Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..

    2 hours ago

    TFR India : భారతదేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గతుంది. కానీ పిల్లలు కావాలనే కోరిక మాత్రం ఎక్కువగానే ఉందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. మరి దీనికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

    NFHS Fertility Rate : భారతదేశంలో సంతానోత్పత్తి రేటు మొత్తం (Total Fertility Rate - TFR) 2.1 నుంచి 1.9కి పడిపోవడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. స్థిరమైన జనాభా కొనసాగడానికి అవసరమైన "రిప్లేస్‌మెంట్ లెవల్" కంటే ఈ సంఖ్య తక్కువగా ఉండటంతో భవిష్యత్తులో దేశ జనాభా నిర్మాణంపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

    ఈ గణాంకాన్ని కేవలం ప్రజలు పిల్లలను కనడం తగ్గించారు అనే కోణంలో చూడకూడని నిపుణులు చెప్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం.. భారతదేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గడం వెనుక ఆర్థిక, సామాజిక, ఆరోగ్య సంబంధిత అనేక కారణాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రజలు కోరుకునే కుటుంబం, వాస్తవంగా వారికి ఉన్న పిల్లల సంఖ్య మధ్య కూడా గణనీయమైన వ్యత్యాసం కనిపిస్తోందని తెలిపారు.

    సంతానోత్పత్తి రేటు (TFR) అంటే..

    ఒక మహిళ తన జీవితకాలంలో సగటున ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుందో తెలిపే సూచికను మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR) అంటారు. సాధారణంగా ఒక దేశ జనాభా స్థిరంగా ఉండాలంటే ఈ రేటు 2.1గా ఉండాలని జనాభా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం భారతదేశంలో ఇది 1.9కు చేరింది.

    గణాంకాలు ఒకటి.. వాస్తవంలో మరోటి

    TFRలో పుట్టిన ప్రతి శిశువు లెక్కలోకి వస్తాడు. ఆ గర్భం ప్రణాళికాబద్ధంగా వచ్చినదా? అవాంఛితమా? లేక కొడుకు కావాలనే ఆశతో మరోసారి గర్భం దాల్చారా? అనే అంశాలు ఇందులో ప్రతిబింబించవు. అందుకే జనాభా నిపుణులు "కోరుకున్న సంతానోత్పత్తి రేటు" (Wanted Fertility Rate)ను కూడా పరిశీలిస్తారు. ఈ లెక్కల ప్రకారం భారతీయ మహిళలు సగటున 1.6 మంది పిల్లలను మాత్రమే కోరుకుంటున్నారు. కానీ వాస్తవంలో చూస్తే ఇద్దరు పిల్లలకు జన్మనిస్తున్నారు. అంటే ఒక్కో మహిళకు సగటున 0.4 మంది పిల్లలు ఆమె అసలు ప్రణాళికలో లేనివారై ఉండే అవకాశం ఉందని రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. 

    వ్యత్యాసానికి ప్రధాన కారణం

    సంతానోత్పత్తి రేటు తగ్గుతున్నప్పటికీ.. అవాంఛిత గర్భాలు పూర్తిగా తగ్గలేదు. దీనికి కుటుంబ నియంత్రణ సాధనాల వినియోగంలో లోపాలు, గర్భనిరోధక పద్ధతులపై అవగాహన లేకపోవడం, కొడుకు కావాలనే సామాజిక ఒత్తిడి, మహిళలకు కుటుంబ నిర్ణయాల్లో పూర్తి స్వేచ్ఛ లేకపోవడం, పిల్లల మధ్య సరైన విరామం కోసం ఆధునిక గర్భనిరోధక పద్ధతులు తక్కువగా ఉపయోగించడం వంటివి కారణాలుగా ఉంటున్నాయి.

    యువత ఎంత మంది పిల్లలు కావాలనుకుంటున్నారు?

    ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (UNFPA) నిర్వహించిన సర్వే ప్రకారం.. యువతలో కుటుంబం ఏర్పాటు చేయాలనే ఆసక్తి ఇంకా బలంగానే ఉంది. అయితే వారికి ఎదురవుతున్న ఆర్థిక పరిస్థితులు ఆ నిర్ణయాన్ని వాయిదా వేయిస్తున్నాయట. చాలామంది భవిష్యత్తుపై ఆశావహంగా ఉన్నారని.. కానీ దాదాపు సగం మంది ఆర్థిక అస్థిరత, ఉద్యోగ భద్రత, పెరుగుతున్న జీవన వ్యయం గురించి తీవ్ర ఆందోళనతో ఉన్నట్లు వ్యక్తం చేశారు.

    57 శాతం మంది ఇల్లు, డబ్బు లేకపోవడం పెళ్లికి ప్రధాన అడ్డంకిగా పేర్కొన్నారు. 81 శాతం మంది ఆర్థిక స్థిరత్వం లేకుండా కుటుంబ జీవితాన్ని ప్రారంభించడం కష్టమని అభిప్రాయపడ్డారు. అంటే పిల్లలను కనాలనే కోరిక లేకపోవడం కాదు, పరిస్థితులు అనుకూలించకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

    ప్రత్యేకంగా కనిపిస్తున్న మరో ధోరణి

    అభివృద్ధి చెందిన దేశాల్లో వివాహాలు ఆలస్యంగా జరుగుతుండటంతో సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది. కానీ భారతదేశంలో పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. ఇక్కడ ఎక్కువ మంది మహిళలు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటున్నారు. తొలి బిడ్డ కూడా చిన్న వయసులోనే పుడుతున్నారు. అనంతరం ఒకటి లేదా రెండు పిల్లల తర్వాత కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకోవడం సాధారణంగా కనిపిస్తోంది. ఈ విధానం వల్లే మొత్తం సంతానోత్పత్తి రేటు వేగంగా తగ్గిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

    భవిష్యత్తులో దీని ప్రభావం ఎలా ఉంటుంది?

    సంతానోత్పత్తి రేటు చాలా కాలం పాటు 2.1 కంటే తక్కువగానే కొనసాగితే కొన్ని దీర్ఘకాలిక ప్రభావాలు కనిపించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అవేంటంటే.. వృద్ధుల జనాభా శాతం పెరగడం, పనిచేసే యువ జనాభా తగ్గడం, పెన్షన్, ఆరోగ్య వ్యవస్థలపై అధిక భారం పడడం, ఆర్థిక వృద్ధి మందగించే అవకాశం, నైపుణ్యం కలిగిన శ్రామికుల కొరత ఏర్పడడం వంటివి ఉంటాయి. అయితే ఈ ప్రభావాలు ఒక్కసారిగా కనిపించవు. ఇవి దశాబ్దాల కాలంలో క్రమంగా ఏర్పడే మార్పులు.

    నిపుణులు ఏమంటున్నారంటే..

    జనాభా తగ్గుదలను కేవలం కుటుంబ విలువలు మారిపోయాయి అనే కోణంలో చూడడం సరైంది కాదని నిపుణులు చెబుతున్నారు. యువత కుటుంబాలను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నప్పటికీ.. ఉద్యోగ భద్రత, ఆదాయం, గృహ వ్యయం, పిల్లల పెంపకం ఖర్చులు వంటి అంశాలు వారి నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. మరోవైపు అవాంఛిత గర్భాలను పూర్తిగా నివారించేందుకు నాణ్యమైన కుటుంబ నియంత్రణ సేవలు అందరికీ అందుబాటులో ఉండేలా చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

    ఒకవైపు కొందరు దంపతులు కోరుకున్నంత మంది పిల్లలను కనలేకపోతుంటే, మరోవైపు కొందరు మహిళలు అవాంఛిత గర్భాలను నివారించలేకపోతున్నారు. అందువల్ల జనాభా విధానాల్లో సంఖ్యలకంటే ప్రజల అవసరాలు, ఎంపికలు, జీవన నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడం భవిష్యత్తులో మరింత కీలకంగా మారనుంది.

    Click here to Read More
    Previous Article
    Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే!
    Next Article
    Rashmika : రష్మికకు తీవ్ర గాయం - ఆరు వారాలు షూటింగ్స్‌కు బ్రేక్... డాక్టర్స్ ఏం చెప్పారంటే?

    Related లైఫ్‌స్టైల్ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment