Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Telangana BJP Internal Rifts: తెలంగాణ బీజేపీలో గాడిన పడని బండి - లంచ్ డిప్లమసీ ఓకే.. మరి అసలు పంచాయితీ తేలేనా?

    3 hours ago

    Telangana BJP Group Politics: తెలంగాణ బీజేపీలో బండి సంజయ్, ఈటల రాజేందర్ లంచ్ భేటీతో గొడవలు సర్దుమణిగాయా? ఆర్ఎస్ఎస్ వర్సెస్ వలస నేతలు కలసి పని చేసి పార్టీకి అధికారం తెచ్చి పెడతారా?

    Abhay Patil Reconciliation Bandi vs Eatala:  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, రాబోయే రోజుల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఆవిర్భవించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న భారతీయ జనతా పార్టీకి సొంత నేతల అంతర్గత పోరు పెద్ద శాపంగా మారింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య రీతిలో 8 స్థానాలు సాధించి గ్రాఫ్‌ను పెంచుకున్నప్పటికీ, ఆ తర్వాత క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య సమన్వయ లోపం, ఆధిపత్య పోరాటాలు వీధిన పడటంతో పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది.  పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకు జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్ హైదరాబాద్ వాలి, సీనియర్ ఎంపీ కె. లక్ష్మణ్ నివాసంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్‌ల మధ్య  లంచ్ మీటింగ్ పెట్టి  సయోధ్య కుదిర్చే యత్నం చేశారు. పైకి ఇద్దరు నేతలు కౌగిలించుకుని  మా మధ్య విభేదాలు లేవు  అని ప్రకటించినప్పటికీ, తెలంగాణ బీజేపీలోని అసలు వ్యాధికి ఇది తాత్కాలిక పూత మాత్రమేనని ఎక్కువ మంది నమ్ముతున్నారు. 

    ఇంకా గ్రూపులున్నాయి!

    నిజానికి తెలంగాణ బీజేపీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కేవలం బండి సంజయ్, ఈటల రాజేందర్‌ల మధ్య ఉన్న కరీంనగర్ జిల్లా రాజకీయ ఆధిపత్య పోరు మాత్రమే కాదు. పార్టీలో ఎప్పటినుంచో ఉన్న నాయకులు  వర్సెస్ వలస నాయకుల సైద్ధాంతిక పోరాటం అత్యంత సంక్లిష్టమైనది. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ వంటి నేతలు ఒకవైపు ఉంటే.. బిఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి వచ్చి పార్టీలో చేరిన ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు వంటి కీలక నేతలు మరోవైపు ఉన్నారు. పార్టీ సిద్ధాంతాలు, నిర్ణయాధికారాలు, పదవుల పంపిణీలో తమకు ప్రాధాన్యత దక్కడలేదనే ఆవేదన వలస నేతల్లో నివురుగప్పిన నిప్పులా ఉంది. 

    ఎవరికి వారే రాజకీయం 

    దీనికి తోడు తెలంగాణ బీజేపీకి పిల్లర్ లాంటి లీడర్ అయిన కిషన్ రెడ్డి  మృదువైఖరి  కి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అనుసరించే  మాస్-ఆగ్రస్సివ్ వైఖరి కి మధ్య పొంతన కుదరడం లేదు. కార్యకర్తలను, ప్రజలను వీధుల్లోకి తీసుకురావడంలో బండి సంజయ్ శైలికి లభించే ఆదరణ ఒకలా ఉంటే, పార్టీ యంత్రాంగాన్ని నడిపే కిషన్ రెడ్డి శైలి మరోలా ఉందనే అభిప్రాయం కేడర్‌లో ఉంది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ వంటి జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు, శ్రేణుల నిర్వహణ విషయంలో జిల్లా నేతలు గ్రూపులుగా విడిపోయి బహిరంగంగానే విమర్శలు గుప్పించుకోవడం అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. మరో ప్రధాన సమస్య—క్షేత్రస్థాయిలో పెరిగిన ఓటు బ్యాంకును క్రియాశీలక సభ్యత్వంగా, బలమైన బూత్ స్థాయి కమిటీలుగా మలచడంలో సమన్వయ రాహిత్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. పదేళ్ల బిఆర్ఎస్ పాలన ముగిసి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వేళ.. ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాల్సిన కీలక సమయాన్ని బీజేపీ నేతలు తమ సొంత విభేదాలను పరిష్కరించుకోవడానికే వెచ్చిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండో శ్రేణి నాయకత్వం మధ్య తీవ్ర పోటీ వాతావరణం నెలకొనడంతో, కొత్తగా చేరాలనుకుంటున్న ఇతర పార్టీల సీనియర్ నేతలు కూడా బీజేపీ వైపు రావడానికి పునరాలోచనలో పడే పరిస్థితి దాపురించింది.

    హైకమాండ్ చల్లార్చాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి! 

    అభయ్ పాటిల్, సునీల్ బన్సల్ వంటి ఢిల్లీ ప్రతినిధులు ఎంత తీవ్రంగా ప్రయత్నించినా, లక్ష్మణ్ నివాసంలో కుదిరిన లంచ్ డిప్లమసీ వంటి  ఫొటో-ఆప్‌ల తో అంతర్గత అసంతృప్తి చల్లారే అవకాశం కనిపించడం లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష మార్పుపై లేదా కార్యవర్గ ప్రక్షాళనపై స్పష్టత వచ్చే వరకు ఈ విభేదాలు సమసిపోవు. ముఖ్యంగా, ఎంపీలుగా గెలిచిన అగ్రనేతలందరికీ స్పష్టమైన బాధ్యతలు అప్పగించడంతో పాటు, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిని కలుపుకునిపోయే దిశగా క్లియర్  కమాండ్ స్ట్రక్చర్  ఏర్పాటు చేయకపోతే కింది స్థాయిలో అయోమయం కొనసాగుతూనే ఉంటుంది. నియోజకవర్గ స్థాయిలో సొంత శ్రేణులను ఏకం చేయగలిగితేనే తెలంగాణలో బీజేపీ రేసులో నిలుస్తుంది. లేనిపక్షంలో, నేతల ఆధిపత్య పోరు కాంగ్రెస్‌కు వరంలా మారి, బీజేపీ ప్రత్యామ్నాయ కల నెరవేరడం ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుందని అనుకోవచ్చు. 

     

    Click here to Read More
    Previous Article
    CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
    Next Article
    Nandamuri Deepika: ఎన్టీఆర్ వదిన రాజకీయాల్లోకి వస్తారా? సేవా కార్యక్రమాల్లో హరికృష్ణ పెద్ద కోడలు

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment