Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?

    19 hours ago

    AP local polls 2026: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ కంటే కూటమి పార్టీల మధ్యే అసలైన పోరు నడుస్తోంది. నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలతో టీడీపీ-జనసేన అంతర్గత సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి.

    Chandrababu Pawan Kalyan Alliance  AP local polls :  ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రస్తుతం రాబోయే స్థానిక సంస్థల  ఎన్నికల చుట్టూ తిరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రాత్మక విజయంతో కూటమి పక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీలు అధికారంలోకి వచ్చినప్పటికీ, రాబోయే స్థానిక పోరు మాత్రం సరికొత్త సమీకరణాలను తెరపైకి తెస్తోంది. ఈ ఎన్నికల్లో అధికార కూటమికి విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా పోటీ ఇచ్చే పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. అసలైన పోటీ, అంతర్గత ఘర్షణ అంతా కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్యే కేంద్రీకృతమైంది. గ్రామీణ స్థాయి అధికారం, ఉనికి కోసం ఇరు పార్టీల ద్వితీయ శ్రేణి నాయకత్వం ఒకరితో ఒకరు తలపడటానికి సిద్ధమవుతుండటంతో, లోకల్ పోల్స్ కాస్తా కూటమి అంతర్గత బల ప్రదర్శనకు వేదికగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

    సీట్లపై ఏకాభిప్రాయం కష్టమే!

    ఈ అంతర్గత వేడికి ప్రధాన కారణం సీట్ల కేటాయింపులపై ఇరు పార్టీల అగ్రనేతల మధ్య వ్యూహాత్మక భిన్నాభిప్రాయాలు వ్యూహాత్మకంగా బయటకు రావడమే. గత అసెంబ్లీ ఎన్నికల నాటి సీట్ల పంపకాల ఫార్ములా  టీడీపీకి 85 శాతం, జనసేనకు 15 శాతం  బేస్ చేసుకుని స్థానిక సంస్థల్లోనూ ముందుకెళ్లాలని టీడీపీ భావించింది. కానీ, ఈ అసెంబ్లీ ఫార్ములా క్షేత్రస్థాయిలో అస్సలు పనిచేయదని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ  చైర్మన్ నాదెండ్ల మనోహర్ తేల్చేశారు. సార్వత్రిక ఎన్నికల నాటి త్యాగాలను ప్రతి ఊరిలోనూ పునరావృతం చేయలేమని, క్షేత్రస్థాయిలో తమకున్న బలాన్ని బట్టి తాము తగ్గేదే లేదంటూ జనసేన పట్టుబట్టడం కూటమి శ్రేణుల్లో ఒక్కసారిగా రాజకీయ వేడిని పుట్టించింది.

    క్యాడర్ ను పెంచుకోవడానికి గొప్ప అవకాశం

    ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, రాయలసీమలోని కొన్ని కీలక నియోజకవర్గాల పరిధిలో ఈ కోల్డ్ వార్ తీవ్ర రూపం దాల్చుతోంది. గత ఐదేళ్లుగా వైఎస్సార్‌సీపీ వేధింపులను తట్టుకుని నిలబడిన స్థానిక టీడీపీ కేడర్..  మేము ఎమ్మెల్యే సీటునే త్యాగం చేశాం, కనీసం మా ఊరి సర్పంచ్, ఎంపీటీసీ సీటు కూడా మాకు ఇవ్వకపోతే ఎలా అని గట్టిగా నిలదీస్తున్నారు. మరోవైపు, కూటమి అధికారంలోకి రావడానికి తమ జనసైనికుల ఓట్లే ప్రధాన కారణమని, క్షేత్రస్థాయిలో తమ అభ్యర్థులకు మెజారిటీ స్థానాలు కేటాయించకపోతే ఊరుకునేది లేదని జనసేన ద్వితీయ శ్రేణి లీడర్లు భీష్మించుకు కూర్చున్నారు. పైస్థాయిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న కెమిస్ట్రీ కిందిస్థాయి గడప దాటడం లేదనేది దీని ద్వారా స్పష్టమవుతోంది.

    తిరుగబాటు అభ్యర్థుల సమస్య ఎక్కువ ఖాయం

    ఈ రాజకీయం రాబోయే రోజుల్లో పలు ఆసక్తికరమైన మలుపులు తిరిగే అవకాశం ఉంది. ఎక్కడైతే అధికారికంగా సీటు దక్కదో, అక్కడ ఇరు పార్టీల ఆశావహులు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. పల్లెల్లో సర్పంచ్ స్థానం అనేది కేవలం ఒక పదవి మాత్రమే కాదు, అది గ్రామాల్లో ఒక నిర్దిష్ట సామాజిక వర్గానికి, కుటుంబానికి ఉండే ప్రతిష్టకు సంబంధించిన అంశం. అందువల్ల అగ్రనాయకత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా కిందిస్థాయి లీడర్లు వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఈ అంతర్గత ఓట్ల చీలిక కొన్నిచోట్ల స్వతంత్రులకు లేదా తెరవెనుక పొంచి ఉన్న విపక్ష వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు అనూహ్యంగా లాభం చేకూర్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

    సమన్వయం సాధించడం అంత తేలిక కాదు!

    పైస్థాయి నాయకత్వం మధ్య ఉన్న సమన్వయం కింద కూడా లేకపోతే వచ్చే ఈ తీవ్రమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి కూటమి అధిష్టానం సరికొత్త అస్త్రాలను ప్రయోగించాల్సి ఉంటుంది. కేవలం నోటి మాటలతో కాకుండా, జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఇరు పార్టీల కీలక నేతలతో  ఉమ్మడి కో-ఆర్డినేషన్ కమిటీలను  ఏర్పాటు చేయాలి. ఎక్కడైతే ఇరు పార్టీలు బలంగా ఉన్నాయో, అక్కడ ఏకాభిప్రాయం కుదరకపోతే.. ఆయా గ్రామాల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్  కి అనుమతించడం లేదా ఒక పార్టీకి సర్పంచ్ ఇస్తే, మరో పార్టీకి ఎంపీటీసీ ఇచ్చేలా సమతుల్యత పాటించడం ఏకైక మార్గంగా కనిపిస్తోంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కూటమి ప్రభుత్వ ప్రజాదరణకు మాత్రమే కాదు, వారి అంతర్గత బంధానికి కూడా ఒక పెద్ద అగ్నిపరీక్ష. పైస్థాయిలో ఉన్న దోస్తీని క్షేత్రస్థాయి సమన్వయం  ద్వారా పల్లెల్లోకి తీసుకెళ్లడంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎంతవరకు సఫలమవుతారనే దానిపైనే కూటమి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. తమ సొంత అహంకారాలు, ఈక్వేషన్ల వల్ల పొత్తుల రొంపిలో తమ్ముళ్లు, సైనికులు కొట్టుకోకుండా చూసుకోవడమే ప్రస్తుతం కూటమి ముందున్న అసలైన టాస్క్. 

     

    Click here to Read More
    Previous Article
    Naga Chaitanya Sobhita Dhulipala : చై.. నా శారీ ఎలా ఉంది? - శోభిత క్వశ్చన్‌కు చై క్యూట్ రియాక్షన్... లెనిన్ సక్సెస్‌పై వెరీ హ్యాపీ
    Next Article
    UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment