Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Kaleshwaram NDSA Report Medigadda: మేడిగడ్డ వద్ద ఎత్తిపోయకపోవడంతోనే పట్టిసీమకు గోదావరి -ఈ వాదనలో నిజం ఎంత?

    2 hours ago

    Godavari Water: పట్టిసీమకు నీళ్లు అందడం కోసమే మేడిగడ్డ వద్ద రేవంత్ నీళ్లు ఎత్తిపోయడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే అక్కడ ఎత్తిపోయాలంటే నీరు నిల్వ చేయాల్సిందేనని ప్రభుత్వం అంటోంది.

    Kannepalli Pump House vs Pattiseema Lift Irrigation:    తెలంగాణలో గత పదేళ్లుగా అతిపెద్ద పొలిటికల్ అజెండాగా మారిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం  భవితవ్యంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన తుది నివేదిక ఇంజనీరింగ్ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. మేడిగడ్డ  కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో లీకేజీలు రావడంపై లోతుగా పరిశోధించిన కేంద్ర నిపుణుల కమిటీ.. ప్రాజెక్టు పునాదుల్లోనే  తీవ్రమైన లోపాలున్నట్లు తేల్చింది. ఈ బ్యారేజీలను ప్రస్తుత స్థితిలో అలాగే ఉంచి పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది.  

     ఎన్డీఎస్ఏ నివేదిక సారాంశం - తప్పు ఎక్కడ జరిగింది?

    మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ కుంగిపోవడానికి ప్రధాన కారణం పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడమే  అని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసింది. బ్యారేజ్ నిర్మించిన ప్రాంతంలో జియో-టెక్నికల్ సర్వేలు సరిగ్గా చేయలేదని, రాఫ్ట్ ఫౌండేషన్ డిజైన్ తప్పుగా ఉందని నివేదికలో వేలెత్తి చూపింది. దీనికి తోడు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలోనూ ఇదే తరహా బురద నీరు లీక్ అవ్వడం   గమనించిన కమిటీ.. ఈ మూడు బ్యారేజీలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నందున ఒకదాని ప్రభావం మరొకదానిపై పడుతుందని పేర్కొంది. తాత్కాలికంగా లీకేజీలు పూడ్చడం , సిమెంట్ వాల్స్ నిర్మించినప్పటికీ.. ఈ మూడు బ్యారేజీలను పూర్తిగా పునర్నిర్మించాలా  లేదా భారీ మార్పులతో సరిపెట్టాలా అనే డైలమాలో ఇంజనీర్లు ఉన్నారు.

     రిపేర్లు ఎప్పటికి పూర్తవుతాయి? 

    ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం.. కాళేశ్వరం బ్యారేజీల శాశ్వత పునరుద్ధరణ పనులు పూర్తి కావడానికి కనీసం  రెండేళ్ల నుంచి మూడేళ్ల సమయం  పట్టే అవకాశం ఉంది. నదిలో నీటి ప్రవాహం లేని ఎండకాలం  లో మాత్రమే పునాది స్థాయి పనులు చేయడం సాధ్యమవుతుంది. వరదలు వచ్చే జూన్ నుంచి అక్టోబర్ వరకు ఎలాంటి కాంక్రీట్ పనులు చేయలేరు. ప్రస్తుతం కేవలం వర్షాకాలంలో వచ్చే వరదలను బ్యారేజీలు తట్టుకునేలా తాత్కాలిక రక్షణ చర్యలు మాత్రమే చేపట్టారు. రూ. కోట్లు ఖర్చు పెట్టినా.. మునుపటిలా 141 మీటర్ల మేర మేడిగడ్డలో నీటిని నిల్వ ఉంచి పంపింగ్ చేయడం ప్రస్తుతానికి అసాధ్యం.

     మళ్లీ  తమ్మిడిహెట్టి  వైపు చూపు ఎందుకు? లాభమేంటి? 

    కాళేశ్వరం బ్యారేజీలు ఎప్పుడు బాగుపడతాయో తెలియని ఐడల్ సిట్యుయేషన్‌లో.. పాత ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ అయిన తమ్మిడిహెట్టి  ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. తమ్మిడిహెట్టి వద్ద గోదావరి ఉపనది అయిన ప్రాణహిత ప్రవాహం స్వచ్ఛంగా, నమ్మకంగా ఉంటుంది. ఇక్కడ మేడిగడ్డ అంత భారీ స్థాయిలో కాకుండా తక్కువ ఎత్తుతో బ్యారేజ్ నిర్మించవచ్చు. మహారాష్ట్రతో ఉన్న అంతరాష్ట్ర వివాదాలను పరిష్కరించుకుని ఇక్కడ 20 నుంచి 30 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయగలిగితే.. కిందినున్న మేడిగడ్డతో సంబంధం లేకుండానే పాత ఆయకట్టుకు  ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలలోని కొన్ని ప్రాంతాలకు గ్రావిటీ లేదా తక్కువ లిఫ్టింగ్‌తో నీరివ్వవచ్చు. విద్యుత్ ఖర్చు కూడా భారీగా తగ్గుతుంది.

     పట్టిసీమ నీళ్లు.. కన్నెపల్లి నుంచి వచ్చాయా? 

    ఇక పట్టిసీమ, కన్నెపల్లిల మధ్య ఉన్న సంబంధంపై సామాన్యుల్లో చాలా అపోహలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని  పట్టిసీమ ఎత్తిపోతల పథకం అనేది కృష్ణా డెల్టాను ఆదుకోవడానికి గోదావరి నది పోలవరం కుడి కాలువ పై నిర్మించిన ప్రాజెక్టు. పట్టిసీమ వద్ద ఎత్తిపోస్తున్న నీళ్లు తెలంగాణలోని కన్నెపల్లి మేడిగడ్డ పంప్ హౌస్ నుంచి వచ్చినవి కావు. కన్నెపల్లి పంప్ హౌస్ అనేది గోదావరి ఉపనది అయిన ప్రాణహిత జలాలను ఎత్తిపోస్తుంది. ఈ కన్నెపల్లి మేడిగడ్డకు ఎగువన ఉంటుంది. భౌగోళికంగా చూస్తే.. కన్నెపల్లి నుంచి కిందకు ప్రవహించే గోదావరి జలాలు ఇంద్రావతి, శబరి వంటి ఇతర ఉపనదులను కలుపుకుని చివరకు రాజమండ్రి దాటి అంతర్వేది, యానాం వద్ద సముద్రంలో కలుస్తాయి. ఆ రాజమండ్రికి ఎగువన ఉన్న పట్టిసీమ వద్ద ఏపీ ప్రభుత్వం నీటిని లిఫ్ట్ చేస్తుంది.

     అక్కడ ఎత్తిపోసి ఉంటే.. పట్టిసీమకు నీళ్లు వచ్చేవి కావా? 

    ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం కన్నెపల్లి వద్ద పూర్తి స్థాయిలో  రోజుకు 2 లేదా 3 టీఎంసీలు  నీటిని ఎత్తిపోసినప్పటికీ.. పట్టిసీమకు వచ్చే నీటికేమీ ఢోకా ఉండదు. ఎందుకంటే, ప్రాణహిత నది ద్వారా వర్షాకాలంలో వచ్చే వరద దాదాపు 1500 నుంచి 2000 టీఎంసీల వరకు ఉంటుంది. కన్నెపల్లి వద్ద తెలంగాణ గరిష్టంగా 100 లేదా 150 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేయగలదు. మిగిలిన భారీ వరద నీరంతా దిగువకే ప్రవహిస్తుంది. దీనికి తోడు కన్నెపల్లి దాటాక గోదావరిలో కలిసే ఇంద్రావతి, శబరి నదుల ప్రవాహం చాలా ఎక్కువ. కాబట్టి కన్నెపల్లి వద్ద నీటిని ఎత్తిపోసినా, పోయకపోయినా.. దిగువన ఉన్న పట్టిసీమకు  తగినంత నీరు ఎప్పుడూ లభ్యమవుతూనే ఉంటుంది.

     ఇంజనీరింగ్ రీ-లైన్‌మెంట్ తప్పదా? 

    మొత్తంగా చూస్తే, కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం రాజకీయ వివాదమే కాదు.. ఒక భారీ ఇంజనీరింగ్ విఫలయత్నంగా నిలిచింది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా అటు మేడిగడ్డ రిపేర్లు చేస్తూనే.. ఇటు తమ్మిడిహెట్టి వంటి ప్రత్యామ్నాయాల ద్వారా గోదావరి జలాలను వాడుకోవాలనే సరికొత్త వ్యూహంతో తెలంగాణ నీటిపారుదల శాఖ అడుగులు వేస్తోంది. భారీ వ్యయంతో కూడిన లిఫ్టుల కంటే, సురక్షితమైన, స్థిరమైన డిజైన్లతోనే రైతాంగానికి దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందనేది ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిన అంతిమ పాఠం.

     

    Click here to Read More
    Previous Article
    One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
    Next Article
    Corona Cases: ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment