Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Pithapuram Roads: పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం

    1 hour ago

    Pawan Kalyan | పిఠాపురం నియోజకవర్గంలో రూ. 207 కోట్లతో 307 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాన్ని చేపట్టగా, ఇప్పటికే రూ. 100 కోట్లతో 611 రోడ్ల పనులను పవన్ కళ్యాణ్ పూర్తి చేయించారు.

    పిఠాపురం: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక ఆదర్శవంతమైన మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గవ్యాప్తంగా పల్లెల నుంచి పట్టణాల వరకు మౌలిక వసతుల కల్పనకు, ముఖ్యంగా రహదారుల పునర్నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కేవలం రోడ్ల నిర్మాణం, మరమ్మతుల కోసమే ఏకంగా రూ. 200 కోట్లకు పైగా నిధులను వెచ్చించారు. 

    జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సాస్కీ (SASKI), రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖల భాగస్వామ్యంతో మొత్తం 307 కిలోమీటర్ల మేర నూతన రహదారుల నిర్మాణ ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే రూ. 100 కోట్ల అంచనా వ్యయంతో 152 కిలోమీటర్ల మేర 611 రోడ్ల నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. నిర్ణీత లక్ష్యంలో దాదాపు 80 శాతం పనులు పూర్తి కావడంతో పిఠాపురం నియోజకవర్గంలో రవాణా వ్యవస్థ రూపురేఖలు మారిపోయి గ్రామాల్లో కొత్త కళ సంతరించుకుంది.
    3 ఏళ్ల నిరీక్షణకు తెరదించారు..
    రహదారుల నిర్మాణంలో ప్రజల, రైతులు, మత్స్యకారుల అవసరాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. దశాబ్దాలుగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న ఉప్పాడ తీరప్రాంత మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా జెట్టీకి వెళ్లే మార్గంలో గ్రావెల్ రోడ్డును నిర్మించి వారి రవాణా కష్టాలను తీర్చారు. అంతేకాకుండా సముద్ర కోత వల్ల ఇళ్లను కోల్పోయిన మాయాపట్నం మత్స్యకారులకు సుబ్బంపేట సమీపంలో కల్పించిన కొత్త మాయాపట్నం పునరావాస కాలనీలో 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రూ. 1.52 కోట్లతో 1.5 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 2.8 కిలోమీటర్ల డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

    కొత్తసూరాడపేట పునరావాస కాలనీకి సైతం రూ. 93 లక్షలతో 1.6 కిలోమీటర్ల సిమెంటు రోడ్లు నిర్మించి, ప్రధాన రహదారికి అనుసంధానం చేశారు. తుపాన్ల ధాటికి పూర్తిగా కొట్టుకుపోయిన యు.కొత్తపల్లి మండలంలోని అమరవిల్లి-రామన్నపాలెం బీచ్ రోడ్డును రూ. 88 లక్షలతో పునర్నిర్మించడం ద్వారా వేలాది మంది ప్రజలకు, స్థానిక బషీర్ బీబీ ఆలయ దర్శనానికి వెళ్లే భక్తులకు మార్గం సుగమమైంది.

    ఏళ్ల తరబడి ఉన్న సమస్యలకు పరిష్కారం
    సెజ్ పరిధిలో ఉండి ఏళ్ల తరబడి అభివృద్ధికి దూరమైన ముమ్మడివారిపాడు గ్రామానికి రూ. 79.70 లక్షలతో శాశ్వత రహదారిని అందుబాటులోకి తెచ్చారు. కొత్తపల్లి గ్రామంలో ప్రజల చిరకాల కోరికైన శ్మశాన వాటిక దారిని రూ. 26.30 లక్షలతో సీసీ రోడ్డుగా మలిచారు. కొండెవరం గ్రామ పరిధిలోని పిఠాపురం-ఉప్పాడ ఆర్ అండ్ బీ రోడ్డును రూ. 1.22 కోట్ల ఉపాధి నిధులతో పవన్ కళ్యాణ్ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించారు. మరోవైపు దశాబ్దాలుగా గుంతలమయమై నరకప్రాయంగా మారిన గొల్లప్రోలు మండలం వెన్నెపూడి జీఎన్టీ ప్రధాన రహదారిని రూ. 85 లక్షలతో, గొల్లప్రోలు-తాటిపర్తి పుంత రోడ్డును రూ. 1.46 కోట్లతో పునర్నిర్మించి రైతులకు, ప్రయాణికులకు ఊరటనిచ్చారు. చిత్రాడ గ్రామంలోని ఈబీసీ కాలనీ వాసుల కోసం రూ. 3 కోట్లతో సీసీ రోడ్లు, ఆధునిక డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టడంతో పాటు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల భద్రతకై రూ. 50 లక్షలతో ప్రహరీ గోడను నిర్మించారు.


    నిర్దేశిత గడువులోగా రోడ్ల నిర్మాణం పూర్తి: పవన్ కళ్యాణ్
    వ్యవసాయ రంగ సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ 'పల్లెపండుగ 2.0' ద్వారా పంట పొలాల మధ్య ఉన్న డొంక రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పి.రాయవరం, బి. ప్రత్తిపాడు గ్రామాల్లో కోటి రూపాయలకు పైగా వెచ్చించి 3 కిలోమీటర్ల మేర నిర్మించిన గ్రావెల్ రోడ్లు దాదాపు 200 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములకు మెరుగైన రవాణా సదుపాయాన్ని కల్పించాయి. అభివృద్ధి పనులపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పురోగతిలో ఉన్న 70 కిలోమీటర్ల పెండింగ్ రోడ్డు పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రహదారుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని, అధికారులు నిరంతరం పర్యవేక్షణ జరపాలని స్పష్టం చేశారు.

    Click here to Read More
    Previous Article
    Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment