Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Long Island City

    -0.79°C

    Stormy
    4.12 km/h
    60%
    0.2h

    Latest

    హైదరాబాద్‌లో మారుతి సుజుకి బలెనో ఆన్-రోడ్ ధర ఎంత?

    హైదరాబాద్‌లో మారుతి సుజుకి బలెనో ఆన్ రోడ్ ధరలు రూ.7.18 లక్షల నుంచి ప్రారంభం. అన్ని వేరియంట్ల ధరలు, మైలేజ్, అదిరిపోయే ఫీచర్ల వివరాలు మీకోసం. హైదరాబాద్‌లో మారుతి సుజుకి బలెనో ఆన్-రోడ్ ధర ఎంత?హైదరాబాద్‌లో మారుతి బలెనో బేస్ వేరియంట్ Sigma MT ఆన్-రోడ్ ధర సుమారు రూ.7.18 లక్షల నుంచి రూ.7.50 లక్షల వరకు ఉంది.

    Kidney Cancer : నగరవాసుల్లో పెరుగుతోన్న కిడ్నీ క్యాన్సర్ కేసులు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తోన్న ఆంకాలజిస్ట్

    Risk Factors for Kidney Cancer : పల్లెల్లో పోలిస్తే నగరాల్లో కిడ్నీ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని.. వాటికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని చెప్తున్నారు నిపుణులు. అవేంటో చూసేద్దాం. Warning Sign of Kidney Cancer : ఇండియాలో కిడ్నీ క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని చెప్తున్నారు నిపుణులు. ముఖ్యంగా మధ్య వయస్కులకు.. అంటే 40 నుంచి పైబడినవారిలో ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపారు. పల్లెలతో పోల్చుకుంటే నగరాల్లో ఎక్కువమంది దీనిబారిన పడుతున్నట్లు పలు అధ్యయనాలు చెప్తున్నాయి. దీనికి రెండు ప్రధానకారణాలు ఉన్నాయని చెప్తున్నారు. అవేంటో.. అసలు కిడ్నీ క్యాన్సర్ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందో, లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.  కిడ్నీ క్యాన్సర్ గురించి విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్​లో కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ పలు విషయాలు తెలిపారు. కిడ్నీ క్యాన్సర్ రావడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని తెలిపారు. వాటిలో ఒకటి సిగరెట్, రెండు ఊబకాయం. ఈ రెండు కారణాలు పట్టణాల్లోని వ్యక్తులను బాగా ఎఫెక్ట్ చేస్తున్నాయని.. ఇవి కిడ్నీ క్యాన్సర్​కు దారితీస్తున్నాయని వెల్లడించారు.  కిడ్నీ క్యాన్సర్ కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. కిడ్నీ కణాల్లో తేడాలు ఏర్పడి.. కణితులుగా ఏర్పడితే దానినే కిడ్నీ క్యాన్సర్ అంటారు.  కిడ్నీ క్యాన్సర్ లక్షణాలు కిడ్నీ క్యాన్సర్ ఉంటే.. యూరిన్​లో రక్తం కనిపించడం, బరువు తగ్గిపోవడం, ఒక వైపు నొప్పి రావడం, ఆకలి తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలు లేకుండా కూడా కిడ్నీ క్యాన్సర్ ఎటాక్ అవ్వచ్చని చెప్తున్నారు నిపుణులు. స్మోకింగ్ వల్ల కిడ్నీ క్యాన్సర్ ఎందుకొస్తుందంటే.. "స్మోకింగ్ చేసినప్పుడు పీల్చుకునే హానికరమైన కెమికల్స్​ని కిడ్నీలు ఫిల్టర్ చేస్తాయి. మన ఒంట్లోకి చేరే ప్రతి కెమికల్​ని కూడా కిడ్నీలు ఫిల్టర్ చేస్తాయి. స్మోక్​లో క్యాన్సర్​కు కారణమయ్యే దాదాపు 70 రకమైన కెమికల్స్ ఉంటాయి. ఇవి కిడ్నీలో ఫిల్టర్ అవ్వడం వల్ల అక్కడ పేరుకుని.. కిడ్నీ కణాల విభజన ప్రక్రియను దెబ్బతీస్తాయి. ఇవే క్యాన్సర్ కణాలుగా మారి.. కిడ్నీ క్యాన్సర్​కు దారితీస్తాయి." - డాక్టర్ శ్రవణ్ కుమార్. ఊబకాయం ప్రభావం..  బరువు ఎక్కువ ఉన్నవారిలో హార్మోనల్ ప్రాబ్లమ్, ఇన్​ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కిడ్నీల్లో కణాలపై ప్రభావం పడి అది క్యాన్సర్​కు దారితీస్తుంది డాక్టర్ శ్రవణ్ తెలిపారు. ఈ రెండు కారణాల వల్ల కిడ్నీ క్యాన్సర్ ప్రమాదం సాధారణంగా కంటే ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు.  తీసుకోవాల్సిన జాగ్రత్తలు   కిడ్నీ క్యాన్సర్ ప్రమాదాన్ని దూరం చేసుకోవడానికి స్మోకింగ్ మానేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే రెగ్యులర్​గా వ్యాయామం చేయాలని చెప్తున్నారు. బ్యాలెన్స్ డైట్ తీసుకుంటూ.. పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే షుగర్, కూల్ డ్రింక్ మానేయాలని.. ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ జోలికి వెళ్లకూడదని సూచిస్తున్నారు.  బీపీ, షుగర్ కూడా అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.  

    Mission Vatsalya: నెలకు రూ.4 వేలు ఇచ్చే ప్రభుత్వ పథకం.. 'మిషన్ వాత్సల్య' స్కీమ్ దరఖాస్తు విధానం ఇలా!

    Mission Vatsalya: అనాథ పిల్లల రక్షణ, భద్రత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిషన్ వాత్సల్య పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఈ పథకం కింద ఏపీ ప్రభుత్వం నెలకు రూ.4 వేలు అందిస్తుంది. Mission Vatsalya: మిషన్ వాత్సల్య (Mission Vatsalya) అనేది భారతదేశంలోని పిల్లల రక్షణ, సంక్షేమం, భద్రత కోసం కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో నిర్వహిస్తోన్న ఒక ప్రతిష్టాత్మకమైన పథకం. గతంలోని 'చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్' పథకానికి మార్పుచేర్పులు చేసి 2021-22 నుంచి దీనిని "మిషన్ వాత్సల్య"గా మార్చారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా మిషన్ వాత్సల్య పథకం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా, రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అమలు చేస్తుంది.   ఆంధ్రప్రదేశ్‌లో పథకం అమలు విధానం రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ ఒక జిల్లా బాలల రక్షణ విభాగం (District Child Protection Unit) ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీనికి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తూ పథకం పర్యవేక్షిస్తుంటారు.   1. ఆర్థిక సహాయం   ఏపీ ప్రభుత్వం ఈ పథకం కింద అర్హులైన పిల్లల చదువు నిరంతరాయంగా సాగడానికి ఆర్థిక సహాయం అందిస్తుంది. గతంలో ఈ సహాయం తక్కువగా ఉండేది, కానీ మిషన్ వాత్సల్య మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం అర్హులైన ప్రతి బిడ్డకు నెలకు రూ. 4,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ డబ్బు నేరుగా లబ్ధిదారులైన పిల్లల/తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు.  2. బాలల సదనాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడిచే చిల్డ్రన్ హోమ్స్, అబ్జర్వేషన్ హోమ్స్ ఈ పథకం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ చేరిన పిల్లలకు ఉచిత వసతి, నాణ్యమైన భోజనం, విద్యా సౌకర్యాలు, వైద్య సహాయం అందిస్తారు. ఏపీలో ఈ హోమ్‌ల పర్యవేక్షణకు ప్రత్యేక తనిఖీ బృందాలు పనిచేస్తాయి. 3. చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు & జువెనైల్ జస్టిస్ బోర్డులు  ఏపీలోని అన్ని జిల్లాల్లో బాలల సంక్షేమ కమిటీలు పనిచేస్తున్నాయి. రక్షణ అవసరమైన పిల్లలను గుర్తించి వారిని హోమ్‌లకు పంపాలా లేదా స్పాన్సర్‌షిప్ ఇవ్వాలా అనేది ఈ కమిటీలే నిర్ణయిస్తాయి. చట్టపరమైన చిక్కుల్లో పడిన బాల నేరస్థుల కౌన్సెలింగ్, సంస్కరణల కోసం జువెనైల్ జస్టిస్ బోర్డులు పనిచేస్తాయి.  లబ్ధిదారులు ఎవరు?  కోవిడ్ మహమ్మారి సమయంలో తల్లిదండ్రులు ఇద్దరినీ లేదా సంపాదించే వ్యక్తిని కోల్పోయిన పిల్లలకు ప్రాధాన్యత భర్త చనిపోయి లేదా వదిలేసి, ఆర్థికంగా పిల్లలను పోషించలేని స్థితిలో ఉన్న మహిళల పిల్లలు  తల్లిదండ్రులు హెచ్‌ఐవీ, క్యాన్సర్ లేదా ఇతర తీవ్రమైన జబ్బులతో బాధపడుతూ పిల్లల పోషణ చూసుకోలేని కుటుంబాలు ఇటుక బట్టీలు, హోటళ్లు, ఇతర పనుల నుంచి రక్షించిన బాలలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో తిరిగే అనాథ పిల్లలు దరఖాస్తు చేసుకునే విధానం   స్థానిక అంగన్‌వాడీ కార్యకర్త లేదా సూపర్‌వైజర్ ద్వారా ప్రాథమిక సమాచారం సేకరించి దరఖాస్తు చేసుకోవచ్చు. మీ పరిధిలోని చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (CDPO) ఆఫీసులో అప్లికేషన్ సమర్పించాలి. జిల్లా కేంద్రంలో ఉండే జిల్లా బాలల రక్షణ అధికారి ఆఫీసులో నేరుగా సంప్రదించి, అవసరమైన పత్రాలు (ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, బోనఫైడ్ సర్టిఫికేట్, తల్లిదండ్రుల మరణ ధృవీకరణ పత్రాలు) సమర్పించాల్సి ఉంటుంది.

    EPFO Update 2026: లైవ్‌లోకి వచ్చిన EPFO ​​వెబ్‌సైట్! PF క్లెయిమ్,పాస్‌బుక్ సర్వీస్‌లో వచ్చిన మార్పులేంటీ?

    EPFO Update 2026: ఎనిమిది రోజుల టెక్నికల్ అప్‌డేట్ తర్వాత ఈపీఎఫ్ఓ ఆన్‌లైన్ పోర్టల్ తిరిగి పనిచేయడం ప్రారంభించింది. సిస్టమ్ అప్‌డేట్ తర్వాత చాలా సర్వీస్‌లు మెరుగయ్యాయి. EPFO Update 2026: సాంకేతిక అప్‌గ్రేడ్ కారణంగా సుమారు ఎనిమిది రోజుల పాటు నిలిచిపోయిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఆన్‌లైన్ పోర్టల్ తిరిగి ప్రారంభమైంది. సుదీర్ఘమైన నిర్వహణ, సిస్టమ్ అప్‌డేట్ తర్వాత, సభ్యులు, యజమానులు దాని సేవలను మళ్లీ ఉపయోగించుకోవచ్చు. EPFO ​​ప్రకారం, ప్రారంభంలో కొన్ని ఆన్‌లైన్ ఫీచర్‌లలో స్వల్ప జాప్యం లేదా సాంకేతిక ఇబ్బందులు తలెత్తవచ్చు.  భవిష్యత్తులో వినియోగదారులకు మరింత విశ్వసనీయమైన, సమర్థవంతమైన సేవలను అందించడమే ప్రధాన లక్ష్యంగా, ఈ పోర్టల్‌ను మునుపటి కంటే చాలా వేగవంతంగా, మరింత సమర్థవంతంగా చేయడానికి విస్తృతమైన డేటాబేస్, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌లు జరిగాయని EPFO ​​చెబుతోంది.  వెబ్‌సైట్‌ను ఎందుకు మూసివేశారు? నిర్వహణ, సాంకేతిక అప్‌డేట్‌ కారణంగా EPFO ​​వెబ్‌సైట్ దాదాపు ఒక వారం పాటు పనిచేయలేదు. ప్రారంభంలో, జూన్ 29న సేవలను పునఃప్రారంభించాలని ప్లాన్ చేసినప్పటికీ, తరువాత దానిని 2026 జూలై 1, 3వ తేదీలకు పొడిగించారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి వెబ్‌సైట్‌ను తిరిగి ప్రారంభించారు,  అన్ని ప్రధాన సేవలు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నట్లు కనిపిస్తోంది.  క్లెయిమ్ -పాస్‌బుక్ సేవలో వచ్చిన మార్పులు ఏంటీ? EPFO ప్రకారం, PF క్లెయిమ్‌లు, సేవా అభ్యర్థనలు ఇప్పుడు దశలవారీగా ప్రాసెస్ అవుతున్నాయి. మొదటి రెండు వారాల పాటు, సిస్టమ్ ఎటువంటి లోపాలు లేకుండా, పూర్తిగా పనిచేస్తుందని నిర్ధారించుకోవడానికి ప్రతి దరఖాస్తుపై అదనపు ధృవీకరణ ,పరిశీలన ఉంటుంది. ఈ సమయంలో, PF క్లెయిమ్‌లు, పాస్‌బుక్‌లు, కొన్ని ఇతర ఆన్‌లైన్ సేవల ప్రాసెసింగ్‌కు ఎక్కువ సమయం పట్టవచ్చు. ప్రస్తుతం, అన్ని సేవలు వినియోగానికి అందుబాటులో ఉన్నాయి. వ్యవస్థను మరింత సమర్థవంతంగా, వేగవంతంగా, సురక్షితంగా చేయడానికి సాఫ్ట్‌వేర్ మొత్తాన్ని అప్‌గ్రేడ్ చేశామని EPFO ​​చెబుతోంది. అయితే, అప్‌గ్రేడ్ తర్వాత పాస్‌బుక్ లేదా క్లెయిమ్స్ సేవకు ఏ కొత్త ఫీచర్లు జోడించారు. లేదా ఈ ప్రక్రియ ఎంత సులభతరం అవుతుంది అనే వివరాలను వారు అందించలేదు.  సభ్యులకు EPFO ​​ముఖ్యమైన సలహా  ఒకే క్లెయిమ్ లేదా అభ్యర్థనను పదేపదే చేయొద్దు.అవసరం లేకపోతే పదేపదే లాగిన్ అవ్వడం లేదా క్లెయిమ్ స్థితిని తనిఖీ చేయడం మానుకోండి.సాంకేతిక నవీకరణ సమయంలో సభ్యులందరూ దయచేసి సహనం వహించాలి. ఈ కొత్త ఫీచర్లు జూలై 15 నుంచి అమలు  ఇప్పుడు తీసుకొచ్చిన మార్పుల వల్ల పీఎఫ్ ఖాతాల్లో వడ్డీ వేగంగా జమ అవుతుంది. ఏటీఎంల ద్వారా పీఎఫ్ నిధులను విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని కూడా ప్రవేశపెట్టవచ్చు. కొత్త నిబంధనలను అమలు చేయడానికి ఈపీఎఫ్ఓ పూర్తిగా సిద్ధంగా ఉంది. దీనివల్ల త్వరలోనే పీఎఫ్ ఖాతాదారులు ఏటీఎంల ద్వారా నిధులను విత్‌డ్రా చేసుకునేందుకు వీలు కలగవచ్చు. ప్రస్తుతం, ఈ సదుపాయాన్ని అమలు చేయడానికి సాంకేతిక పనులు పూర్తి చేస్తున్నారు. దీనిని 2026 జూలై 15 నాటికి ప్రారంభించే అవకాశం ఉంది.   ఇప్పుడు మీకు త్వరలో పీఎఫ్ వడ్డీ లభిస్తుంది ఇప్పుడు, ఈపీఎఫ్ ఖాతాదారులు వడ్డీ చెల్లింపుల కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కొత్త మార్పుల ప్రకారం, వడ్డీ రేటును నిర్ధారించిన సుమారు 10 రోజుల్లోపే నిధులు నేరుగా పీఎఫ్ ఖాతాల్లో జమ అవుతున్నాయి. గతంలో, వడ్డీ చెల్లింపులు అక్టోబర్-నవంబర్ నాటికి ఖాతాల్లో జమ అయ్యేవి. అయితే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) మార్చిలో ఆమోదించినప్పటికీ, 2025-26 సంవత్సరానికి నిర్ధారించిన 8.25% వడ్డీ రేటు ఇంకా ఉద్యోగుల ఖాతాలకు బదిలీ కాలేదు. EPFO ప్రకారం, PF ఖాతాలో జమ చేసిన డబ్బుకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. బ్యాంకు డిపాజిట్లకు ఒక నిర్దిష్ట పరిమితి వరకు మాత్రమే రక్షణ ఉండగా, PF డిపాజిట్లకు ప్రభుత్వం హామీ ఇస్తుంది, కాబట్టి PF డిపాజిట్లు నష్టపోయే ప్రమాదం లేదు.  కొత్త సౌకర్యాన్ని పొందడానికి ఏమి చేయాలి? UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్) ను యాక్టివ్‌గా ఉంచండి. ఆధార్, పాన్, ఇతర అవసరమైన కేవైసీని పూర్తి చేయండి. EPFO పోర్టల్‌లో బ్యాంక్ ఖాతా IFSC కోడ్, ఖాతా నంబర్‌ను సరిగ్గా అప్‌డేట్ చేసి ఉంచండి. కొత్త సౌకర్యాన్ని పొందడంలో మీకు ఎలాంటి సమస్య ఎదురుకాకుండా ఉండేందుకు, మీ మొబైల్ నంబర్, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని అప్‌డేట్‌గా ఉంచుకోండి.

    Agra Bathroom Murder Case: ఆగ్రాలో భర్తను చంపి బాత్‌రూమ్‌లోనే పూడ్చిపెట్టిన భార్య! 45 రోజుల తర్వాత వెలుగు చూసిన దారుణం!

    Agra Bathroom Murder Case: ఆగ్రాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తను చంపేసిన ఓ భార్య డెడ్‌బాడీని బాత్రూమ్‌లో పూడ్చిపెట్టింది. 45 రోజుల తర్వాత ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.  Agra Bathroom Murder Case: నేరం ఎప్పుడూ దాగదు అని పెద్దలు ఊరకే అనలేదు. ఎంతటి తెలివైన నేరస్థుడైనా ఏదో ఒక చోట చిన్న తప్పు చేస్తాడు, అదే అతడిని చట్టానికి చిక్కేలా చేస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ మహిళ కూడా భర్తను హత్య చేసి తప్పించకోవాలని చూసింది. కానీ ఆమె చేసిన తప్పు చట్టానికి పట్టించింది. కాబోయే భర్తను హత్యచేసిన సియా ఘటనపై చర్చ జరుగుతున్న టైంలో ఆగ్రా దుర్ఘటన చర్చనీయాంశంగా మారింది.  ఆగ్రాకు చెందిన సురేంద్ర శర్మ అనే వ్యక్తి 45 రోజుల నుంచి కనిపించడం లేదు. తన భర్త కనిపించడం లేదని భార్య రూబీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. రోజులు గడుస్తున్నా తన భర్త కనిపించడం లేదని బోరుమని శోకాలు పెట్టింది. పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకొని విచారించారు. 45 రోజుల తర్వాత కేసును ఛేదించారు. భార్యే తన భర్తను చంపేసిందని తేల్చారు. బాత్‌రూమ్‌లో పూడ్చిన సురేంద్ర శర్మ డెడ్‌బాడీని వెలికి తీశారు.   కేసును ఎలా ఛేదించారు? ఈ కేసును విచారిస్తున్న టైంలో సురేంద్ర శర్మ సోదరుడి చెప్పిన స్టేట్మెంట్‌ కీలక మలుపు తిప్పింది. సురేంద్ర శర్మ భార్యపైనే అతను అనుమానం వ్యక్తం చేశారు. అంతే అప్పటి నుంచి ఆమె విచారించడం మొదలు పెట్టారు.  అప్పటి వరకు దర్యాప్తుకు హెల్ప్ చేస్తున్నట్టు నటిస్తూనే పోలీసులను తెలివిగా తప్పు దాటి పట్టించింది. కొన్ని రోజుల తర్వాత పోలీసులు స్టైల్ మార్చి ప్రశ్నించారు. అంతే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.   సురేంద్ర శర్మ అదృశ్యమైనట్లు 45 రోజుల క్రితమే రిపోర్ట్ అయ్యింది. ఈ హత్య అప్పుడే జరిగి ఉంటుందని తేలింది. ఈ కేసులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం రూబీ ప్రవర్తన. నేరం చేసిన తర్వాత ఆమె ఏమాత్రం భయపడకుండా, భర్త కోసం వెతుకుతున్నట్లు పోలీసులతో కలిసి తిరిగింది. ఇరుగుపొరుగు వారు తనను అనుమానించకుండా ఉండేందుకు వారి ముందు ఏడ్చేది. భర్తను కిరాతకంగా చంపేసింది. ఎవరికీ అనుమానం రాకుండా బాత్రూమ్‌లో గొయ్యి తవ్వు పూడ్చి పెట్టేసింది. దానిపై ఫ్లోరింగ్ వేసింది. పోలీసులు కేసును ఛేదించి ఫ్లోరింగ్ తీసి డెడ్‌బాడీని రికవరీ చేసుకున్నారు. ఒక మనిషిని చంపి, అదే ఇంట్లో శవంపై నడుస్తూ ఇన్ని రోజులు గడపడం ఆమెలోని నేరపూరిత మనస్తత్వానికి అద్దం పడుతోంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టానికి పంపారు. నిందితురాలు రూబీని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. కట్టుకున్న భార్యే కాలయముడిలా మారడం కుటుంబ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. నేరం ఎంత చాకచక్యంగా చేసినా, చట్టం నుంచి తప్పించుకోవడం అసాధ్యమని ఈ ఘటన మరోసారి నిరూపించింది.  ఈ కేసు 2025 ఫిబ్రవరిలో జరిగిన బ్లూ డ్రమ్ మర్డర్ కేసును గుర్తుకు తెస్తోంది. అప్పట్లో మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్‌ను అతని భార్య ముస్కాన్ రాజ్‌పుత్ తన ప్రియుడితో కలిసి చంపి, శరీర భాగాలను కోసి ఒక నీలం రంగు డ్రమ్‌లో పెట్టి సిమెంట్‌తో సీల్ చేసింది. ఇప్పుడు ఆగ్రాలో జరిగిన ఈ బాత్‌రూమ్ హత్య కూడా అదే తరహాలో అత్యంత క్రూరంగా, పక్కా ప్రణాళికతో జరిగినట్లు కనిపిస్తోంది.

    NEET JEE Weightage Changes: NEET, JEE అడ్మిషన్లలో బోర్డు మార్కులకు 50% వెయిటేజీ? విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే పనిలో కేంద్రం!

    NEET JEE Weightage Changes: దేశవ్యాప్తంగా NEET, JEEలో ఎలాగైనా సీటు సంపాదించాలని విద్యార్థులు రాత్రి పగలు శ్రమిస్తున్నారు. దీంతో వారిపై ఒత్తిడి పెరుగుతోంది. దీన్ని తగ్గించే పనిలో కేంద్రం ఉంది.  NEET JEE Weightage Changes: విద్యార్థి జీవితంలో కీలకమైన మలుపు ఇంటర్‌మీడియట్. దీని తర్వాత రాసే ప్రతీ పరీక్ష కూడా విద్యార్థులపై ఒత్తిడి పెంచుతోంది. అన్నింటి కంటే NEET, JEEపై ఉన్న ఒత్తిడి అంతా ఇంతా కాదు. ఎక్కడైనా పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత విజయం సాధించలేకపోయామని కొందరు విద్యార్థులు విషాదకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. కానీ జేఈఈ, నీట్‌ విషయంలో మాత్రం పరీక్ష భయంతోనే విద్యార్థులు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతటి ఒత్తిడి ఉన్న ఈ పరిక్షల్లో కీలక సంస్కరణలు చేపట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ జాతీయ స్థాయి పరీక్ష కేవలం ప్రవేశ పరీక్ష మార్కులు ఆధారంగానే విద్యార్థులకు సీట్లు కేటాయిస్తున్నారు. అందుకే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని విద్యార్థులపై ఆరో తరగతి నుంచే ఒత్తిడి పెడుతున్నారు. అందుకే సంస్కరణలు చేపట్టాలని కేంద్రం చూస్తోంది. ప్రవేశ పరీక్ష మార్కులతోపాటు బోర్డు పరీక్షల్లో వచ్చే మార్కులను కూడా పరిగణలోకి తీసుకోవాలని చూస్తోంది. ఇలా చేయడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గి చదువుల శైలిలో మార్పులు వస్తాయని ఆశిస్తోంది   పరిగణలోకి బోర్డు పరీక్ష ఫలితాలు  ప్రస్తుతం జేఈఈ, నీట్‌లో విద్యార్థులు సాధించిన మార్కులు ఆధారంగానే సీట్లు కేటాయిస్తున్నారు. అందులో ఈ మార్కులు, రిజర్వేషన్లు ఆధారంగా వారికి అత్యున్నత విద్యా సంస్థల్లో చదువుకునే వీలు కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు బోర్డు పరీక్షలను కేవలం అర్హతగా చూస్తున్నారు. అంటే బోర్డు పరీక్షల్లో పాస్ అయితే చాలు వాళ్లు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు రాసుకోవచ్చు. దీన్ని మార్చాలని కేంద్రం చూస్తోందని తెలుస్తోంది. జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం విద్యార్థుల మెరిట్ జాబితా సిద్ధం చేసినప్పుడు బోర్డు పరీక్షల మార్కులను కూడా పరిగణలోకి తీసుకుంటే మంచిదని భావిస్తోంది. ఇది 50 శాతం వరకు ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తోంది.   ఒకవేళ ప్రచారం జరుగుతున్నట్టు ఈ సంస్కరణ అమలులోకి వస్తే విద్యార్థులు, కాలేజీలు బోర్డు చదువులపై కూడా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు వాటిని పాస్ కోసం మాత్రం చూస్తూ వచ్చారు. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలపై ఎక్కువ ఫోకస్ చేశారు. అంతే కాదు పోటీ పరీక్ష తీవ్రతను కూడా తగ్గించే పనిలో ఉంది. ప్రస్తుతం విద్యార్థులు చదువుతున్న సబ్జెక్ట్‌కు అనుగుణంగానే సిలబస్ మారిస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీని వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గడమే కాకుండా కోచింగ్ సెంటర్స్‌ దందా కూడా తగ్గుతుందని ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకు ఏడాదిలో ఒకసారి మాత్రమే ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించే వారు, ఇప్పుడు దీన్ని మల్టిపుల్ టైమ్స్ నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆప్షన్ కూడా ప్రభుత్వం వద్ద ఉంది. కంప్యూట్ ఆధారిత ఆన‌ డిమాండ్ పరీక్షలు నిర్వహించాలని సిఫార్సులు అందుకున్నారు. మార్పులకు కారణాలు  కీలకమైన సంస్కరణకు చాలా కారణాలు ఉన్నాయి. పరీక్ష పత్రాల లీకేజీ ప్రధాన సమస్యగా మారింది. పరీక్షలకు ఉన్న డిమాండ్ దృష్ట్యా లీకేజీలు అరికట్టడం అధికారులకు పెద్ద సమస్యగా మారింది. దీంతోపాటు పరీక్ష విధానంలో కూడా చాలా మార్పులు ఉన్నాయి. మూల్యాంకనంపై అనేక అనుమానాలు ఉంటున్నాయి. పైస్థాయిలోనే కాకుండా క్షేత్ర స్థాయిలో కూడా సమస్యలను ప్రభుత్వం గుర్తించింది. కొంతమంది కేవలం ఈ జాతీయ స్థాయి పరీక్షల కోసమే సన్నద్ధమవుతున్నారు. కీలకమైన బోర్డు సిలబస్‌ను పట్టించుకోవడం లేదు. ప్రత్యేక కోచింగ్ సెంటర్స్‌కు వెళ్లి కాలేజీకులకు, స్కూల్స్‌కు వెళ్లకుండా ప్రిపేర్ అవుతున్నారు. దీని వల్ల వారిలో సబ్జెక్ట్ రాకుండా పోతోంది. అలాంటి విద్యార్థులు సీటు రాకపోతే ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు విద్యార్థులు సీరియస్‌గా అన్నింటిని కవర్ చేస్తూ చదువుతున్నారు. అలాంటి విద్యార్థుల జీవితం ఒక రోజు పరీక్షతో నిర్ణయం కావడం కూడా ఆందోళన కలిగిస్తోంది. ఆ రోజు విద్యార్థి రాలేకపోయినా, ఆరోగ్యం బాగాలేకపోయినా, ఇంకా ఏదైనా జరిగినా మరో ఏడాది వరకు ఎదురు చూడాల్సి వస్తోంది. విలువైన కాలం వృథా పోతోంది. ఇలాంటి వాటికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వం సరికొత్త సంస్కరణలు చేపట్టాలని చూస్తోంది.  సంస్కరణలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే.... ఈ రెండు జాతీయ స్థాయి పరీక్షా విధానంలో ఉన్న లోపాలు గమనించిన ప్రభుత్వం గత ఏడాది 9 మంది సభ్యులతో కూడిన ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. లోపాలు లేకుండా విద్యార్థులపై ఒత్తిడి పడకుండా, పారదర్శకత పెంచేందుకు లోతైన అధ్యయనం చేయాలని టాస్క్ ఈ కమిటీకి అప్పగించింది. ప్రస్తుతం ఈ కమిటీ తన స్టడీని కంప్లీట్ చేసింది. త్వరలోనే కేంద్రానికి నివేదిక ఇవ్వబోతోంది. ప్రభుత్వానికి నివేదిక అందిన తర్వాత వారు చేసిన సిఫార్సులు అమలు విషయంపై క్లారిటీ వస్తుంది. వాటి తీవ్రతను బట్టి వచ్చే విద్యాసంవత్సరం నుంచా లేదా దశల వారీగా అమలు చేస్తారా అనేది తేల్చనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మాత్రం కొన్ని అమలు అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం అందుతోంది. 

    BAT-BMS Controversy: BAT-BMSతో సహా 7 యాప్‌లను తొలగించాలని గూగుల్‌, ఆపిల్‌కు ప్రభుత్వం నోటీసులు! ఎందుకు ఎలా వివాదం మొదలైంది?

    BAT-BMS Controversy: ఈ-రిక్షా డ్రైవర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని, కేంద్రం కీలక చర్య తీసుకుంది. బ్యాటరీ నిర్వహణకు సంబంధించిన BAT-BMSతో సహా ఏడు యాప్‌లను తొలగించాలని గూగుల్,  ఆపిల్‌కు నోటీసులు ఇచ్చారు.  BAT-BMS Controversy: మీరు ఈ-రిక్షా నడుపుతున్నా లేదా ఎలక్ట్రిక్ వాహనాలతో సంబంధం కలిగి ఉన్నా, ఈ వార్త మీకు అత్యంత ముఖ్యమైంది. ఈ-రిక్షా బ్యాటరీలను రిమోట్‌గా నియంత్రించడానికి లేదా ఆపివేయడానికి దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలపై ఏడు మొబైల్ యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. తత్ఫలితంగా, ఈ యాప్‌లను యాప్ స్టోర్‌ల నుంచి తొలగించాలని ప్రభుత్వం గూగుల్, ఆపిల్‌లను కోరింది. ఈ నిర్ణయం ఈ-రిక్షా డ్రైవర్లకు ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు. కొంతకాలంగా సోషల్ మీడియాలో అనేక వీడియోలు, ఫిర్యాదులు వెలుగులోకి వస్తున్నాయి. బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (BMS)కు అనుసంధానించిన మొబైల్ యాప్‌లను ఉపయోగించి కొందరు వ్యక్తులు, కదులుతున్న ఈ-రిక్షాల బ్యాటరీని అకస్మాత్తుగా ఆపివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రోజువారీ ఆదాయం దెబ్బతింటోందని చాలా మంది డ్రైవర్లు చెప్పారు. దీనివల్ల డ్రైవర్లు మధ్యలోనే చిక్కుకుపోవడంతోపాటు ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతోంది.  ఎలక్ట్రానిక్స్ -ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గూగుల్ ఆండ్రాయిడ్, ఆపిల్ ఐఓఎస్‌లకు నోటీసు జారీ చేసింది. BAT-BMSతో సహా ఏడు యాప్‌లను తమ యాప్ స్టోర్‌ల నుంచి తొలగించాలని మంత్రిత్వ శాఖ ఈ రెండు కంపెనీలను కోరింది. ఒక యాప్‌ను ప్రజాభద్రతకు ముప్పు కలిగించడానికి లేదా ప్రజా శాంతికి భంగం కలిగించడానికి ఉపయోగిస్తుంటే, అటువంటి యాప్‌లపై చర్య తీసుకోవడం అవసరమని ప్రభుత్వం పేర్కొంది. అందుకే ఈ యాప్‌లను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. BAT-BMS యాప్ అంటే ఏమిటి? BAT-BMS, లేదా బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌కు సంబంధించిన యాప్‌లు సాధారణంగా బ్యాటరీ స్థితి, ఛార్జింగ్, ఉష్ణోగ్రత, ఇతర సాంకేతిక సమాచారాన్ని పర్యవేక్షించడానికి యూజ్ అవుతున్నాయి. ఈ యాప్‌లు బ్యాటరీని పర్యవేక్షించడంలో సహాయపడతాయి, కానీ వాటిని దుర్వినియోగం చేస్తే, అవి బ్యాటరీ పనితీరును ప్రభావితం చేయగలవు. అందుకే ప్రభుత్వం ఇటువంటి యాప్‌ల పట్ల కఠినమైన భద్రతా విధానాన్ని అవలంబించింది. ఇ-రిక్షా డ్రైవర్లకు ఎలా ప్రయోజనం చేకూరుతుంది? ఈ ప్రభుత్వ చర్య ఇ-రిక్షా డ్రైవర్లకు ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు. ఇలాంటి యాప్‌ల దుర్వినియోగాన్ని అరికడితే, ప్రయాణంలో ఇ-రిక్షాలు ఆగిపోవడం వంటి ఘటనలు తగ్గుతాయి. దీనివల్ల డ్రైవర్లకు సమయం ఆదా అవుతుంది, వారి జీవనోపాధిపై భారం తగ్గుతుంది, ప్రయాణీకుల ప్రయాణాలు మునుపటి కంటే సురక్షితంగా మారతాయి. అన్ని ఈ-రిక్షాలు ప్రభావితం అవుతాయా? ఈ సమస్య ప్రతి ఈ-రిక్షాలో లేదని నిపుణులు అంటున్నారు. మొబైల్ యాప్ ద్వారా యాక్సెస్ అందించే కొన్ని బ్యాటరీల్లో మాత్రమే ఈ లోపం గుర్తించారు. అటువంటి వ్యవస్థ లేని వాహనాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే, బ్యాటరీని కొనుగోలు చేసేటప్పుడు, దానికి తగిన భద్రతా ఫీచర్లు, సురక్షితమైన సాఫ్ట్‌వేర్ ఉన్నాయని నిర్ధారించుకోండి. కొన్ని రోజుల క్రితం వరకు, ఒక మొబైల్ యాప్ ఇ-రిక్షాల విషయంలో దేశవ్యాప్తంగా ఇంత పెద్ద చర్చను రేకెత్తిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు సరిగ్గా అదే చేశాయి. ఈ వీడియోలలో, ప్రజలు మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి కదులుతున్న ఇ-రిక్షాను సమీపించగానే, క్షణాల్లో ఆ వాహనం ఆగిపోతుంది. ఈ వీడియోలు వేగంగా లక్షలాది మందికి చేరి, ఇ-రిక్షా డ్రైవర్లలో భయాన్ని వ్యాపింపజేశాయి. బ్యాటరీ తయారీ కంపెనీలపై ప్రశ్నలు తలెత్తాయి, చివరికి ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవలసి వచ్చింది. మొదట్లో, ఈ వివాదం మొత్తం చైనీస్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ యాప్ అయిన BAT-BMS చుట్టూ తిరిగింది, కానీ చర్చ ముందుకు సాగేకొద్దీ, ఇది కేవలం ఒక యాప్‌కు సంబంధించిన సమస్య కాదని స్పష్టమైంది. అసలు ప్రశ్న భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థ సైబర్‌సెక్యూరిటీకి సంబంధించింది. దేశంలో EVలను స్వీకరిస్తున్న వేగానికి అనుగుణంగా వాటి డిజిటల్ భద్రత పటిష్టంగా ఉందా లేదా అన్నదే అసలు ప్రశ్న.  ప్రభుత్వం ఇప్పటివరకు ఏమి చేసింది? కేంద్ర ప్రభుత్వం ఈ విషయానికి సంబంధించిన రెండు యాప్‌లను తొలగించింది. ఎలక్ట్రానిక్స్,  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ జూలై 3న మాట్లాడుతూ, తమ దృష్టికి వచ్చిన రెండు యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించినట్లు తెలిపారు. ఈ రెండు యాప్‌లు BAT-BMS, Epoch Li-ion.  యాప్ స్టోర్‌లు కూడా జాగ్రత్త వహించాలని, భవిష్యత్తులో ఇలాంటి హానికరమైన యాప్‌లు మళ్లీ అందుబాటులోకి రాకుండా చూసేందుకు ప్రభుత్వం గూగుల్, ఆపిల్‌లతో సంప్రదింపులు జరుపుతుందని ఎస్. కృష్ణన్ పేర్కొన్నారు. ఈ ఘటనతో బ్యాటరీ వ్యవస్థలోని సైబర్ బలహీనతలను కూడా ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది. మనం బ్యాటరీని మానవ శరీరంగా భావిస్తే, BMS దాని మెదడు. బ్యాటరీ ఎంత ఛార్జ్ అవ్వాలి, ఎంత డిశ్చార్జ్ అవ్వాలి. ప్రతి సెల్ ఉష్ణోగ్రతను ఇది నిర్ధారిస్తుంది. బ్యాటరీ అధికంగా వేడెక్కుతోందా లేదా షార్ట్ సర్క్యూట్ ప్రమాదం ఏమైనా ఉందా అని కూడా ఈ యాప్ పర్యవేక్షిస్తుంది. మొత్తమ్మీద, బ్యాటరీ సురక్షితంగా పనిచేస్తూనే ఉండేలా చూడటమే BMS పని. చాలా ఆధునిక BMSలు ఇప్పుడు బ్లూటూత్ మాడ్యూల్‌తో వస్తున్నాయి. దీనివల్ల మొబైల్ యాప్ ద్వారా పూర్తి బ్యాటరీ సమాచారాన్ని పొందవచ్చు. సర్వీస్ ఇంజనీర్లు, అధీకృత డీలర్లు బ్యాటరీ ఆరోగ్యాన్ని తనిఖీ చేయడానికి ఈ యాప్‌ను ఉపయోగిస్తారు. కొన్ని BMSలు భద్రతా కారణాల దృష్ట్యా బ్యాటరీని ఆన్ లేదా ఆఫ్ చేసే ఎంపికను కూడా అందిస్తాయి. అసలు వివాదం ఇక్కడే మొదలవుతుంది; సర్వీసింగ్‌ను సులభతరం చేయడానికి రూపొందించిన ఒక ఫీచర్‌ను ఇప్పుడు దుర్వినియోగం చేస్తున్నారు. వైరల్ వీడియోలో ఏం చూపించారు? సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వీడియో ప్రకారం, కొంతమంది వ్యక్తులు రోడ్డుపై వెళ్తున్న ఈ-రిక్షా వద్దకు వెళ్లి, ఒక మొబైల్ యాప్‌ను తెరిచి, బ్యాటరీకి కనెక్ట్ చేయగా, కొన్ని సెకన్ల తర్వాత ఆ ఈ-రిక్షా ఆగిపోతుంది. చాలా వీడియోలలో ఇబ్బంది పడుతున్న డ్రైవర్లు కనిపించారు. కొందరు తమ రిక్షాలను వీధిలో నెట్టుకుంటూ వెళ్లగా, మరికొందరు డబ్బులు కోల్పోయారు. కొందరు దీనిని ఒక ప్రహసనంగా మార్చగా, ఉత్తర భారత్‌లోని కొన్ని ప్రాంతాలలో దీనికి టెర్రీ కంట్రోల్ అనే పేరు కూడా వచ్చింది. ఈ వీడియోల వల్ల, ఎవరైనా తమ మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి ఎప్పుడైనా ఈ-రిక్షాను ఆపవచ్చనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది.   ఈ-రిక్షాను నిజంగా నియంత్రించవచ్చా? సరళమైన సమాధానం ఏమిటంటే, లేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అన్ని ఇ-రిక్షాలు ఈ సమస్యతో ప్రభావితం కావు. లెడ్-యాసిడ్ బ్యాటరీలతో నడిచే ఇ-రిక్షాలు పూర్తిగా సురక్షితమైనవి, ఎందుకంటే వాటిలో బ్లూటూత్-ఎనేబుల్డ్ BMS ఉండదు. అదేవిధంగా, అనేక పెద్ద కంపెనీల బ్యాటరీలు వాటి సొంత, యాజమాన్య యాప్‌లపై పనిచేస్తాయి. ఏ థర్డ్-పార్టీ యాప్‌లకు కనెక్ట్ కావు. అటువంటి సాధారణ యాప్‌లకు కనెక్ట్ చేయగల కొన్ని బ్లూటూత్-ఎనేబుల్డ్ లిథియం బ్యాటరీలకు మాత్రమే ప్రమాదం ఉంది. BMSకు బలమైన పాస్‌వర్డ్ లేదా ప్రామాణీకరణ లేకపోతేనే అవి కూడా ప్రమాదానికి గురవుతాయి. అంటే వైరల్ వీడియోలో చూపించిన దృశ్యం ప్రతి వాహనానికి వర్తించదు. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది అనవసరమైన భయాందోళనలను నివారించగలదు. BAT-BMS వివాదం ఎలా మొదలైంది?  వైరల్ అయిన వీడియో తర్వాత, BAT-BMS అనే యాప్ మొదట వెలుగులోకి వచ్చింది. దీనిని చైనా కంపెనీ షెన్‌జెన్ గ్రీనర్జీ టెక్నాలజీ అభివృద్ధి చేసింది. వాస్తవానికి దీనిని బ్లూటూత్ ద్వారా లిథియం-అయాన్ బ్యాటరీలను పర్యవేక్షించడానికి ,సర్వీస్ చేయడానికి రూపొందించారు. ఈ యాప్ బ్యాటరీ వోల్టేజ్, కరెంట్, ఉష్ణోగ్రత, ఛార్జింగ్ స్థితి, బ్యాటరీ హెల్త్‌ను చూపిస్తుంది. కొన్ని అనుకూలమైన బ్యాటరీల్లో, బ్యాటరీని ఆన్ లేదా ఆఫ్ చేయడానికి అనుమతించే నియంత్రణ ఫీచర్ కూడా ఉంటుంది. కొంతమంది ఈ నియంత్రణ ఫీచర్‌ను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణ ఉంది. నిపుణుల ప్రకారం, ఈ యాప్ సుమారు పది నుంచి పదిహేను మీటర్ల బ్లూటూత్ పరిధిలో అనుకూలమైన బ్యాటరీలకు కనెక్ట్ అవ్వగలదు, ఒకవేళ బ్యాటరీ భద్రతకు భంగం కలిగితే, దానిని ఆఫ్ కూడా చేయవచ్చు. కొత్త మలుపు ఏంటి? మొదట్లో,సమస్య కేవలం BAT-BMSతోనే ఉందని, దానిని తొలగిస్తే సమస్య పరిష్కారమవుతుందని భావించారు. కొన్ని పరీక్షల్లో, బ్యాటరీని ఆఫ్ చేసే ముందు యాప్ పాస్‌వర్డ్ అడుగుతోందని కూడా వెల్లడైంది. వేరొక బ్యాటరీ మేనేజ్‌మెంట్ యాప్‌ను ప్రయత్నించినప్పుడు అసలు మలుపు వచ్చింది. ఆ యాప్ కూడా అదే అనుకూలమైన బ్యాటరీకి కనెక్ట్ అయి, దానిని ఆఫ్ చేయడం ప్రారంభించింది.  ప్రభుత్వం ఇప్పుడు BAT-BMS, Epoch Li-ion అనే రెండు యాప్‌లను కూడా తొలగించింది. బ్యాటరీ హార్డ్‌వేర్ స్వయంగా సురక్షితంగా లేనప్పుడు, కేవలం ఒక యాప్‌ను తొలగించడం వల్ల సమస్య పూర్తిగా పరిష్కారం కాదని దీని ద్వారా స్పష్టమవుతోంది. దానికి అనుకూలమైన మరో యాప్, అదే లోపభూయిష్ట బ్యాటరీకి కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించవచ్చు. ఇక్కడే ఈ సమస్య ఒకే యాప్ పరిధిని దాటి, మొత్తం EV వ్యవస్థకు సంబంధించిన సైబర్‌సెక్యూరిటీ సమస్యగా మారుతుంది. బలహీనత ఎక్కడ ఉంది? ఈ మొత్తం వివాదానికి ఇదే కీలకం. సమస్య ఏదైనా ఒకే యాప్‌లో కంటే, భద్రత బలహీనంగా ఉన్న BMSలోనే ఎక్కువగా ఉంది. బ్యాటరీ బ్లూటూత్ బహిర్గతమై, దానికి బలమైన పాస్‌వర్డ్ లేనప్పుడు ప్రమాదం పొంచి ఉంటుంది. కొన్నిసార్లు, ఫ్యాక్టరీ డిఫాల్ట్ పాస్‌వర్డ్‌ను ఎప్పటికీ మార్చరు, అది అలాగే ఉండిపోతుంది. కొన్ని సందర్భాల్లో, ప్రామాణీకరణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది, మరికొన్నింటిలో ఫర్మ్‌వేర్ తగినంత సురక్షితంగా ఉండదు.   భారతదేశంలో విక్రయించిన అనేక చవకైన ఇ-రిక్షా, ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్యాటరీలు పాస్‌వర్డ్‌లు లేకుండా వస్తాయి లేదా ఫ్యాక్టరీ డిఫాల్ట్ పాస్‌వర్డ్‌లతో పనిచేస్తాయి. అటువంటి సందర్భాల్లో, సుమారు పది నుంచి పదిహేను మీటర్ల బ్లూటూత్ పరిధిలో ఉన్న ఎవరైనా యజమానికి తెలియకుండా బ్యాటరీకి కనెక్ట్ అవ్వగలరు. దీని అర్థం, అసలైన ముప్పు యాప్‌తో కాకుండా, హాని కలిగించే హార్డ్‌వేర్, బలహీనమైన సెట్టింగ్‌లతోనే ఉంది. ఇది హ్యాకింగా?  ప్రతి కేసును హ్యాకింగ్ ఘటన అని పిలవడం సరికాదని సాంకేతిక నిపుణులు అంటున్నారు. ఒక సిస్టమ్‌ను పాస్‌వర్డ్ లేకుండా తెరిచి ఉంచినప్పుడు, ఎవరైనా దాని అధికారిక నియంత్రణ ఫీచర్లను దుర్వినియోగం చేస్తే, అది సాంప్రదాయ సైబర్ హ్యాకింగ్ కాదు, కేవలం ఒక భద్రతా లోపం మాత్రమే. చట్టపరంగా చూస్తే, అనుమతి లేకుండా ఇతరుల సిస్టమ్‌లోకి ప్రవేశించి, దాన్ని నియంత్రించడం నేరంగా పరిగణిస్తారు.  ఇ-రిక్షా డ్రైవర్లపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? డ్రైవర్లకు ఇది కేవలం సాంకేతిక సమస్య మాత్రమే కాదు, వారి జీవనాధారానికి సంబంధించిన ప్రత్యక్ష విషయం. చాలా మంది ఈ-రిక్షా డ్రైవర్లు తమ వాహనాలను అద్దెకు తీసుకుంటారు, కాబట్టి ఒక్క రోజు నష్టం కూడా వారికి అత్యంత నష్టదాయకం. ఒకవేళ ప్రయాణం మధ్యలో ఈ-రిక్షా పాడైపోతే, ప్రయాణికులు దిగిపోతారు, తమ ఛార్జీని కోల్పోతారు, వాహనాన్ని నెట్టుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల వారు తమ రోజంతా సంపాదించినదంతా కోల్పోతారు.  చాలా మంది డ్రైవర్లు తమ రిక్షా నిజానికి పాడైపోలేదని, ఒక యాప్ ద్వారా అది నిలిచిపోతందని తెలియదు. ఈ సందర్భంలో కొందరు, రిక్షాలో నిజానికి ఎలాంటి లోపం లేకపోయినా, తమ వాహనాన్ని బాగు చేయించుకోవడానికి అటుగా వెళ్లేవారికి లేదా మెకానిక్‌కు డబ్బు చెల్లించడానికి ప్రయత్నిస్తారు. ఢిల్లీలో జరిగిన ఒక ఘటనలో, ఒక డ్రైవర్ రిక్షా ఉదయం అంతా ఒకే చోట నిలిచిపోవడంతో, అతను తన రోజువారీ సంపాదన అయిన సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలను కోల్పోయాడు. ఆ తర్వాత, అక్కడే ఉన్న ఒక వ్యక్తి అతని యాప్‌ను ఉపయోగించి రిక్షాను మళ్లీ నడిచేలా చేశాడు. గత కొన్ని రోజులుగా ఇలాంటి ఫిర్యాదులు పెరిగాయని, చాలా వాహనాలను తనిఖీ కోసం వర్క్‌షాప్‌లకు పంపినట్లు డీలర్లు చెబుతున్నారు. కేవలం యాప్‌ను తొలగించడమే పరిష్కారమా? లేదు. BAT-BMSను తొలగించినప్పటికీ, అదే లోపభూయిష్ట హార్డ్‌వేర్‌కు మరో యాప్ కనెక్ట్ అవ్వగలిగితే సమస్య కొనసాగుతుంది. అందుకే Epoch Li-ion వంటి ఇతర యాప్‌లు వచ్చిన తర్వాత ఈ చర్చ తీవ్రమైంది. కాబట్టి, అసలైన పరిష్కారం యాప్‌లను తొలగించడం కాదు, బ్యాటరీ, BMS భద్రతను మొదటి నుంచి పటిష్టం చేయడమే. హార్డ్‌వేర్ సురక్షితంగా ఉండే వరకు, యాప్‌లు వస్తూ పోతూనే ఉంటాయి. ముప్పు కొనసాగుతూనే ఉంటుంది. సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు పలు సూచనలు ఇస్తున్నారు. మొదటిది, ప్రతి BMSకు ఒక ప్రత్యేకమైన పాస్‌వర్డ్ తప్పనిసరిగా ఉండాలి, మొదటిసారి ఉపయోగించినప్పుడు ఫ్యాక్టరీ డిఫాల్ట్ పాస్‌వర్డ్‌ను మార్చాలి. బ్లూటూత్ కనెక్షన్‌లను ఎన్‌క్రిప్ట్ చేయాలి, అధీకృత డివైస్‌లు మాత్రమే బ్యాటరీకి కనెక్ట్ అయ్యేలా చూడాలి. అదనంగా, బ్యాటరీని ఆన్ లేదా ఆఫ్ చేయడం వంటి నియంత్రణ ఫీచర్‌ల కోసం బహుళ-స్థాయి ప్రమాణీకరణ అవసరం, అంటే ఒకే పాస్‌వర్డ్ సరిపోదు. వాహనాలను డెలివరీ చేసే ముందు డీలర్లు తప్పనిసరిగా భద్రతా సెట్టింగ్‌లను ఏర్పాటు చేయాలి. అన్నింటికన్నా ముఖ్యంగా, ప్రభుత్వం EV బ్యాటరీల కోసం నిర్దిష్ట సైబర్‌సెక్యూరిటీ ప్రమాణాలను జారీ చేయాలి, తద్వారా ప్రతి కంపెనీ వాటిని పాటించేలా చూడాలి. ప్రతిఒక్కరూ ఈ మూడు విషయాలు గమనించాలి!  మొదటగా, ప్రభుత్వ దర్యాప్తు ఏం వెల్లడిస్తుంది. వాస్తవానికి ఎన్ని బ్యాటరీలు ప్రభావితమయ్యాయి? రెండోది, భవిష్యత్తులో అటువంటి యాప్‌ల విషయంలో గూగుల్, ఆపిల్ ఏ విధానాన్ని అవలంబిస్తాయి? మూడోదిగా, EV బ్యాటరీలు, బ్యాటరీ నిర్వహణ వ్యవస్థల కోసం భారత్‌ ఏవైనా ప్రత్యేక సైబర్‌ సెక్యూరిటీ నిబంధనలను విధిస్తుందా? అనేది అతిపెద్ద ప్రశ్న

    Eng Playing XI Vs Ind in Manchester T20: ఇండియాతో సెకండ్ టీ20కి ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవ‌న్ ప్ర‌క‌ట‌న‌.. స్టార్ పేస‌ర్ రీఎంట్రీ

    మాంచెస్టర్‌లో జరగబోయే సెకండ్ టీ20 మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ తమ ప్లేయింగ్ ఎలెవన్ లో ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ను తిరిగా తీసుకువచ్చింది. England Name Playing XI For Manchester T20I:  ఇండియాతో శనివారం మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరగబోయే రెండో టీ20 మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ టీమ్ తమ ప్లేయింగ్ ఎలెవన్ లో రెండు మేజర్ చేంజెస్ అనౌన్స్ చేసింది. స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ మళ్లీ టీమ్‌లోకి కంబ్యాక్ ఇవ్వగా, యంగ్ ఫాస్ట్ బౌలర్ జోష్ టంగ్ ఈ మ్యాచ్ తో తన టీ20 ఇంటర్నేషనల్ డెబ్యూ చేయబోతున్నాడు. వర్షం వల్ల ర‌ద్ద‌యిన‌ ఫస్ట్ మ్యాచ్ లో ఆడిన సాకిబ్ మహమూద్, ల్యూక్ వుడ్ లపై ఇంగ్లాండ్ మేనేజ్‌మెంట్ వేటు వేసి ఈ ఇద్దరినీ లైన్ లోకి తెచ్చింది. ఆల్రెడీ టెస్టులు, వన్డేల్లో ఇంగ్లాండ్‌ను రిప్రెజెంట్ చేసిన జోష్ టంగ్, ఇప్పుడు ఫస్ట్ టైమ్ పొట్టి ఫార్మాట్ లో అడుగుపెడుతున్నాడు. ఆర్చర్ రీఎంట్రీతో హోస్ట్ టీమ్ ఇంగ్లాండ్ తమ పేస్ అటాక్ ను నెక్స్ట్ లెవెల్ కు స్ట్రాంగ్ చేసుకుంది. ఫైవ్-మ్యాచ్ సిరీస్ లో లీడ్ సాధించడమే టార్గెట్ గా ఇంగ్లాండ్ ఈ ప్లాన్ వేసింది.

    Why Europe Is Heating Up?: యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..?

    చల్లగా ఉండే యూరప్ ఖండం ఇప్పుడు ఓవెన్‌లా ఎందుకు మండుతోంది? గ్లోబల్ క్లైమేట్ హాట్‌స్పాట్‌గా మారడం వెనుక ఉన్న సైంటిఫిక్ కారణాలు ఏెంటి..? యూరోప్ సంక్షోభం ప్రపంచ దేశాలన్నింటికీ ఏ ప్రమాద సంకేతం. Climate Change in Europe: యూరోప్ అల్లాడిపోతోంది. ప్రపంచ వేసవి విడిది అని పేరున్న ఆ ఖండం.. వేడి ధాటిని తట్టుకోలేకపోతోంది. ఆహ్లాదకరమైన వాతావరణం, చల్లని వేసవి కాలం,  సుందర ప్రకృతి దృశ్యాలు.. ఆల్ఫ్ పర్వతాల అందాలు ఇదీ యూరోప్ గురించి అందరికీ తెలిసింది. కానీ ఇప్పుడు రోడ్ల మీద ఇబ్బంది పడుతున్నరజలు.. ఎండలకు పిట్టల్లా రాలుతున్న ప్రాణాలు.. వేడికి అల్లాడుతున్న దేశాలు... ఇదీ ఇప్పుడు పరిస్థితి. యూరోప్ ఇప్పుడు వేగంగా ఒక గ్లోబల్ క్లైమేట్ హాట్‌స్పాట్‌గా మారుతోంది. మధ్యధరా సముద్రం మీద నుంచి ఉత్తర మైదానాల వరకూ ఇప్పుడు వేసవి విడిది కాదు. అదొక వాతావరణ అత్యయిక స్థితి..! భూమిపై అత్యంత వేగంగా వేడెక్కుతున్న ఖండం యూరోప్ మీకు తెలుసా. యూరోపియన్ ద్వీపకల్పమే ఇప్పుడు భూమిమీద అత్యధికంగా వేడెక్కుతున్న ప్రాంతం. కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ (C3S) మరియు వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్ (WMO) డేటా ఒక చేదు నిజాన్ని నిర్ధారిస్తోంది:  పారిశ్రామిక విప్లవానికి ముందుతో పోలిస్తే ప్రపంచ సగటు ఉష్టోగ్రత పెరుగుదల 1.21.2°C నుండి 1.3°C ఉంటే..  యూరప్ సగటు పెరుగుదల:    2.3°C నుండి 2.4°C వరకూ ఉంది.  యూరప్‌లో హీట్‌వేవ్స్‌ అంటే  ఎప్పుడో ఒకసారి వచ్చే అరుదైన సంఘటనలు అనుకునేవారు.  2003లో వచ్చిన హీట్‌వేవ్ వల్ల ఖండం అంతటా 70,000 కంటే ఎక్కువ మంది మరణించారు, అప్పట్లో దాన్ని శతాబ్దానికి ఒకసారి వచ్చే విపత్తుగా భావించారు. కానీ ఈరోజు, ఆ అసాధారణ ఉష్ణోగ్రతలే సాధారణంగా మారిపోయాయి. ఒకప్పుడు జూలై నెలలో కాస్త వెచ్చగా ఉండే రోజులు.. ఇప్పుడు సబ్‌ట్రోపికల్ ఎయిర్ మాసెస్ (ఉప-ఉష్ణమండల వాయు ద్రవ్యరాశి) కారణంగా వారాల తరబడి కదలకుండా ఉండిపోతున్నాయి. యూరప్ ఊహించిన దానికంటే వేగంగా ఎందుకు వేడెక్కుతోంది? (Why Europe Is Heating Faster)? యూరప్ ఇంత వేగంగా వేడెక్కడం ప్రారంభంలో వాతావరణ నమూనాలను  సైతం ఆశ్చర్యపరిచింది. అయితే శాస్త్రవేత్తలు దీని వెనుక ఉన్న నిర్దిష్టమైన కారణాలను కనుగొన్నారు. గ్రీన్‌హౌస్ వాయువులు:  ప్రపంచ వ్యాప్తంగా ఇండస్ట్రియలైజేషన్ ప్రభావం ఉంది. గ్రీన్‌ హౌస్ ఉద్గారాలు ఎక్కువుగా వచ్చే పరిశ్రమలు యూరోప్‌లో తక్కువే. కానీ..  గ్రీన్‌ హౌస్ హౌస్ ప్రభావం మాత్రం యూరోప్‌ మీద ఎక్కువుగా ఉంది. ఎందుకంటే ప్రపంచమంతా ఓ వేడి దుప్పటిలా వ్యాపించిన ఈ వాయువుల వ్యాప్తి అన్ని చోట్ల సమానంగా లేదు. యూరప్ ఉన్న భౌగోళిక స్థానం వల్ల ఈ ఉష్ణోగ్రత మార్పులకు ఇది ఎక్కువగా గురవుతోంది.  ఆర్క్టిక్ యాంప్లిఫికేషన్ (Arctic Amplification): ఉత్తర ధ్రువంలోని ఆర్కిటిక్ ప్రాంతం ప్రపంచ సగటు కంటే దాదాపు నాలుగు రెట్లు వేగంగా వేడెక్కుతోంది. ఆర్క్టిక్ సముద్రపు మంచు కరిగేకొద్దీ, అది తెల్లటి మంచుకు బదులుగా ముదురు రంగులో ఉండే సముద్రపు నీటిని బయటకు తీస్తుంది. ఈ నీరు సూర్యరశ్మిని అంతరిక్షంలోకి రిఫ్లెక్ట్‌ చేయకుండా Absorb చేస్తోంది. యూరోప్ నార్త్ పోల్‌కు దగ్గరగా ఉండటం వల్ల దాని ఎఫెక్ట్ ఎక్కువుగా ఉంటోంది.  భూమధ్యరేఖకు మరియు ఉత్తర ధ్రువానికి మధ్య ఉన్న ఉష్ణోగ్రత వ్యత్యాసం గణనీయంగా తగ్గుతోంది.  జెట్ స్ట్రీమ్ బలహీనపడటం (Jet Stream Changes): ఈ ఉష్ణోగ్రత వ్యత్యాసం తగ్గడం వల్ల 'పోలార్ జెట్ స్ట్రీమ్' (ఉత్తర అర్ధగోళంలో వాతావరణాన్ని శాసించే అధిక ఎత్తులో వేగంగా ప్రవహించే గాలి) అస్థిరంగా మారింది. జెట్ స్ట్రీమ్ వేగం తగ్గినప్పుడు, అది వంకరగా మారి ఒకే చోట నిలిచిపోతుంది. మరీ ముఖ్యంగా, యూరప్ మీదుగా "జెట్ స్ప్లిటింగ్" (గాలి రెండు పాయలుగా చీలడం) జరుగుతోందని శాస్త్రవేత్తలు గమనించారు. ఈ చీలిక వల్ల పశ్చిమ మరియు మధ్య యూరప్ మీదుగా గాలి కదలికలు లేని ఒక నిశ్చల ప్రాంతం ఏర్పడుతుంది. ఈ నిశ్చలత వేడి గాలిని వారాల తరబడి ఒకే చోట బంధిస్తుంది. హై-ప్రెషర్ సిస్టమ్స్- హీట్ డోమ్స్ (Heat Domes): బలహీనపడిన జెట్ స్ట్రీమ్ వల్ల, అధిక పీడన వ్యవస్థలు (High-pressure systems) యూరప్ భూభాగాలపై నిలిచిపోతాయి. ఈ వ్యవస్థలు ఒక పెద్ద హీట్ డోమ్ లా పనిచేస్తాయి. అధిక పీడనం గాలిని భూ ఉపరితలం వైపు నెట్టడం వల్ల, గాలి కుదించబడి థర్మోడైనమిక్‌గా వేడెక్కుతుంది. అంతేకాకుండా, ఈ హీట్ డోమ్ మేఘాలను వర్షాన్ని ఇచ్చే వాతావరణ వ్యవస్థలను దరిచేరనివ్వదు.మేఘాలు లేకపోవడం వల్ల సూర్యరశ్మి నేరుగా భూమిని తాకుతుంది.  మెడిటరేనియన్ సముద్రం వేడెక్కడం (Mediterranean Sea Warming): మధ్యధరా సముద్రం ప్రపంచ మహాసముద్రాల సగటు కంటే చాలా ఎక్కువ రేటుతో వేడెక్కుతోంది. వేసవి ప్రారంభంలో, ఈ సముద్రం ఒక భారీ ఉష్ణ నిధిలా పనిచేస్తుంది. ఇది దక్షిణ యూరప్ తీర దేశాలను చల్లబరచడానికి బదులుగా, చుట్టుపక్కల గాలిలోకి విపరీతమైన వేడిని  తేమను విడుదల చేస్తుంది. ఇది రాత్రి వేళల్లో కూడా వాతావరణం చల్లబడకుండా అడ్డుకుంటూ స్పెయిన్, ఇటలీ, గ్రీస్ దేశాలలో హీట్‌వేవ్‌లను మరింత తీవ్రతరం చేస్తోంది. ఈ ఏడాది వేడి ఇంత దారుణంగా ఎందుకంటే.. శీతాకాలంలో ఆల్ప్స్ పర్వతాలలో తక్కువ మంచు కురవడం, వర్షాలు లేకపోవడం వల్ల దక్షిణ మరియు మధ్య యూరప్ ముందే తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంది. సూర్యరశ్మి తడి నేలపై పడినప్పుడు, ఆ శక్తిలో చాలా భాగం నీటిని ఆవిరి చేయడానికి (Latent Heat) ఖర్చవుతుంది. కానీ నేల పూర్తిగా ఎండిపోయినప్పుడు, సూర్యశక్తి 100% నేరుగా భూమిని  దాని పైన ఉన్న గాలిని వేడి చేయడానికి (Sensible Heat) ఉపయోగపడుతుంది. ఈ ఏడాది ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీలలో ఎండిపోయిన నేలలు ఈ దుష్ట వలయాన్ని సృష్టించి, వేడి తీవ్రతను రెట్టింపు చేశాయి.  నార్త్ అట్లాంటిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ వెచ్చని సముద్ర ఉపరితలం.. గతంలో పశ్చిమ యూరప్‌ను చల్లబరిచే చల్లని సముద్ర గాలులను రానివ్వకుండా అడ్డుకుంటోంది.  ప్రపంచ స్థాయిలో, శక్తివంతమైన ఎల్ నినో (El Niño) చక్రం వాతావరణంలో మిగిల్చిన అదనపు వేడి కూడా ఈ ప్రాంతీయ ఉష్ణోగ్రతలు ఆల్‌టైమ్ రికార్డులను బద్దలు కొట్టడానికి ఒక బేస్‌లైన్‌గా పనిచేసింది                                                                                                                                                                                                                                                                                                               దారుణంగా ప్రభావితమైన  యూరోప్ యూరోప్ దేశాలు ఈ ఆధునిక తరం చూడనటువంటి ఘోర వాతావరణ పరిస్థితును అనుభవిస్తున్నాయి. మన దగ్గర 45 డిగ్రీలు అంటే మామూలే కానీ యూరోప్‌లో ఊహించగలమా.. కానీ స్పెయిన్‌లో 45డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. మాడ్రిడ్‌లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. పోర్చ్‌గల్‌ అయితే 44 డిగ్రీలతో మండిపోతోంది. రోడ్లమీద షవర్లు ఏర్పాటు చేశారు. ఫ్రాన్స్‌లో క్లైమేట్ ఎమర్జెన్సీ విధించారు. దాదాపుగా వెయ్యిమంది వృద్ధులు ఫ్రాన్స్‌లో చనిపోయినట్లు అంచనా. ఇటలీ, జర్మనీ, గ్రీస్ అన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నవే. UKలో అయితే రైలు సర్వీసులు నిలిపేశారు. నీటి వినియోగంపై నిషేధం పెట్టారు.  దెబ్బతిన్న రవాణా వ్యవస్థ ఈ వాతావరణ మార్పులు ఆహార ఉత్పత్తులు పారిశ్రామికీకరణపై ప్రభావం చూపడం చూస్తూనే ఉంటాం. తుపాన్లు, వరదలు, మంచు వల్ల రవాణా వ్యవస్థ దెబ్బతింటం వింటాం. కానీ వేడి వల్ల యూరోప్‌లో రవాణా వ్యవస్థ దెబ్బతింది తెలుసా..? యూరప్ రైల్వే నెట్‌వర్క్‌లు కాంక్రీట్ స్లీపర్లపై అమర్చిన వెల్డెడ్ పట్టాలను ఉపయోగిస్తాయి. ఇవి సాధారణంగా గరిష్టంగా డిగ్రీల ఉష్ణాన్ని తట్టుకోగలుగుతాయి. కానీ గాలి ఉష్ణోగ్రత 40 దాటితో పట్టాల ఉష్ణోగ్రత 52 డిగ్రీలకు చేరుతోంది. దీంతో అవి వ్యాకోచిస్తున్నాయి. పట్టాలు వంకరగా అయిపోతుండటంతో ప్రమాదకర స్థాయి వచ్చేసింది. వేడి గాలికి సాంద్రత (Density) తక్కువగా ఉంటుంది. ఇది విమాన ఇంజిన్ల థ్రస్ట్ , రెక్కల లిఫ్ట్ (పైకి లేచే శక్తి)ని తగ్గిస్తుంది. దీనివల్ల దక్షిణ యూరప్ విమానాశ్రయాలలో రన్‌వే పొడవును బట్టి విమానాలు సురక్షితంగా టేకాఫ్ కావడానికి ప్రయాణీకులను.. కార్గోను తగ్గించాల్సి వస్తోంది. శీతల వాతావరణం కారణంగా యూరోప్‌ మెట్రో స్టేషన్లలో ఏసీలు ఉండవు. కానీ  ఈవేడి వాతావరణంలో అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో ప్రజలు అగచాట్లు పడుతున్నారు.  ఎండుతున్న నదులు... ఆగిపోయిన విద్యుత్  యూరోప్‌లో విద్యుత్‌ కు నదులలో నీటికి సంబంధం ఉంది. అణువిద్యుత్ టర్బైన్లను చల్లబరచడానికి నదుల నీటిని వాడుతారు. అయితే వాటిలో నీటి నిల్వలు తగ్గిపోవడంతో జలచరాలను కాపాడటానికి ఓ పరిమితికి మించి నీటిని విద్యుత్ కేంద్రాలకు పంపరు. ఇప్పుడు వాటిలో నీరు తగ్గడంతో విద్యుత్ ప్లాంట్లకు నీరు ఆగిపోయింది. దాని వల్ల ఉత్పత్తి తగ్గింది.ఇంకో వైపు వేడి తట్టుకోలేక జనాలు ఏసీలు కొని వాడుతున్నారు. సాధారణంగా యూరోప్‌లో ఏసీల వాడకం తక్కువ .దీంతో గ్రిడ్‌పై ఒత్తిడి పెరిగిపోతోంది.  చాలా దేశాలు తమ రోజువారీ కార్యకలాపాలను మార్చుకుంటున్నాయి. పనివేళలను తెల్లవారు జాముకు మార్చారు. మధ్యాహ్నం పూట ఆఫీసులకు సెలవులు ఇచ్చారు. యూరోప్‌ పర్యాటకం తగ్గిపోయింది. బారిసోలనా వంటి చోట్ల మళ్లీ పాతపద్దతిలో రోడ్లు ( రోడ్డుపై భారీ వృక్షాలు పెంచడం) వంటి వాటివైపు వెళుతున్నారు. పారిస్ వంటి నగరాల్లో "కూల్ పాత్స్" (చల్లని మార్గాలు) మ్యాప్ చేసి, ప్రజల కోసం పార్కులను 24 గంటలు తెరిచి ఉంచుతున్నారు.  శాస్త్రవేత్తల తీవ్ర హెచ్చరికలు  IPCC, WMO, కోపర్నికస్ మరియు యూరప్ ఎన్విరాన్‌మెంట్ ఏజెన్సీ వంటి ప్రముఖ సంస్థల శాస్త్రవేత్తల అభిప్రాయం ఒక్కటే: యూరప్ ప్రస్తుత వాతావరణం తాత్కాలికమైనది కాదు, ఇది మరింత భయంకరమైన భవిష్యత్తుకు ముందస్తు సూచన.  "యూరప్ ప్రపంచ సగటు కంటే రెండింతలు వేగంగా వేడెక్కుతోంది మరియు ఈ ధోరణి మరింత పెరుగుతోంది. ఉద్గారాలను వెంటనే తగ్గించకపోతే  నగరాలను మార్చకపోతే.. ఈరోజు మనం చూస్తున్న హీట్‌వేవ్‌లే భవిష్యత్తులో సాధారణ వేసవి కాలాలుగా మారుతాయి." అని కొపర్నికస్ క్లైమోటికల్ సర్వీసస్ ప్రకటించింది.    యూరప్ ఒక ప్రెషర్ కుక్కర్‌లా మారడం అనేది భవిష్యత్తులో వచ్చే సమస్య కాదు; అది ప్రస్తుతం జరుగుతున్న నిఖార్సైన నిజం. మానవ తప్పిదాల వల్ల వస్తున్న వాతావరణ మార్పులు యూరప్ వాతావరణాన్ని శాశ్వతంగా మార్చేశాయని సైన్స్ స్పష్టం చేస్తోంది. చారిత్రక నగరాలు వేడికి తలవొగ్గుతున్న వేళ, విద్యుత్ గ్రిడ్‌లు కుప్పకూలుతున్న వేళ.. ఈ సంక్షోభం ప్రపంచ దేశాలన్నింటికీ ఒక హెచ్చరిక. సంపద కానీ, అత్యాధునిక సాంకేతికత కానీ ప్రకృతి సృష్టించే థర్మోడైనమిక్ శక్తుల ముందు నిలవలేవు. యూరప్ భవిష్యత్తు.. తను సృష్టించుకున్న ఈ కొత్త వేడి వాతావరణానికి ఎంత వేగంగా అలవాటు పడుతుందనే దానిపైనే ఆధారపడి ఉంది.

    Mavigun Vs Amaravati: అమరావతి స్థానంలో మావిగన్ సాధ్యమేనా? జగన్ గెలిచినా పేరు కూడా మార్చలేరా?

    Mavigun: అమరావతి రాజధానిగా పార్లమెంట్‌లో చట్టం అయింది. . భవిష్యత్తులో జగన్ గెలిచినా రాజధానిని మావిగన్‌గా మార్చడం సాధ్యమేనా? దీనికి ఉన్న చట్టపరమైన, రాజ్యాంగపరమైన ప్రతిబంధకాలు అధిగమిచగలరా? Jagan Mohan Reddy Mavigun Capital Proposal: ఆంధ్రప్రదేశ్ రాజధాని చుట్టూ సాగుతున్న రాజకీయ చదరంగం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. గతంలో  మూడు రాజధానుల  నినాదాన్ని ఎత్తుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు తాజాగా మచిలీపట్నం- విజయవాడ-గుంటూరు నగరాలను కలుపుతూ 110 కిలోమీటర్ల పరిధిలో  మావిగన్ కోస్తా అర్బన్ కారిడార్‌ను ప్రత్యామ్నాయ రాజధాని నమూనాగా తెరపైకి తెచ్చారు. అయితే, రాజకీయంగా ఈ నినాదం ఎంత ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో ఒకవేళ జగన్ ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చినా కూడా అమరావతిని మార్చడం లేదా దాని పేరును మావిగన్ గా రూపాంతరం చేయడం చట్టపరంగా సాధ్యమేనా? అంటే.. న్యాయ నిపుణులు  అసాధ్యం అనే సమాధానమే ఇస్తున్నారు. దీనికి కారణం అమరావతికి లభించిన అత్యున్నత రాజ్యాంగపరమైన మరియు పార్లమెంటరీ రక్షణే. అమరావతిపై పార్లమెంట్‌లో చట్టం ఈ ప్రతిబంధకాల్లో అత్యంత కీలకమైనది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చట్టపరమైన నిర్ణయం. అమరావతి రాజధానిగా నిలదొక్కుకోవడానికి, భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారకుండా ఉండటానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ  సవరణ  చట్టం, 2026 ను ఉభయ సభల్లోనూ ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  అమరావతి మాత్రమే ఏకైక ఏకీకృత రాజధానిగా చట్టబద్ధమైన హోదా పొందింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3, 4 ల ప్రకారం దేశంలో రాష్ట్రాల సరిహద్దులు, రాజధానుల ఏర్పాటుపై పార్లమెంట్‌కు సర్వాధికారాలు ఉంటాయి. కేంద్ర చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తన సొంత అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర చట్టాన్ని అధిగమించలేదు.  2022లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ల్యాండ్‌మార్క్ జడ్జిమెంట్ ప్రకారం.. రాజధానిని ఏకపక్షంగా మార్చే లేదా విభజించే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదు. ఇప్పుడు దానికి పార్లమెంట్ చట్టబద్ధమైన బ్యాకింగ్ కూడా తోడవడంతో రాజధాని మార్పు అనేది దాదాపు అసాధ్యంగా మారింది.  రెండో ప్రతిబంధకం.. భూసేకరణ చట్టం మరియు రైతుల హక్కులు.  అమరావతి కోసం సుమారు 29,000 మంది రైతులు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద 33,000 ఎకరాల భూములను ప్రభుత్వానికి అప్పగించారు. ఇది కేవలం ఒక భూసేకరణ కాదు.. రాష్ట్ర ప్రభుత్వానికి, రైతులకు మధ్య జరిగిన చట్టబద్ధమైన ఒప్పందం . ఒకవేళ జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చి  మావిగన్  వైపు అడుగులు వేయాలని చూస్తే.. ఈ ల్యాండ్ పూలింగ్ ఒప్పందాల ఉల్లంఘన కింద కోర్టులు తీవ్రంగా పరిగణిస్తాయి. గతంలో మూడు రాజధానుల ప్రక్రియను కోర్టులు అడ్డుకోవడానికి ఇదే ప్రధాన కారణం. రైతుల ప్రయోజనాలను కాలరాస్తూ, ఇప్పటికే వేల కోట్లు ఖర్చు చేసిన అమరావతి మౌలిక సదుపాయాలను వదిలివేయడం  ప్రజాధనం దుర్వినియోగం కిందకు వస్తుందని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇక మూడోది, అంతర్జాతీయ , జాతీయ ఆర్థిక సంస్థల ఒప్పందాలు అమరావతి అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్,  కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా భారీ ఎత్తున నిధులు, రుణాలు మంజూరవుతున్నాయి. ఈ ఒప్పందాలన్నీ  అమరావతి అనే నిర్దిష్ట భౌగోళిక రాజధాని ప్రాంతం పేరుతోనే జరిగాయి. ఇప్పుడు హఠాత్తుగా మచిలీపట్నం లేదా గుంటూరు వైపు అడ్మినిస్ట్రేషన్‌ను తరలించి  మావిగన్  కోరిడార్ అంటే.. ఆర్థిక సంస్థలు నిధుల విడుదలను నిలిపివేయడమే కాకుండా, రాష్ట్రంపై చట్టపరమైన చర్యలు తీసుకునే ప్రమాదం ఉంది. ఇది ఏపీని కోలుకోలేని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తుంది.  వైఎస్ జగన్ ప్రతిపాదిస్తున్న  మావిగన్  అనేది రాజకీయంగా మైలేజ్ పొందడానికి ,  వైఎస్సార్సీపీ క్యాడర్‌లో జోష్ నింపడానికి ఉపయోగపడే నినాదమే తప్ప, ప్రాక్టికల్‌గా ,  లీగల్‌గా సాధ్యం కాని వ్యవహారం. పార్లమెంట్ చేసిన అమరావతి ఏకైక రాజధాని చట్టాన్ని రద్దు చేయాలంటే మళ్లీ కేంద్రంలో పార్లమెంట్ మాత్రమే సవరణ చేయాలి తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ అధికారం ఉండదు. అందువల్ల జగన్ గెలిచినా, ఓడినా ఏపీ రాజధానిగా అమరావతి  స్థానాన్ని మార్చడం కానీ, దాని అస్తిత్వాన్ని దెబ్బతీయడం కానీ చట్టబద్ధమైన రాజ్యాంగ వ్యవస్థల ముందు చెల్లకుండా పోతుందనేదే నిఖార్సైన నిజమని చెప్పుకోవచ్చు. 

    Gurthukosthunnayi Web Series Review - 'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: ETV Winలో కొత్త వెబ్ సిరీస్... నవ్వుల నోస్టాల్జియా బావుందా?

    OTT Review - Gurthukosthunnayi On ETV Win: విరాజ్ అశ్విన్ హీరోగా రూపొందిన ఈటీవీ విన్ ఒరిజినల్ వెబ్ సిరీస్ 'గుర్తుకొస్తున్నాయి'. జూలై 3 నుంచి స్ట్రీమింగ్. ఈ సిరీస్ నోస్టాల్జియాలోకి తీసుకు వెళ్ళిందా? ETV Win Original Series Gurthukosthunnayi Review In Telugu: 'బేబీ' హీరో విరాజ్ అశ్విన్ నటించిన ఈటీవీ విన్ ఒరిజినల్ వెబ్ సిరీస్ 'గుర్తుకొస్తున్నాయి'. వినోద్ గాలి దర్శకత్వం వహించారు. శరత్ చంద్ర నాయుడు నిర్మించారు. విరాజ్ అశ్విన్ జంటగా యశశ్రీ రావు నటించగా... రోహిణి హట్టంగడి, శివన్నారాయణ నారిపెద్ది, ప్రియదర్శిని రామ్, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు. జూలై 3 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్. అయితే... జూలై 1న శ్రీరాములు థియేటర్‌లో స్పెషల్ ప్రీమియర్ వేశారు. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకోండి. కథ (Gurthukosthunnayi Web Series Story Explained In Telugu): సంతోష్ (విరాజ్ అశ్విన్)కు పెళ్లి కుదురుతుంది. స్కూల్‌లో తన క్లాస్‌మేట్ వైశాలి (యశశ్రీ రావు)తో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి కూడా ప్రేమిస్తుంది. అయితే... వైశాలి తండ్రి, తన స్కూల్ హెడ్ మాస్టర్ రఘునాథ్ (ప్రియదర్శిని రామ్) ఒప్పుకోడు. ఆయన్ను ఎట్టకేలకు ఒప్పించి ఏడు అడుగులు వేయడానికి రెడీ అవుతాడు. స్నేహితులు గణేష్ (వైవా రాఘవ), శ్రీకాంత్ (సిద్ధూ పవన్), ఆనంద్ (గోదావరి గోపి)కి విషయం చెబుతాడు. గోవాలో బ్యాచిలర్స్ పార్టీ అడుగుతారు. జాతకం ప్రకారం మూడు రోజులు హైదరాబాద్ సిటీ దాటి బయటకు వెళ్ళకూడదని నాన్నగారు చెప్పారని సంతోష్‌కు వైశాలి చెబుతుంది. రఘునాథ్ మాటను కూడా లెక్క చేయకుండా స్నేహితులతో కలిసి గోవా వెళతాడు సంతోష్. దారిలో గేదె అడ్డు వస్తుంది. దాన్ని తప్పించబోయి సడన్ బ్రేక్ వేస్తాడు. స్టీరింగ్‌కు తల గట్టిగా తగలడంతో గతం మర్చిపోతాడు. సంతోష్ సమస్యను దాచి, గతాన్ని మర్చిపోయాడని చెప్పకుండా పెళ్లి చేయాలని తండ్రి (శివన్నారాయణ), స్నేహితులు నిర్ణయించుకుంటారు. అయితే... సంతోష్‌ సమస్య డాక్టర్ అయినటువంటి రఘునాథ్ స్నేహితుడు అయ్యప్ప స్వామి (అనీష్ కురువిల్లా)కు తెలుసు. కాబోయే అల్లుడికి ఓ యాక్సిడెంట్ అయ్యిందని, గతం మర్చిపోయాడని పోలీస్ కంటే డేంజర్ అయిన రఘునాథ్‌కు తెలిసిందా? గజినీలా మారిన సంతోష్ ఏం చేశాడు? సంతోష్ చేసే పనుల వల్ల తల్లిదండ్రులు, స్నేహితులు ఎన్ని ఇబ్బందులు పడ్డారు? విశాలికి అయినా అసలు విషయం చెప్పారా? చివరకు ఏమైంది? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి. విశ్లేషణ (Gurthukosthunnayi Web Seires Telugu Review): 'గుర్తుకొస్తున్నాయి... గుర్తుకొస్తున్నాయి' - రవితేజ 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్'లో పాట. ఆ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో నోస్టాల్జియా మూమెంట్స్ టచ్ చేశారు. ఈటీవీ విన్ హిట్ సిరీస్ '90స్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' కూడా ఆనాటి రోజులు గుర్తు చేసింది. మరి, లేటెస్ట్ సిరీస్ 'గుర్తుకొస్తున్నాయి' ప్రత్యేకత ఏమిటి? ఇందులో ఏముంది? 'గుర్తుకొస్తున్నాయి'... ముందు ఈ టైటిల్ గురించి చెప్పాలి. సిరీస్ చూసేటప్పుడు 2003 నుంచి 2007 మధ్యలో స్కూల్‌కు వెళ్లిన వీక్షకులకు అప్పటి రోజులు గుర్తుకు వస్తాయి. అది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైటిల్ జస్టిఫికేషన్ అయితే... సిరీస్‌లో హీరో గతం మర్చిపోతాడు కనుక... అది గుర్తుకు రావడం కథ పరమైన జస్టిఫికేషన్. రెండు విధాలుగా టైటిల్ సెట్ అయ్యింది. టైటిల్ ఒక్కటే కాదు... కథతో పాటు సన్నివేశాలు కూడా భలే సెట్ అయ్యాయి. సింపుల్ కథతో 'గుర్తుకొస్తున్నాయి...' సిరీస్ తెరకెక్కించారు. ఆ సింప్లిసిటీలో ప్రతి వీక్షకుడి మనసును టచ్ చేసే మూమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు 30లలో ఉన్న ప్రేక్షకులను ఒక్కసారిగా స్కూల్ ఏజ్‌లోకి తీసుకు వెళ్లే మేజిక్ కథ, కథనం, దర్శకత్వంలో ఉన్నాయి. చిన్నప్పుడు స్కూల్‌లో చేసిన అల్లరితో పాటు అప్పటి ప్రేమలు, మధుర జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేస్తుంది. నోస్టాల్జియా మూమెంట్స్ కంటే సిట్యువేషనల్ ఫన్ ఎక్కువ వర్కవుట్ అయ్యిందీ సిరీస్‌లో. కథగా చూస్తే... 'గుర్తుకొస్తున్నాయి' కొత్తది ఏమీ కాదు. తమిళంలో విజయ్ సేతుపతి ఈ తరహా కథతో ఓ సినిమా చేశారు. మంచు మనోజ్ 'నేను మీకు తెలుసా?' కూడా వచ్చింది. అయితే... కథలు వేర్వేరు. కథనంతో పాటు వినోదం ఆకట్టుకుంటుంది. హీరో గతం మర్చిపోయిన తర్వాత ఆ విషయాన్ని దాచడానికి తండ్రితో పాటు స్నేహితులు పడే పాట్లు నవ్విస్తాయి. చివరి ఎపిసోడ్‌లో ఎమోషన్స్ కూడా టచ్ చేస్తాయి.శ్రీరాములులో 'గుర్తుకొస్తున్నాయి' చూస్తున్నప్పుడు... సినిమా చూస్తున్న అనుభూతి కలగడానికి ప్రధాన కారణం పాటలే. సిరీస్‌లోని ప్రతి పాట బావుంది. ఎస్ నివాస్ బాణీలు మళ్ళీ మళ్ళీ వినేలా ఉన్నాయి. అజయ్ అరసాడా నేపథ్య సంగీతం సైతం చక్కగా కుదిరింది. కామెడీ సీన్లకు ఆర్ఆర్ భలే చేశారు. రెహాన్ షైక్ సినిమాటోగ్రఫీ, శరత్ చంద్ర నాయుడు నిర్మాణ విలువలకు పేరు పెట్టడానికి లేదు. ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. హీరోలు అందరినీ టచ్ చేశారు. ఖుషి పాటల పుస్తకం నుంచి ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఖుషి అయ్యేలా సీన్స్ తీశారు. అప్పటి సూపర్ హిట్ పాటలను నేపథ్యంలో వినిపించారు. సంతోష్ పాత్రలో విరాజ్ అశ్విన్‌ను చూశాక... మరొకర్ని ఊహించుకోలేం. అంత చక్కగా నటించారు. హ్యాండ్సమ్ లుక్స్ ఒక్కటే కాదు... క్యారెక్టర్‌కు అవసరమైన కామిక్ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. గజినీలా మారిన తర్వాత చెప్పిందే మళ్ళీ చెప్పి, చేసిందే మళ్ళీ చేసే సన్నివేశాల్లో విరాజ్ అశ్విన్ ఇన్నోసెన్స్, యాక్టింగ్ బావున్నాయి. వైవా రాఘవ, గోదావరి గోపీ, సిద్ధూ పవన్... స్నేహితులుగా నటించిన ముగ్గురూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ముగ్గురిలో వైవా రాఘవకు కాస్త ఎక్కువ మార్కులు పడతాయి. కథకు కీలకమైన సన్నివేశాల్లో ఎమోషన్స్ బాగా పలికించారు. తనలో కమెడియన్ మాత్రమే కాదు... సీరియస్ యాక్టర్ కూడా ఉన్నాడని నిరూపించుకునే అవకాశం అతనికి దక్కింది. వైశాలి పాత్రలో యశశ్రీ లుక్స్ ఓకే. కానీ, నటనలో ఇంప్రూవ్ అవ్వాలి. ఎమోషనల్ సీన్స్‌లో పరిణితి చెందాలి. కొన్ని సన్నివేశాల్లో లిప్ సింక్ కూడా సరిగా లేదు. కానీ యశశ్రీ తండ్రిగా నటించిన ప్రియదర్శిని రామ్ (Priyadarshini Ram)ను అస్సలు మర్చిపోలేం. ఆయన నటన మాత్రమే కాదు... గొంతులోని గాంభీర్యం కూడా సిరీస్ చూశాక గుర్తుంటుంది. స్కూల్ ప్రిన్సిపాల్‌గా ఎంత స్ట్రిక్ట్‌గా కనిపించారో... తండ్రిగా కుమార్తె భవిష్యత్తు గురించి ఆలోచించే సన్నివేశాల్లో అంతే ఆలోచన చూపించారు. శివన్నారాయణ, గోపరాజు రమణతో ప్రియదర్శిని రామ్ కాంబినేషన్ సీన్స్ భలే నవ్విస్తాయి. హీరో తాతయ్య, అమ్మమ్మ పాత్రల్లో శుభలేఖ సుధాకర్, రోహాణి హట్టంగడి తమ అనుభవాన్ని చూపించారు. బాల నటులు, మిగతా ఆర్టిస్టులు కూడా బాగా చేశారు. సిరీస్‌కు పర్ఫెక్ట్ క్యాస్టింగ్ కుదిరింది. గుర్తుకొస్తున్నాయి... ఇదో నవ్వుల నోస్టాల్జియా. సిరీస్‌లో ఉన్నది సింపుల్ కథే. కానీ, ఆడియన్స్ హార్టును టచ్ చేసే మూమెంట్స్ ఉన్నాయి. నవ్వులు లోటు లేదు. ఫస్ట్ నుంచి చివరి ఎపిసోడ్ వరకు నవ్విస్తూ... తర్వాత ఏం జరుగుతుందోనని చిన్నపాటి క్యూరియాసిటీ కలిగిస్తూ ఉంటుంది. సినిమాకు తగ్గని ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది. డోంట్ మిస్ ఇట్.

    Username Row: వాట్సాప్ తర్వాత యూజర్‌నేమ్ వివాదంలో సిగ్నల్, టెలిగ్రామ్‌లకు ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు!

    Username Row: యూజర్‌నేమ్ వివాదం తీవ్రతరం అవుతోంది. వాట్సాప్ తర్వాత, ఇప్పుడు టెక్నాలజీ మంత్రిత్వ శాఖ టెలిగ్రామ్, సిగ్నల్‌కు నోటీసులు జారీ చేసింది.  Username Row: యూజర్‌నేమ్ ఫీచర్‌కు సంబంధించిన వివాదం తీవ్రమవుతూనే ఉంది. వాట్సాప్ తర్వాత, ఎలక్ట్రానిక్స్ -ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఇప్పుడు టెలిగ్రామ్, సిగ్నల్‌కు వాటి ప్రస్తుత యూజర్‌నేమ్ ఫీచర్‌ను ప్రశ్నిస్తూ నోటీసులు జారీ చేసింది. అదనంగా, యూజర్‌నేమ్ మోసాలు, నకిలీ ఐడీలు, సైబర్ నేరాలను నివారించడానికి తాము ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారని రెండు ప్లాట్‌ఫారమ్‌లను క్వశ్చన్ చేసింది.  టెలిగ్రామ్- సిగ్నల్‌కు నోటీసు పీటీఐ వార్తా సంస్థ కథనం ప్రకారం, తమ ప్లాట్‌ఫామ్‌లో యూజర్‌నేమ్ ఫీచర్‌ను కొనసాగించాల్సిన అవసరంపైనా, దాని దుర్వినియోగాన్ని నివారించేందుకు తీసుకున్న భద్రతా చర్యలపైనా టెలిగ్రామ్ నుంచి కేంద్ర ప్రభుత్వం స్పందన కోరింది. ఒక రోజు ముందు, బుధవారం నాడు, కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌కు సంబంధించి MeitYకి ఒక నోటీసు కూడా జారీ చేసింది. యూజర్‌నేమ్ ఫీచర్‌ను దుర్వినియోగం చేయడం వల్ల ఆన్‌లైన్ మోసాలు, నకిలీ ఐడీలు, డిజిటల్ అరెస్టులు వంటి సైబర్ నేరాలకు దారితీయవచ్చని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. మెటాకు ప్రభుత్వం నోటీసు  వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌కు సంబంధించి కేంద్రం మెటాను ప్రశ్నించింది. ఐటీ చట్టం, సంబంధిత నిబంధనల కింద వాట్సాప్‌పై ఎందుకు చర్యలు తీసుకోకూడదని అడిగింది. అయితే, వాట్సాప్ తన బ్లాగులో తన వాదనను వినిపిస్తూ, యూజర్‌నేమ్ ఫీచర్ వినియోగదారు గోప్యతను కాపాడుతుందని, అలాగే వినియోగదారు తమ మొబైల్ నంబర్‌ను అందరితో పంచుకోకుండా నిరోధిస్తుందని పేర్కొంది. కొత్త ఫీచర్ గురించి వాట్సాప్ ఏం చెప్పింది? వాట్సాప్ తన కొత్త 'యూజర్‌నేమ్' ఫీచర్‌కు సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నలను (FAQs) విడుదల చేసింది, అందులో 'యూజర్‌నేమ్' ఫీచర్ తప్పనిసరి కాదని, ఐచ్ఛికమని పేర్కొంది.