్తితో ఉన్నారు. మీనాక్షి నటరాజన్ వంటి క్లీన్ ఇమేజ్ ఉన్న నేతకు జరిగిన ఈ అన్యాయంపై కఠినంగా వ్యవహరించకపోతే క్యాడర్‌లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని, అందుకే ఈసారి ప్రక్షాళన  సమూలంగా, కఠినంగా  ఉండబోతోందని భావిస్తున్నారు. 

    Click here to Read More
    Previous Article
    Green Tea : ప్రతిరోజూ గ్రీన్ టీ తాగుతున్నారా? ఆరోగ్యానికి మేలా.. కీడా? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment